మూడు వసంతాల తెలుగుమల్లి

తెలుగు మనసుల ముసిరి
అల్లిబిల్లిగ అల్లుకు పోయిన
తెలుగుతల్లి కొప్పులో చెండుమల్లి ,
మూడు వసంతాల కుసుమాల
సుగంధాలు వెదజల్లుతూ ,
ప్రవాసాంధ్ర నుండి నివాసాంధ్ర వరకు
ప్రసరిస్తున్న సువార్తావాహిని ,
ప్రత్యూష ప్రకటిత ప్రఖ్యాత తెలుగు మల్లి
శ్రీశైలవాసుకు మల్లికేశ్వరుడర్పించు పుష్పవల్లి ‘
~.-.~-~.-.~-~.-.~-~.-.~-~.-.~-~.-.~~.-.~-~.-.~-~.-.
–భాస్కర రావు సరిపల్లె (మెల్బోర్న్)
—————————————————–
ట్యాంక్-బండ్-పై టై కట్టుకుని టిప్ టాప్-గా నిలబడి
తాజా వార్తలు పంచే పేపర్-బోయ్ మెల్బోర్న్ మల్లి
సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సంచలన వ్యాఖ్యలతో
హల్చల్ చేస్తూ ఆరాటంతో రగిలే వాడే తెలుగుమల్లి
చిరపరిచిత మనిపించే అనుభవ భావాల మళ్ళీ మళ్ళీ
చదవాలనిపంచజేసే పదమాలల ఘనత మా మల్లి
మాయల ఫకీరు రసవిద్య సరికొత్త సాక్షాత్కారంతో
కవిత్వం విరియజేసి అల్లుకున్న జోడి జాజిమల్లి
నవ్వు మొగ్గలతో మగువలకు మల్లి మళ్ళీ కన్నుగీటి
చిలిపిచేష్టల సినీకబుర్ల ఆటోజానీ సెకండాఫ్ మల్లి
జాబిలంటి చిన్నదాన్ని చూడకుంటే వెన్నెలేది అంటూ
వెళ్ళలేక ఉండలేక ఊసులు పంచే మురిపాల మల్లి
పనిలో మునిగిపోయేవారికి బయట జరిగేది తెలియజేసే
పెళ్ళి చేయాలని చూసే ప్రతి ఇంటి పెద్దయ్య మా మల్లి
ఏటేటా నూతన రూపుతో దర్శన మవ్వాలి తెలుగుమల్లి
బౌండరీలు కొట్టే తెలుగుదనం ఎనర్జీ నింపాలి మళ్ళీ మళ్ళీ
~.-.~-~.-.~-~.-.~-~.-.~-~.-.~-~.-.~~.-.~-~.-.~-~.-.
–మురళి ధర్మపురి (మెల్బోర్న్)
—————————————————————-
సాహితీ సౌరభాలు గుమ్మరించు తెలుగుమల్లి!
సంస్కృతీ వేదికలకు ఆటపట్టు తెలుగుమల్లి!
ఆరోగ్యము కాపాడే వైద్యుని మంత్రం తెలుగుమల్లి!
వింతలు-విడ్డూరాలు విశేషాల భవనము తెలుగుమల్లి!
క్రొత్తవంటల రుచులూరించు వంటయిల్లు తెలుగుమల్లి!
ఆబాలగోపాలము మెచ్చుకొనే సినీపరిచయం తెలుగుమల్లి!
గ్రహరాశుల ఫలితాలను మరచిపోని మధురబాన తెలుగుమల్లి!
మూడువసంతాలు నిండిన మెరపుతీగ మన తెలుగుమల్లి!
రంగులతో పొంగులతో మనోఫలక మాశ్రయించు తెలుగుమల్లి!
తెలుగుభాషలో తీపి! తెలుగుమాటలో తృప్తి!
తెలుగుసాహితీ స్ఫూర్తి! తెలుగుకవితల ప్రాప్తి!
తెలుగుతల్లికి కీర్తి! తెలుగుసంతతి ఖ్యాతి!
తెలుగువారికి దీప్తి! తెలుగుమల్లి వ్యాప్తి!
~.-.~-~.-.~-~.-.~-~.-.~-~.-.~-~.-.~~.-.~-~.-.~-~.-.
–డా. రాంప్రకాష్ ఎర్రమిల్లి (మెల్బోర్న్)