మాసానాం మార్గశీర్షోహం

sagittarius-1ఓ కవి మార్గశిరమాసాన్ని అచ్చతెలుగులో అనువదించి దారి తల మాసమని అన్నారు సరదాగా.

హేమంత రుతువులోని రెండు మాసాలలో ఇది మొదటిది. ఈ మార్గశిరం తర్వాత వచ్చే మరొక మాసం పుష్యమాసం.

మార్గశిర మాసాన్నే ధనుర్మాసమని అంటారు. ఈ మాసంలోనే ధనుస్సు పడతారు. ధనుస్సంక్రమణ షడశీతి పుణ్యకాలం. ఆ సంక్రమణ తర్వాత ధనుర్మాసం. ఈ మాసంలో తెల్లవారుజామునే లేస్తారు. ముంగిళ్ళు తుడిచి కళ్లాపి చల్లి ముగ్గులు పెట్టి ఆ ముగ్గుల మీద గోమయంతో ముద్దలు చేసి ఉంచుతారు. వాటికి వరిపిండితో కుంకుమతో బొట్లు పెట్టి పైన పువ్వులు గుచ్చుతారు.

శ్రీకృష్ణుడికి మార్గశిరమాసమంటే చాలా చాలా ఇష్టం. భగవద్గీతలో ఈ విషయాన్ని చెప్పాడు.

మాసానాం మార్గశీర్షోహం అని అన్నాడు పరమాత్ముడు.

ఈ ధనుర్మాసంలో విష్ణువాలయాలలో తెల్లవారడంతోనే ఆరాధన చేస్తారు. చక్కెర పొంగలి, ధధ్యోదనం చేస్తారు. నైవేద్యం పెట్టి భక్తులకు ఇస్తారు. అలాగే గోదాదేవి కథలు చెప్పుకుంటారు. ఇది అనాదిగా వస్తున్న సంప్రదాయం.

ఆంగ్ల సంవత్సరంలో ఇది పన్నెండో మాసమైనప్పటికీ మన తెలుగు మాసాలలో ఇది తొమ్మిదవది.

మృగశిరా నక్షత్రంతో కూడిన పౌర్ణమిగల మాసం కావడం వల్ల ఈ మాసానికి మార్గశీర్షం అనే పేరు వచ్చింది.

మార్గశిర మాసంలో చలి తీవ్రత పెరుగుతుంది.

మార్గశిర శుద్ధ పాడ్యమినాడు గంగా స్నానం చేస్తే కోటి సూర్య గ్రహణ స్నాన సమాన ఫలం లభిస్తుంది.

మార్గశిర శుద్ధ తదియ రోజు ఉమామహేశ్వర వ్రతం చేస్తారు. ఆరోజునే అనంత తృతీయ వ్రతం కూడా వస్తుంది. అలాగే ఈ రోజునే రంభా తృతీయ వ్రతం కూడా చేస్తారని పురుషార్థ చింతామణి అనే గ్రంధం చెప్తోంది.

మార్గశిర శుద్ధ పంచమినాడు నాగపంచమి జరుపుతారు. దక్షిణాదిలో ఈరోజు విశిష్టమైనది. ఈరోజు నాగ పూజ చేయాలని స్మృతికౌస్తుభం చెప్తోంది. ఆ మర్నాడు అంటే మార్గశిర శుద్ధ షష్టినాడు సుబ్బరాయుడి షష్టి జరుపుతారు. పురాణగాథల్లో సుబ్రహ్మణ్య స్వామి వివాహితుడిగా కనిపిస్తాడు. కాని అతని పూజకు ఉద్దిష్టమయిన ఈ షష్టినాడు బ్రహ్మచారి బ్రహ్మడికి పూజ చేయడం ఆచారంగా వస్తోంది.

ఇక గోదావరి ప్రాంతంలో ఈరోజున రైతులకు పెద్ద పండుగ. షష్టి వెళితే వానలు వెనక పట్టినట్లు వారి నమ్మకం. ఈ రోజులలో మబ్బులు ఉంటూనే ఉంటాయి. కాని వానలు రావు. కనక వానలు కురవని మబ్బులకు షష్టి మబ్బులనే పేరు కూడా ఉంది.

మార్గశిర శుద్ధ ఏకాదశిని ఈ నెలలో ఘనంగా జరుపుకుంటారు. దీనినే సౌఖ్యదైకాదశీ అని అంటారు. ఏకాదశి వ్రతం ఆచరించే వారికి జనన మరణ రహితమైన మోక్షప్రాప్తి కలుగుతుందని ఆస్తికుల విశ్వాసం. మార్గశిర పూర్ణిమనాడు దత్తజయంతి జరుపుకుంటారు. ముఖ్యంగా మహారాష్ట్రులు ఈరోజు దత్తాత్రేయులను కొలవడానికి ప్రత్యేకించి ఈ జయంతి దినంగా పాటిస్తారు. మార్గశిర కృష్ణపక్ష అమావాస్యనాడు మహోదధ్యమావాస్య అని గదాధర పద్ధతిన చెప్తారు. ఇక గురువారాలు కూడా ప్రత్యేకమే. కళింగదేశంలో ఈ వారంనాడు లక్ష్మీపూజ చేసే సంప్రదాయం ఉంది.

Send a Comment

Your email address will not be published.