మాతృ భాష అంప శయ్య పై..

మాతృ భాష అంప శయ్య పై ఎదురు చూస్తున్న ఈ రోజుల్లో
భావ వ్యక్తీకరణ వెల్లువై పొంగుతోంది కవుల పదాల్లో
వరదలై పారుతోంది సాహితీ రసగంగ పద్య ధారా కవితల్లో
ఈ సాహితీ సంవేదిక పులకరిస్తోంది కవితల జలపాతంలో

కాలమే మాయమై పోతుంది ఈ కలాల సిరాలో
అలసిన మనసు సేద దీర్చుకుంటుంది కవి కోవిదుల పదలాలనలో
స్వర మాధురీ ఝరులు పరవళ్ళు త్రోక్కుతోంది సాహితీ జగత్తులో
పద్య కవితా కధానికలు జాలువారుతున్నాయి తెలుగు తల్లి ఒడిలో
పల్లవి, చరణం, భావం, స్పురణం అన్నీ ఒక్కటై భువన విజయం బడిలో

ఆంధ్ర మాత పరవశిస్తోంది పరదేశంలో
ఔరా! అని ఉలిక్కి పడుతున్నారు ఆంధ్ర దేశంలో
మీ పలుకు, మాట , కవితా ఊరట కలిగిస్తున్నాయి ఆశల పల్లకిలో
సాహితీ డప్పులు మ్రోగుతున్నాయి నా ప్రియ నేస్తం గుండెల్లో
నాది నీది, నేను నువ్వు బేధాలు కలిసి పోయాయి చితి మంటల్లో
సరస సాహితీ సంబంధాలు కలిమి చేసుకున్నాయి యదలయల్లో

స్వాతి చినుకులా! కావు కావు, సుకవుల సునిశిత మనస్తత్వాలు
సాగర మధనమా! కాదు కాదు, సువిశాల భావాల సుందర స్వప్నం