మానసికంగా శక్తిమంతురాలినే

మానసికంగా శక్తిమంతురాలినే

ఆ మధ్య వివాదాల సుడిగుండంలో చిక్కుకుని అనేక విమర్శలకు గురైన నటి అంజలి ఎట్టకేలకు వాటి నుంచి దాదాపుగా బయటకు వచ్చినట్టే అనుకోవాలి. ఆ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పుకున్నారు కూడా.

ఆమె కథానాయికగా నటించిన హర్రర్ కామెడి సినిమా గీతాంజలి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి హీరోగా నటించారు.

ఈ సందర్భంగా గీతాంజలి మాట్లాడుతూ “నేనెప్పుడూ మానసికంగా బలవంతురాలినే. నేను అన్ని వివాదాలను దీటుగా ఎదుర్కొని తిరిగీ మరింత శక్తిమంతంగా బయటికొచ్చాను. నేను ఏ సినిమా పడితే ఆ సినిమాను ఒప్పుకోను. సినిమా కథలు ఎంచుకోవడం దగ్గరనుంచి నా మనసుకి నచ్చాలి. అప్పుడే నేను ఆ సినిమాలో నటించేందుకు ఒప్పుకుంటాను. అందుకే నేను నటించే సినిమాల్లో మేటిగా కనిపించడంతో పాటు మంచి పాత్రలతో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకోగాలుగుతున్నాను. అదే నా విజయ ఫార్ములా. నేను నా వ్యక్తిగత జీవితాన్ని సినీ జీవితానికి ముడి పెట్టను. అలా నేను నా జీవితాన్ని వెండితెరకు ముడి పెట్టి ఉంటే మళ్ళీ గీతాంజలితో మీ ముందుకు వచ్చి ఉండేదానిని కాను. సినీ పరిశ్రమలోని వారికి, మిత్రులకు నేనేవరూ, నేనేమిటో బాగా తెలుసు. అంతే కాదు నేను నటిగా ఏమివ్వగలను అనేది కూడా నిర్మాతలకు, దర్శకులకు బాగా తెలుసు. అందుకే నా కెరీర్ కు ఎలాంటి ప్రమాదం లేదు. అందుకే నా చుట్టూ అనేక సమస్యలు చుట్టుముట్టినా వాటినుంచి నేను బయట పడగలిగాను. నేను ఎక్కడో అజ్ఞాతంలో దాక్కున్నానని కొన్ని మాటలు వచ్చాయి. కానీ అది సుద్ద తప్పు. నేను మీ ముందే ఉన్నాను. పత్రికల వారి ముందు నేను దాదాపు ప్రతీ నెలా కనిపిస్తూనే ఉన్నాను. అటువంటప్పుడు నేనెక్కడో దాక్కున్నానని చెప్పడం హాస్యాస్పదంగా లేదూ. …. కొన్ని శక్తులు చెప్పే అలాంటి మాటలు ఎవరూ నమ్మకండి. అయినా నేను వివాదాలపై మాట్లాడదలచుకోలేదు. వదంతులపై నేను నోరు పారేసుకోవడం బాగుండదు. వివాదాలపై నాతో మాట్లాడేకన్నా వాటిని మొదలు పెట్టిన వారిపై మీ దృష్టి సారిస్తే మంచిది. నేనైతే వాటి గురించీ ఏమీ చెప్పదలచుకోలేదు. అది సరే గానీ ఇప్పుడు మీ ముందున్న గీతాంజలి సినిమాలో కథంతా ప్రధానంగా నా చుట్టూ తిరుగుతుంది. అలాగే హాస్య బ్రహ్మ బ్రహ్మానందంతో నేను మొదటిసారిగా నటించాను. ఆయన చాల హుందా గల మనిషి. ఆయన ఒక లెజెండ్. మొదట్లో నేను కొంత టెన్స్ ఫీల్ అయినా నేను ఎలాంటి ఒత్తిడి లేకుండా నటించేందుకు ఆయన ఎంతో సహకరించారు. సూచనలు చేసే వారు. ఆయనతో కలిసి నటించడం నాకు ఎంతో గొప్పగా ఉంది. నేను ప్రస్తుతం ఒక తమిళ్ సినిమాకు ఒప్పందం కుదుర్చుకున్నాను. ఆ సినిమాలో హీరోగా జయం రవి నటిస్తున్నారు. అలాగే ఒక కన్నడ ఫిలిం లో పునిత్ రాజ్ కుమార్ తో జోడీగా నటించేందుకు ఒప్పందం చేసుకున్నాను. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే ఇప్పటికిప్పుడు రెండు సినిమాలు నా చేతిలో ఉన్నాయి. త్వరలోనే వాటి వివరాలు వెల్లడిస్తాను. అప్పటిదాకా ఆగండి” అని చెప్పారు.

Send a Comment

Your email address will not be published.