ముద్దుల పద్దు

ఆమె వంటింటి యుద్ధంలో లీనమై ఉండగా
అతను వెనుకనుండి హఠాత్తుగా అందించిన ముద్దు

ఆమె ఆదమరచి నడిరాతిరి నిదురలోనుండగా
అతను నుదుటిపై ముద్రించిన ఆరనిద్దర ముద్దు

ఆమె కురులరాతిరిలో సిరిమల్లెల తారలు చూసి
అతను భావలాహిరిలో కురిపించిన కవితల ముద్దు

ఆమె ముకుళిత శ్వేతపద్మమై ఎదురుచూస్తుండగా
అతను మన్మథశశిరేఖలతో పంపించిన ముద్దు

ఆమె హృదయపుష్పమర్పించి పూజించుట గాంచి
అతను గుండెల్లో గుడికట్టి తన రూపం ప్రతిష్ఠించి

ఆమె చేమాలను స్వీకరించి, పరవశించి
అతను కన్నులతో కన్నులను కట్టేసిన ముద్దు!

–రమాకాంత్ రెడ్డి మెల్బోర్న్