రమణ మహర్షి బోధనా మార్గం

రమణ  మహర్షి బోధనా మార్గం

భారత దేశము యోగి పుంగవులకు, ఋషులకు, మహర్షులకు పుట్టినిల్లు. వారు వారి భోధనలతో దేశాన్ని ఆధ్యాత్మికంగా సుసంపన్నం చేశారు. చాలామందికి జీవితాన్ని సరి అయిన మార్గంలో నడిపించటానికి మార్గదర్శకులయ్యారు. వీరి ఆశ్రమాలు ప్రశాంతతకు చిహ్నాలు కాబట్టి చాలామంది వారి జీవితాలలో ప్రశాంతత లోపించినప్పుడు కొంతకాలము అక్కడ గడపటానికి ఇష్టపడతారు
అటువంటి ఆశ్రమాలలో తిరువణ్ణామలైలోని శ్రీ రమణ మహర్షి ఆశ్రమము చాలా
ముఖ్యమైనది.

తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వరుడు సన్నిదిలో ఏర్పడిన ఈ
ఆశ్రమము దేశీయ, విదేశీయ భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ ఒక ప్రధానమైన
ఆధ్యాత్మిక కేంద్రంగా పేరు తెచ్చుకున్నది.

శ్రీ రమణ మహర్షి వివిధ అంశాలను చాలా చక్కగా అన్ని వర్గాల వారికీ అర్ధమయ్యే రీతిలో
భోధించారు. అటువంటి భోధనలను కొన్నింటిని ఇక్కడ తెలుసుకుందాం.

దాదాపుగా అన్ని మతాల వారు దేవుడిని ప్రార్ధించటంలో ఉపవాసానికి ప్రాధాన్యం
ఇస్తారు. ఈ ఉపవాస ప్రయోజనము ఏమిటి అన్న అంశము మీద రమణ మహర్షి చక్కటి వివరణ
ఇచ్చారు.

ఉపవాసం మంచిదే కాని అదే పరమ లక్ష్యం కాకూడదని రమణమహర్షి చెప్పారు
ఉపవాసంతో పాటు అధ్యాత్మికాభివృద్దిపై కూడా శ్రద్ద వహిస్తేనే ఉపవాస
ప్రయోజనము ఉంటుంది. కటిక ఉపవాసం మనస్సును దుర్బలపరుస్తుంది. ఫలితంగా
అధ్యాత్మికాన్వేషణకు కావలసిన శక్తిని పొందలేరు కాబట్టి మితాహారం
తీసుకుంటూ అభ్యాసాన్ని కొనసాగించమని మహర్షి సెలవిచ్చారు.

దీక్షలలో మౌనదీక్ష ప్రాశస్త్యాన్ని కూడా రమణ మహర్షి చక్కగా వివరించారు. శ్రీ
దక్షిణామూర్తి అనుగ్రహించినది కాబట్టి మౌన దీక్ష ఉత్తమమైనది.
స్పర్శ, దృష్టి మొదలైనవి మౌన దీక్ష కన్నా తక్కువ రకానికి చెందినవి.

మౌనదీక్ష సకల హృదయాలలో మార్పు తెస్తుంది అని మహర్షి భావన.

మహర్షి ఉద్దేశం ప్రకారము కొన్ని ఆధ్యాత్మిక విషయాలు హేతువాదానికి
అతీతమైనవి. ఉదాహరణకు కౌరవ సభలో ద్రౌపది చీరలు అక్షయం కావడము. ద్రౌపది
సర్వసమర్పణ చేసుకున్నది కాబట్టి అది జరిగింది. కనుక కీలకమంతా
సర్వసమర్పణలోనే ఉన్నది.

లోకంలో అందరూ గురువులేనని మహర్షి భోధిస్తారు.
లోకంలోని మంచివారు, చెడ్డవారు మనకు గురువులే.
చెడ్డవారు తమ చెడ్డ పనులద్వారా “నా చెంతకు రాకు” అని భోధిస్తుంటారు.

మంచివారు ఎప్పుడూ మంచి పనులద్వారా ఆదర్శంగా
ఉంటారు కనుక ఇద్దరు మనకు గురువులే. మంచి చెడు తెలియజేస్తారు కాబట్టి
ఆత్మ ప్రాధాన్యతను వివరిస్తూ సర్వమూ ఆత్మపై అధారపడినదే అని అంటారు.

అజ్ఞానం కూడా ఆత్మ శక్తి విశేషమే. ఆత్మను బాధించకుండా ఆత్మయందు
గోచరిస్తుంది అయితే దానిచేత బాధించబడే వాడు అహంకార విశిష్టుడైన జీవుడు
కనుక అజ్ఞానము జీవునిదే.

భయమనేది ఒక చిత్త వృత్తి. అత్మకంటే వేరే రెండవ వస్తువు ఏదైనా ఉంటే
భయపడవచ్చు కాని అ రెండవ వస్తువును చూస్తున్నదెవరు? మొదట అహంకారం
తలయెత్తి అ పైన విషయాలను తన వెలుపల ఉన్నట్లు చూస్తుంది.

అహంకారం లేకపోతే ఉన్నది ఆత్మ ఒక్కటే…రెండవది లేదు అని మహర్షి భోధిస్తారు.
అత్మస్తుడైన వానికి అహంకారాన్ని ఆశ్రయించుకున్న సంశయాలు, భయాలు మొదలైనవి ఏవి ఉండవు.
“అహం బ్రహ్మస్మి”- “నేను బ్రహ్మమును ” అని చేసే సాధన ఒక భావన మాత్రమే అని
మహర్షి అభిప్రాయము. ఆ మాటను బ్రహ్మము అనదు. అనవలసిన అవసరము దానికి లేదు.
అసలు నేను అనదు అది బ్రహ్మముగా ఎప్పుడూ ఉండనే ఉంటుంది. ఇక అ మాట అనేది
“మాయ నేను”మాత్రమే. భావాలన్నీ మాయ నేను నుండే పుడుతాయి. భావన ఉన్నంత కాలం
భయము తొలగదు . నేను బ్రహ్మమును అని ధ్యానము చేయడం మనస్సును కంటే
అంతర్ముఖము చేయడం ప్రధానమైనది. అప్పుడు “నేను బ్రహ్మము” అని ధ్యానం
చేయవలసిన అవసరము లేదు.

“నేను”ను వినాశన చేయటమే ముక్తి కాని అది “నేను”,”నేను “-అనే దాన్ని ఏమరకుండా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది అందువల్లనే ” నేను” అనే భావాన్ని వదలకుండా వుంటే సాధకుడు శూన్యస్థితిలో పడకుండా ఉంటాడు. లేకపోతే ధ్యానము నిద్రలోకి దారితీస్తుంది.

అహం – ఇదం, నేను – ఇది అనేవి కూడా ఒకదానిపై ఒకటి అధారపడి విడివిడిగా
ఉన్నట్లు ఇప్పుడు కనిపిస్తున్నాయి కాని వాస్తవానికి అవి విడిగా లేవు
“నేను”లోనే “ఇది “వ్యాపించి ఉన్నది. “ఇది” అనేది ” నేను “లో లీనమై దానితో
ఒకటై పోవాలి. అప్పుడు మిగిలి ఉండే “నేను “అసలు నేను.
.

– అంబడిపూడి శ్యామసుందర రావు

Send a Comment

Your email address will not be published.