రమణీయ శిల్పాల రామప్ప గుడి

రమణీయ శిల్పాల రామప్ప గుడి

రమణీయ శిల్పాల రామప్ప గుడికి అరుదైన గుర్తింపు
– ప్రపంచ వారసత్వ నిర్మాణంగా గౌరవం
– ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి దక్కిన ఏకైక ఖ్యాతి

ప్రపంచ వారసత్వ సంపదగా రామప్ప దేవాలయం గుర్తింపు దక్కించుకుంది. వారసత్వ కట్టడాల విశిష్టతల పరిశీలన కోసం చైనాలోని ఫ్యూజులో వర్చువల్‌ గా సమావేశమైన వరల్డ్ హెరిటేజ్ కమిటీ (యునెస్కో) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మన దేశం నుంచి 2020 సంవత్సరానికి రామప్పకు మాత్రమే ఈ ఖ్యాతి దక్కింది. తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ గుర్తింపు పొందిన తొలి కట్టడంగా రామప్ప రికార్డు సృష్టించింది

ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం రామప్ప దేవాలయం.రామప్ప దేవాలయం తెలంగాణ రాష్ట్ర రాజధానియైన హైదరాబాదు నగరానికి 220 కి.మీ.దూరంలో, కాకతీయ వంశీకుల రాజధానియైన వరంగల్లు పట్టణానికి సుమారు 70 కి.మీ.దూరంలో ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలంలోని పాలంపేట అనే ఊరి దగ్గర ఉంది.దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. ఇది ములుగు జిల్లాలో చాలా ప్రాముఖ్యత గల దేవాలయం. ఈ దేవాలయం విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా చెప్పవచ్చు. ఈ దేవాలయం పక్కనే రామప్ప సరస్సు ఉంది. ఆ చెరువు కాకతీయుల కాలం నాటిది. ఇది ఇప్పటికి వేల ఎకరాల పంటకు ఆధారంగా ఉంది.పాలంపేట చారిత్రత్మాక గ్రామం. కాకతీయుల పరిపాలనలో 13-14 శతాబ్ధాల మధ్య వెలుగొందింది. కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ప్రకారం ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రుడు నిర్మించాడు. అయితే దీనిని నిర్మించిన శిల్పాచార్యుడు (స్తపతి) రామప్ప పేరిటే ఈ గుడి విశేష ప్రాచుర్యం పొందింది.

వారసత్వ హోదా హెరిటేజ్
కాకతీయుల కాలంలో క్రీస్తు శకం 1213లో నిర్మించిన రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కింది. చైనాలోని పూజౌ లో నిర్వహిస్తున్న యునెస్కో హెరిటేజ్ కమిటీ సమావేశాలలో ప్రపంచం వ్యాప్తంగా 21 దేశాల ప్రతినిధులు ఓటింగ్ ప్రక్రియలో పాలుపంచుకొన్నారు. 17 దేశాల వారు రామప్పకు అనుకూలంగా ఓటు వేశారు. రామప్పకు వారసత్వ హోదా ఇచ్చే విషయంపై నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి మన దేశం నుండి రామప్ప దేవాలయాన్ని వారసత్వ కట్టడంగా గుర్తించడం కోసం ప్రతిపాదనలు పంపింది. ప్రపంచవ్యాప్తంగా 255 కట్టడాలు యునెస్కో వారసత్వ హోదా గుర్తింపు కోసం పోటీ పడ్డాయి. రామప్ప కట్టడం యునెస్కో జాబితాలో చోటు సంపాదించుకోవడం భారతీయులందరికీ గర్వకారణం. యునెస్కో రామప్పకు వారసత్వ హోదా ఇవ్వడం ద్వారా ఎనిమిది వందల సంవత్సరాల నాటి రామప్ప దేవాలయానికి తగిన గుర్తింపు లభించింది. భవిష్యత్తులో మరిన్ని నిధులు వచ్చి అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. తద్వారా రామప్ప పర్యాటక ప్రాంతంగా దేశవ్యాప్త గుర్తింపుకు నోచుకుంటుంది.

ఎనిమిది శతాబ్దాల నాటి ప్రాచీన కట్టడమైన రామప్పకు వారసత్వ హోదా గుర్తింపునకు ముఖ్యంగా మూడు అంశాలను ఆధారంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం యునెస్కో కు నామినేట్ చేసింది.
ఇసుకపై ఆలయాన్ని నిర్మించడం, నీటితో తేలియాడే ఇటుకలతో గోపురాన్ని నిర్మించడం, ఆలయ నిర్మాణానికి వాడిన రాతి నేటికీ రంగును కోల్పోకుండా ఉండడం.
రామప్ప ఆలయ గోపురం తేలికైన ఇటుకలతో రూపొందించారు. ఈ ఇటుకలను ప్రత్యేకమైన మట్టితోపాటు ఏనుగు లద్దె, అడవి మొక్కల జిగురు, ఊకపొట్టు, మరికొన్ని పదార్థాలు కలిపి తయారు చేశారు. ఈ పదార్థాలన్నీ సరైన మోతాదులో ఉపయోగించి గట్టిదనం ఉంటూనే, తేలికగా ఉండే ఇటుకలను రూపొందించారు. ఇవి నీటిలో తేలుతాయి. శాస్త్రీయంగా చెప్పాలంటే ఈ ఇటుకల సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువగా ఉండటం వల్ల అవి నీటిలో తేలుతాయి. కాకతీయ శిల్పులకు మాత్రమే సొంతమైన పరిజ్ఞానమిది.

కాకతీయుల వైభవానికి చిహ్నం

విశిష్టమైన వారసత్వాన్ని కలిగి ఉన్న కాకతీయుల వైభవానికి చిహ్నంగా నిలిచిన రామప్ప దేవాలయం యొక్క చరిత్ర ను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. రామప్ప దేవాలయము….ఓరుగల్లు నేలిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం.కాకతీయ వంశీకుల రాజధానియైన వరంగల్లు పట్టణానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో పాలంపేట అనే ఊరి దగ్గర ఉంది. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. ఇది పూర్వ వరంగల్లు జిల్లాలో చాలా ప్రాముఖ్యత గల దేవాలయం. ప్రస్తుతము రామప్ప జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది.ఈ దేవాలయం విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా చెప్పవచ్చు. ఈ దేవాలయం పక్కనే రామప్ప సరస్సు కలదు. ఆ చెరువు కాకతీయుల కాలం నాటిది ఇది ఇప్పటికి వేల ఎకరాల పంటలకు అధారంగా ఉన్నది. మధ్యయుగానికి చెందిన ఈ శివాలయం ఆలయంలో ఉన్న దైవంపేరు మీదుగా కాక దీనిని చెక్కిన ప్రధాన శిల్పి రామప్ప పేరు మీదుగా ఉండటం ఇక్కడి విశేషం.

ఈ ఆలయం కాకతీయుల ప్రత్యేక శైలి యైన ఎత్తైన పీఠంపై నక్షత్ర ఆకారాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయము తూర్పు దిశాభిముఖముగా ఎత్తైన వేదికపై గర్భాలయం, అంతర్భాగమున మూడు వైపుల ప్రవేశ ద్వారము గల మహామండపం కలిగి ఉన్నది. ఇందలి గర్భాలయమున ఎత్తైన పీఠముపై నల్లని నునుపు రాతితో చెక్కబడిన పెద్ద శివలింగము కలదు. ఇందలి మహామండపము మధ్య భాగమున కల కుడ్య స్థంభములు, వాటిపై గల రాతి దూలములు రామాయణ, పురాణ, ఇతిహాస గాధలతో కూడిన నిండైన అతి రమణీయమైన శిల్పములు కలిగి ఉన్నవి. ఈ మహా మండపము వెలుపలి అంచున పై కప్పు క్రింది భాగమున నల్లని నునుపు రాతి పలకములపై వివిధ భంగిమలతో సర్వాంగ సుందరముగా చెక్కబడిన మదనిక, నాగిని శిల్పములు కాకతీయుల శిల్పకళాభిరుచులకు చక్కటి తార్కాణాలు. ఈ దేవాలయ ప్రాంగణలో ఇతర కట్టడములలో నంది మండపము, కామేశ్వర, కాటేశ్వర మొదలగు ఆలయములు చూడదగినవి. దేవాలయము శిల్ప సంపద కాకతీయ రాజుల నాటి శిల్ప శైలి తెలుపుతున్నది. దేవాలయం అత్యంత తేలికైన ఇటుకలతో నిర్మితమైనది. ఈ ఇటుకలు నీటి మీద తేలే అంత తేలికైనవి అని చెబుతారు.ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక కాలు కొంచెం పైకి ఎత్తి పట్టుకొని, చెవులు రిక్కించి యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా? అన్నట్లుంటుంది. ముందు నుంచి ఏ దిశనుంచి చూసినా నంది మన వైపే చూస్తున్నట్లుంటుంది. గర్భగుడికి ఎదురుగా ఉన్న మండపంలో ఉన్న స్థంభాల మీద అత్యంత రమణీయమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. మండపం పైకప్పు మీద శిల్ప కళాసౌందర్యము చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల రెండు శివుని సన్నిధులు ఉన్నాయి. శివుడి వైపు చూస్తున్న నంది చాలా ఆందముగా చెక్కబడి ఇప్పటికి చెక్కుచెదరకుండా ఉన్నది.

రామలింగేశ్వర ఆలయం
విష్ణువు ఆవతారం రాముడు, శివుడు కలిసి ప్రధాన దైవంగా ఉన్న దేవాలయం ఈ ఆలయం కాకతీయుల ప్రత్యేక శైలి ఎత్తయిన పీఠంపై నక్షత్ర ఆకారాన్ని పోలి ఉంటుంది.ఈ ఆలయం తూర్పు దిశాభిముఖంగా ఎత్తైన వేదికపై గర్భాలయం, అంతర్భాగాన మూడు వైపుల ప్రవేశ ద్వారంతో కలిగి మహామండపం ఉంది. ఇందలి గర్భాలయాన ఎత్తైన పీఠంపై నల్లని నునుపు రాతితో చెక్కబడిన పెద్ద శివలింగం ఉంది. ఇందలి మహామండపం మధ్య భాగాన కల కుడ్య స్తంభాలు, వాటిపై గల రాతి దూలాలు రామాయణ, పురాణ, ఇతిహాస గాథలతో కూడిన నిండైన అతి రమణీయమైన శిల్పాలు కలిగి ఉన్నాయి. ఈ మహా మండపం వెలుపలి అంచున పై కప్పు క్రింది భాగాన నల్లని నునుపు రాతి పలకంలపై వివిధ భంగిమలతో సర్వాంగ సుందరంగా చెక్కబడిన మదనిక, నాగిని శిల్పాలు కాకతీయుల శిల్పకళాభిరుచులకు చక్కటి తార్కాణాలు. ఈ దేవాలయ ప్రాంగణంలో ఇతర కట్టడాలలో నంది మండపం, కామేశ్వర, కాటేశ్వర మొదలగు ఆలయాలు చూడదగినవి.దేవాలయం శిల్ప సంపద కాకతీయ రాజుల నాటి శిల్ప శైలిని తెలుపుతుంది. దేవాలయం అత్యంత తేలికైన ఇటుకలతో నిర్మితమైంది. ఈ ఇటుకలు నీటి మీద తేలే అంత తేలికైనవి అని చెబుతారు. ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంది.ఈ గుడి తరచు జరిగిన దండయాత్రల బారికి గురైంది. 17వ శతాబ్దంలో వచ్చిన భూకంపం వలన కొద్దిగా శిథిలం అయ్యింది. ఆలయ ముఖ ద్వారం శిథిలమైపోయింది. రామప్ప గుడి నలువైపులా ఉన్న మదనికల శిల్పాలు (నాగిని శిల్పాలు) చూపరులను ఎంతో ఆకట్టుకుంటాయి. వీటిని బ్లాక్‌ గ్రానైట్‌ రాయిపై చెక్కారు. ఆలయం లోపల నాట్య మంటపం ఆనాటి శిల్ప కళా వైభవానికి నిదర్శనం. జాయప సేనాని రచించిన నృత్త రత్నావళిలోని నాట్య సంప్రదాయాలు ఇక్కడ కనిపిస్తా యి. వీటిపై పరిశోధన చేసిన నటరాజ రామకృష్ణ కాకతీయుల కాలంనాటి పేరిణి నృత్యానికి ప్రాణం పోశారు.

ఆలయ ప్రత్యేకతలు
ఈ దేవాలయం ఎన్నో యుద్ధాలకు, దాడులకు, ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని నిలబడింది. దేవాలయ ప్రాంగణంలో చిన్న కట్టడాలను నిర్లక్ష్యంగా వదలి వేయడం వలన అవి కొన్ని ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి.కొంత మంది ఇక్కుడున్న నీళ్ళపై తేలే ఇటుకలను తీసుకొని వెళ్ళిపోవడం ప్రారంభించారు. అప్పటినుంచి భారతీయ పురాతత్వ పర్యవేక్షక శాఖ దీన్ని ఇపుడు తమ ఆధీనంలోకి తీసుకొని పరిరక్షిస్తుంది. ప్రధాన ద్వారం దగ్గర ప్రాకారం కూడా శిథిలమై ఉంది. కాబట్టి ఇప్పుడు పడమర వైపు ఉన్న చిన్న ద్వారం ద్వారానే ప్రవేశం ఉంది. మహాశివరాత్రి ఉత్సవాలు మూడు రోజులపాటు జరుపుతారు.

శివుడి ఆజ్ఞ కోసం చూస్తున్నట్టుగా నంది
సూది బెజ్జం సందుతో ఉండే అతి సూక్ష్మమైన శిల్పాలు అనేకం రామప్పలో కొలువుదీరి ఉన్నాయి. ఆలయం బరువును మోస్తున్నట్లుగా వందలాది ఏనుగుల శిల్పాలను ఆలయం చుట్టూ చెక్కారు. అయితే ఒక ఏనుగుతో మరో ఏనుగుకు సంబంధం లేకుండా విభిన్నంగా ఉంటాయి. శివుడి ఎదురుగా ఉన్న నంది విగ్రహం కూడా పర్యాటకులు, భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. శివుడి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నట్టు చెవిని లింగం వైపుకు పెట్టి లేవడానికి రెడీగా ఉన్నట్టు నందిని మలిచాడు శిల్పి రామప్ప.

శిల్ప కళా చాతుర్యం
రామప్పగుడి ఆలయ నిర్మాణంలోని చిత్ర కౌశలం, శిల్ప నైపుణ్యం వర్ణించనలవికానిది. ఈ కాకతీయ శిల్పచాతుర్యమంతా, ఇన్నేళ్ళు గడిచినా, ఈ నాటికి చూపరులకు అమితానందాన్ని కలిగిస్తూంది. భరత నాట్య శాస్త్రమంతా మూర్తీ భవించి, స్థంబాలమీదా, కప్పులమీదా, కనబడుతుంది.రామప్ప గుడిలోని విగ్రహాలు, స్థంబాలపై ఉన్న శిల్పాలు ముఖ్యంగా దేవాలయ మంటపంపై కోణాల్లో నాలుగు పక్కలా పెద్ద నల్లారాతి నాట్య కత్తెల విగ్రహాలు అతి సుందరమైనవి. ఆ విగ్రహాల సొమ్ముల అలంకరణాలు, వాటి త్రిభంగీ నాట్య భంగిమలూ శిల్పకారుల్నే సమ్మోహితుల్ని చేస్తున్నాయి. దేవాలయం లోని స్థంబాలపై నాట్య భంగిమలు మృదంగాది వాద్యముల వారి రేఖలు చిత్రించబడి ఉన్నాయి. జాయన సేనాని రచించిన నృత్తరత్నావళిలో ఉదహరించిన నాట్యశిల్పమంతా రామప్ప గుడిలో తొణికిసలాడుతూ ఉంది.

ఆసక్తికర పరిణామాలు
కాకతీయ శిల్ప కళా వైభవానికి ప్రతీకలా నిలిచే ఈ 800 ఏళ్ల నాటి ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కడం వెనుక ఆసక్తికర పరిణామాలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం దౌత్య మార్గాల ద్వారా గట్టి పట్టుబట్టడంతో యునెస్కో రామప్ప గుడిని వరల్డ్ హెరిజేట్ సైట్ గా ప్రకటించింది. కాగా, రామప్ప గుడికి గుర్తింపుపై నార్వే తీవ్రంగా వ్యతిరేకించింది. భారత్ పంపిన ప్రతిపాదనల పట్ల నార్వే అభ్యంతరం వ్యక్తం చేసింది. కానీ భారత్ కు చిరకాల మిత్రదేశం రష్యా మాత్రం రామప్ప గుడికి గుర్తింపు ఇవ్వాలంటూ చివరి వరకు మద్దతుగా నిలిచింది.

2019లో రామప్ప గుడి అంశం యునెస్కో వద్దకు చేరింది. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ (ఐసీఎంఓఎస్) సభ్యులు ములుగు జిల్లాలోని పాలంపేటలో కొలువై ఉన్న 13వ శతాబ్దం నాటి రామప్ప ఆలయాన్ని సందర్శించారు. అందులోని 9 అంశాలు లోపభూయిష్టంగా ఉన్నాయంటూ, వారసత్వ కట్టడంగా గుర్తింపునిచ్చేందుకు నిరాకరించారు. అప్పటినుంచి కేంద్ర ప్రభుత్వం తన ప్రయత్నాలను మరింత తీవ్రతరం చేసింది.
రామప్ప గుడి ప్రాశస్త్యాన్ని, నిర్మాణ శైలి, కాకతీయ రాజుల వైభవాన్ని, నాటి పరిస్థితులను యునెస్కోకు వివరించడంలో సఫలమైంది. తద్వారా ఓటింగ్ వరకు ఈ అంశాన్ని తీసుకెళ్లగలిగింది. అయితే, ఐసీఎంఓఎస్ సభ్యులు రామప్ప గుడి వద్ద గుర్తించిన లోపాలను ఆధారంగా చేసుకుని నార్వే వ్యతిరేక ఓటు వేయగా, రష్యా తదితర దేశాల బాసటతో భారత్ ప్రతిపాదనలకు విజయం చేకూరింది.

2014 నుంచే ప్రయత్నాలు

రామప్ప గుడిను యునెస్కో జాబితాలో చేర్చేందుకు కొన్నేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. 2014లో వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్స్ టెంటేటివ్‌ జాబితాలో హన్మకొండలోని వేయి స్తంభాల గుడి, వరంగల్‌లోని ఖిలా వరంగల్ ఫోర్ట్‌తో పాటు రామప్ప చోటు దక్కించుకుంది. వేయి స్తంభాల గుడి చుట్టూ, వరంగల్ కోటలో ప్రైవేట్ నిర్మాణాలు ఉండటంతో అవి రిజెక్ట్ అయ్యాయి. తర్వాత రామప్ప ఆలయ నిర్మాణం ప్రపంచ స్థాయిలో ఎలా ప్రత్యేకతను సంతరించుకుందో వివరిస్తూ యునైటెడ్‌ నేషన్స్‌ ఎడ్యుకేషనల్‌, సైంటిఫిక్‌ అండ్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌ (యునెస్కో) కు కేంద్రం దరఖాస్తు చేసింది. ఈ క్రమంలోనే యునెస్కో అనుబంధ సంస్థ ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ ఆన్‌ మాన్యుమెంట్‌ అండ్‌ సైట్స్‌ (ఐకోమాస్‌) ప్రతినిధిగా వాసు పోశానందన్‌ 2019 సెప్టెంబర్ 25న రామప్పను సందర్శించారు. ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా పొందేందుకు అర్హతలున్నాయని కితాబిచ్చారు. ఆ తర్వాత 2020కి గాను వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్స్‌ గుర్తింపునకు ఇండియా తరఫున రామప్ప ఎంపికైంది. 2020 జులైలో యునెస్కో హెరిటేజ్ ప్రతినిధులు సమావేశం కావాల్సి ఉండగా కరోనా వల్ల జరగలేదు. ఈ క్రమంలోనే ఈ నెల 16 నుంచి 30 వరకు చైనాలో జరుగుతున్న మీటింగ్‌లో రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చింది. దేశం నుంచి 1983లో తొలిసారి అజంతా, ఎల్లోరా, ఆగ్రా ఫోర్ట్‌‌‌‌, తాజ్‌‌‌‌మహల్‌కు యునెస్కో గుర్తింపు లభించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 38 ప్రదేశాలు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ జాబితాలో చేరాయి.

గుర్తింపుతో లాభాలివే
యునెస్కో గుర్తింపు పొందిన స్థలాలు, కట్టడాల గురించి ప్రపంచవ్యాప్తంగా భారీ ప్రచారం జరుగుతుంది. ఈ కట్టడాలను చూడటానికి దేశ, విదేశాల నుంచి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. కాబట్టి రామప్ప ప్రాంతం టూరిస్ట్ ప్రాంతంగా అభివృద్ధి చెందనుంది. ఈ హోదా వచ్చిన ప్రాంతం చారిత్రక, ప్రాకృతిక ప్రాధాన్యాన్ని కాపాడేందుకు యునెస్కో చర్యలు తీసుకుంటుంది. ఆలయ అభివృద్ధికి అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు కూడా వస్తాయి. కట్టడం ఉన్న ప్రాంతానికి దగ్గర్లో ఎయిర్‌పోర్టు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.