మూగవోయిన గానకోకిల

మూగవోయిన గానకోకిల

మూగవోయిన భారత గానకోకిల
– లతా మంగేష్కర్ కన్నుమూత
– అరలక్ష పాటల స్వరగంగా ప్రవాహం

ప్రముఖ నేపథ్య గాయని, బారతరత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్‌ ఆదివారం (ఫిబ్రవరి 6) కన్ను మూశారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్‌ ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో నాలుగు వారాలుగా కరోనా చికిత్స తీసుకుంటున్నారు. వైద్యులు మెరుగైన చికిత్స చేసినప్పటికీ ఆమెను కాపాడలేకపోయారు.

ఐదేళ్లకే శిక్షణ..
లతా మంగేష్కర్‌ సెప్టెంబర్‌ 28, 1929న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జన్మించారు. 1942లో తన కళా ప్రయాణాన్ని ప్రారంభించి.. సుమారు 980 సినిమాల్లో పాటలు పాడి తన గానంతో అలరించారు. గాయనీగా కాకుండా నటిగా కూడా చేశారు లతా మంగేష్కర్‌. హిందీ సినిమా పాటల గాయనీ అంటే ముందుగా గుర్తు వచ్చేది లతా మంగేష్కర్‌ పేరే. హిందీ సినీ పరిశ్రమపై అంతలా తనదైన ముద్ర వేశారు. లతా మంగేష్కర్‌ సుప్రసిద్ధ సంగీతకారుడు దీనానాథ్ మంగేష్కర్‌కు పెద్ద కుమార్తెగా (ఐదుగురిలో) జన్మించారు. ఆమె తర్వాత వరుసగా ఆశా భోంస్లే, హృదయనాథ్‌, ఉషా, మీనా ఉన్నారు. ఐదో ఏటనే తండ్రి వద్ద సంగీత శిక్షణ ప్రారంభించారు లతా మంగేష్కర్‌, సంగీతాన్ని వినడం, పాడటం తప్ప మరొక ప్రపంచం లేదు. తాను చదువుకోకపోయినా తన చెల్లెళ్లు మాత్రం పెద్ద చదువులు చదువుకోవాలనుకున్నారు లతా మంగేష్కర్. కానీ వారు కూడా సంగీతంపైనే ఎక్కువ ఆసక్తి చూపడంతో కుటుంబమంతా సంగీతంలోనే స్థిరపడిపోయింది.

టీనేజ్ లోనే గానాన్ని ఆరంభించి..

ఇండియన్‌ నైటింగేల్‌గా పేరొందిన లతా మంగేష్కర్‌ తన 13 సంవత్సరాల వయసులో 1942లో కెరీర్‌ను ప్రారంభించారు. సుమారు 20 భాషల్లో కలిపి మొత్తం 50 వేలకు పైగా పాటలు పాడిన మధుర గాయని. ఆమె తన ఏడు దశాబ్దాల గాయనీ ప్రయాణంలో మరపురాని పాటలను ఎన్నింటినో ఆలపించారు. అందులో ‘అజీబ్‌ దస్తాన్‌ హై యే’, ‘ప్యార్‌ కియా తో డర్నా క్యా’, ‘నీలా అస్మాన్‌ సో గయా’, ‘తేరే లియే’ వంటి అనేక గీతాలకు ఆమె గాత్రంతో ప్రాణం పోశారు. ‘పద్మ భూషణ్‌’, ‘పద్మ విభూషణ్‌’, ‘దాదా సాహెబ్‌ ఫాల్కే’, ‘బహుళ జాతీయ చలనచిత్ర’ అవార్డులతో సహా భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ అవార్డును పొందారు లతా మంగేష్కర్‌.

పెద్ద కుమార్తెగా కుటుంబ బాధ్యత


లతా మంగేష్కర్కు 13 ఏళ్ల వయసులో తండ్రి దీనానాథ్ మంగేష్కర్ ఆర్థిక సమస్యలతో ఆరోగ్యం క్షీణించగా 1942లో మరణించాడు. దీంతో కుటుంబ పోషణ బాధ్యత లతపై పడింది. అందుకే సినీ రంగంలోకి ప్రవేశించాల్సి వచ్చింది. 1942లో మరాఠీ చిత్రం ‘పహ్లా మంగళ గౌర్‌’లో కథానాయిక చెల్లెలుగా నటించి రెండు పాటలు పాడారు. తర్వాత చిముక్లా సుసార్‌ (1943), గజెభావు (1944), జీవన్‌ యాత్ర (1946), మందిర్‌ 1948) తదితర చిత్రాల్లో లతా మంగేష్కర్‌ నటించారు. ఆ కాలంలో ఖుర్షీద్, నూర్జహాన్‌, సురైయాలు గాయనీలుగా వెలుగుతున్నారు. అయితే లతా మంగేష్కర్‌కు నచ్చిన గాయకుడు కె. ఎల్‌. సైగల్‌ అని తెలిపారు.

లతా, బాలూల మధ్య పోలిక

దక్షిణాది గాయకుల్లో ఎంతో మంది ఆమె పక్కన పాడినా.. సక్సెస్‌తోపాటు ఆమెతో ‘వాహ్‌.. శెభాష్‌’ అనిపించుకున్న ఏకైక సింగర్‌ ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం ఒక్కడే. లతా, బాలూల మధ్య ఒక పోలిక ఉంది. లతా భాషలో మరాఠీ స్వభావం ఉందని సంగీత దర్శకుడు నౌషాద్‌ ప్రోత్సహాంతో ఆమె ఉర్దూ నేర్చుకున్నారు. అలాగే తమిళం బాగా నేర్చుకుంటేనే పాడే అవకాశం ఇస్తానని బాలూను సంగీత దర్శకుడు ఎం.ఎస్‌. విశ్వనాథన్‌ ఆదేశించారు. ఇద్దరూ ఆ భాషలను నేర్చుకున్నారు. పాటలో ఉచ్ఛారణకు పట్టం కట్టారు. ఒకరు గానగాంధర్వుడు.. మరొకరు గాన కోకిల.. వీళ్ల కాంబినేషన్‌ సూపర్‌హిట్‌. దేశమంతా పాడుకునే పాటలను వారు కలిసి పాడారు.

లతా మంగేష్కర్‌ పక్కన గోల్డెన్‌ పిరియడ్‌లో రఫీ, కిశోర్, హేమంత్, తలత్, మన్నా డే వంటి ఉద్దండులు ఆలపించారు. కానీ, బాలు పక్కన పాడేప్పుడు మాత్రం ఆమె ఫుల్‌ ఎనర్జీ, జోష్‌తో పాడడం గమనించొచ్చు.

తెలుగులో హిట్‌ అయిన ‘మరో చరిత్ర’ను దర్శకుడు కె.బాలచందర్‌ హిందీలో ‘ఏక్‌ దూజే కే లియే’ (1981)గా రీమేక్‌ చేయాలనుకున్నప్పుడు సంగీత దర్శకులుగా పీక్‌లో ఉన్న లక్ష్మీకాంత్‌–ప్యారేలాల్‌లను తీసుకున్నారు. లతా పక్కన బాలూ చేత పాడించాలని బాలచందర్‌ కోరారు. దీనికి లతా మంగేష్కర్‌ అభ్యంతరం చెప్పలేదు కానీ, లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌ కొంత నసిగారట. ‘బాలూ పాడితే దక్షిణాది శ్లాంగ్‌ వచ్చినా పర్వాలేదు. పాడించండి. ఎందుకంటే నా హీరో తమిళుడు కదా సినిమాలో’ అన్నారు బాలచందర్‌. ఇక లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌లకు తప్పలేదు. ఎప్పుడైతే బాలు పాట విన్నారో.. ‘ఒక గాయకుడు పాటను ఎలా నేర్చుకోవాలో తెలియాలంటే బాలూ చూసి నేర్చుకోండి’ అని ముంబైలో అందరికీ చెప్పడం మొదలెట్టారు లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌.

గతంలో బాలూ తన గొంతుకు సర్జరీ చేయించుకుంటున్నప్పుడు.. అది గాత్రానికే ప్రమాదం అని తెలిసి లతాజీ చాలా కంగారు పడటం, ‘వద్దు నాన్నా..’ అంటూ ఆమె వారించడం గురించి స్వయంగా బాలూనే పలు సందర్భాల్లో చెప్పడం చూశాం. అంతేకాదు.. హైదరాబాద్‌లో ఘంటసాల విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా బాలూ ఆహ్వానం మీద లతా హైదరాబాద్‌ వచ్చారు.

‘ఏక్‌ దూజే కే లియే’లో లతా–బాలూ పాడిన పాటలు దేశాన్ని ఊపేశాయి. ‘తేరే మేరే బీచ్‌ మే’ పాట డ్యూయెట్‌గా, బాలూ వెర్షన్‌గా వినపడని చోటు లేదు. ‘హమ్‌ బనే తుమ్‌ బనే’, ‘హమ్‌ తుమ్‌ దోనో జబ్‌ మిల్‌ జాయేంగే’… ఈ పాటలన్నీ పెద్ద హిట్‌. ఈ సినిమాకు బాలూకి నేషనల్‌ అవార్డ్‌ వచ్చింది. ఆ తర్వాత రమేష్‌ సిప్పీ తీసిన ‘సాగర్‌’ (1985) కోసం లతాతో బాలూ ‘ఒమారియా ఒమారియా’ పాడి హిట్‌ కొట్టారు. కాని అన్నింటి కంటే పెద్ద హిట్‌ ‘మైనే ప్యార్‌ కియా’ (1989)తో వచ్చింది. సల్మాన్‌ ఖాన్, భాగ్యశ్రీల ఈ తొలి సినిమాలో సల్మాన్‌కు బాలూ, భాగ్యశ్రీకి లతా గొంతునిచ్చారు. రామ్‌లక్ష్మణ్‌ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని ప్రతి పాట పెద్ద హిట్‌గా నిలిచింది.

.కాలేజీ కుర్రకారు వీటి కోసం ఫిదా అయిపోయారు. ‘దిల్‌ దీవానా’, ‘ఆజా షామ్‌ హోనే ఆయీ’, ‘కబూతర్‌ జాజాజా’ లక్షలాది కేసెట్లు అమ్ముడుపోయాయి. ‘ఆయనతో పాడిన పాటల్లో నాకు ఆజా షామ్‌ హోనే ఆయీ ఇష్టం’ అని లతా అన్నారు. ఆ తర్వాత వచ్చిన ‘హమ్‌ ఆప్‌కే హై కౌన్‌’ (1994) కోసం లతా, బాలూ పోటీలు పడి పాడారు. లతాతో కలిసి బాలూ పాడిన ‘దీదీ తేరా దేవర్‌ దివానా’ పాట షామియానాలు, పెళ్లి మంటపాల్లో ఇష్టపాటగా మారింది. అందులోని ‘మౌసమ్‌ కా జాదు హై మిత్‌వా’, ‘జూతే దో పైసే లో’, ‘హమ్‌ ఆప్‌ కే హై కౌన్‌’… ఇవన్నీ ఆ సినిమాను భారతదేశ అతి పెద్ద హిట్‌గా నిలిపాయి.

‘హమ్‌ ఆప్‌ కే హై కౌన్‌’ రికార్డింగ్‌ సమయంలో వీళ్ల అల్లరి మామూలుగా ఉండేది కాదట. హమ్‌ ఆప్‌ కే హై కౌన్‌ అని లతా నోటి నుంచి రాగానే.. తర్వాతి లైన్‌ పాడకుండా ‘మై ఆప్‌ కా బేటా హూ’ అని బాలు అల్లరి చేసేవాడట. ఆమె పాడటం ఆపేసి– ‘‘చూడండి.. బాలూ నన్ను పాడనివ్వడం లేదు’’ అని ముద్దుగా కోప్పడేవారట. ఆ చనువుతోతో ఏమో ఆమె.. ఆ ముద్దుల కొడుకుని బాలాజీ అని పిలుచుకునేవారు. లతా మంగేష్కర్ మరణించడం భారతీయ చలనచిత్ర సంగీతానికి తీరని లోటుగానే భావించాలి

Leave a comment

Send a Comment

Your email address will not be published.