మొగలి రేకులు

ఆమె – అలుపెరుగని ఆమని కోకిల
అతను – రససిద్ధి

అతను – అనంత అగాథ భావసముద్రం
ఆమె – పెనుతుఫాను

ఆమె – అమలిన శృంగార కావ్యమందారం
అతను – మధుపం

అతను – విశాల శరదృతు హృదయగగనం
ఆమె – నిండుజాబిల్లి

ఆమె – సురూపలావణ్య సౌందర్యనిధి
అతను – బందిపోటు

అతను – నవరసరాగసుధామృత పిపాసి
ఆమె – రుద్రవీణ

ఆమె – దారి తప్పిన ఒంటరి బాటసారి
అతను – ధృవతార

అతను – కాంక్షాప్రజ్వలిత ఉజ్వలహృదయం
ఆమె – కొండవాగు

ఆమె – పున్నమి రాత్రి పలుకరించే ప్రణయసమీరం
అతను – తమకం

అతను – వెలిసిపోవు విరిజల్లుని ముద్దాడే నీరెండ
ఆమె – హరివిల్లు
—రమాకాంత రెడ్డి