అమృతతుల్యమైన తెలుగు భాష పర భాషా సంస్కృతితో సహజీవనం చేస్తూ పరాయి గడ్డపై ఇతర భాషలతో మమేకమై రస గంగలా పరవళ్ళు త్రోక్కింది. అమ్మ ఒడిలో ముద్దు బిడ్డలు పరవశించి తరతరాల తమ పరంపరను తనివితీరా నెమరు వేసుకుంటుంటే భాషామతల్లి పులకరించి కళ్ళు చెమర్చింది. కన్నవారు కాదన్నా నన్నాదరించేవారు నావారంటూ నాట్యం చేసింది. మహోత్కృష్టమైన సాహితీ సంపదతో తులతూగి కాలానుగుణంగా వన్నె తరిగి మన్ననకొరవడి మక్కువతో అక్కునచేర్చుకునేవారు లేక కనుమరుగౌతున్న తరుణంలో ఒక కాంతి రేఖ మిలమిలా మెరుస్తూ ఎంతో ఆదరణీయంగా నేనున్నానని అభయహస్తం అందిస్తూ ఆదరించిన వేళ తనను తాను మరిచిపోయి తాండవమాడింది. మరువలేని మధురానుభూతులను మిగిల్చి మరల రాదేమోనన్న మీమాంస కలిగించింది ఈ రస రాగ సుధ.
తన హాస్యపు జల్లులతో సినీవినీలాకసాన్ని 32 సంవత్సరాలు మకుటంలేని మహారాజులా ఏలి ఎన్నెన్నో బహుమతులు, బిరుదులూ అందుకున్న “హాస్య కళా విధాత” పద్మశ్రీ డా.కన్నెగంటి బ్రహ్మానందం గారు మొదటిసారిగా మెల్బోర్న్ నగరానికి రావడం ఎంతో ముదావహం. తెలుగు భాషలో తనకున్న ప్రావీణ్యతతో భాగవతంలోని కొన్ని పద్యాలు, గుఱ్ఱం జాషువా గారి భావజాలం, శ్రీశ్రీ గారి కవితా వికాసం గురించి అద్భుతంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలుగు సంఘం వారు శ్రీ బ్రహ్మానందం గారికి “హాస్య రస బ్రహ్మ” అన్న బిరుదును ఇచ్చి సత్కరించారు.
ఈ కార్యక్రమంలో మరో ప్రత్యేక అతిధి కళారత్న డా.మీగడ రామలింగ స్వామి గారు కూడా పాల్గొని నవావధానం కార్యక్రమాన్ని నిర్వహించి ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసారు. ఈ కార్యక్రమంలో ఎనిమిది మంది ప్రాశ్నికులు పాల్గొని వివిధ భాగాల్లో పద్యాలు, కీర్తనలు, పాటలు పాడితే నవావధానిగా శ్రీ మీగడ గారు ఇతర రాగాల్లో వాటిని పాడి వినిపించారు. ఇది తెలుగు అవధానంలో ఒక సరిక్రొత్త ప్రక్రియ. అంతే కాకుండా తెలుగు భాష ఔన్నత్యాన్ని సందర్భోచితంగా వివరించి అద్భుతమైన విషయాలను తెలియజేసారు.
మూడవ అతిధి కుమారి సత్య యామిని గారు తమ పాటలతో కుర్రకారుని ఉర్రూతలూగించారు.
కూచిపూడి నృత్యంలో నిష్ణాతులైన స్థానిక నృత్యకళాకరులు నృత్య రూపకాలు, శ్రీ రాగామృతా బృందం వారిచే నిర్వహించబడిన గానకచేరీ మరియు జానపదాలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి.
తెలుగు సంఘం అధ్యక్షులు శ్రీ శ్రీని కట్ట గారు మాట్లాడుతూ మెల్బోర్న్ నగరంలో మొదటిసారిగా జరిగిన తెలుగు మహాసభలకు విచ్చేసిన అతిధులకు, ఇందులో పాల్గొన్న సాహిత్యాభిమానులు, కళాకారులు, స్వచ్చందసేవకులు, ఆర్ధిక సహాయం అందించిన వ్యాపారవేత్తలు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి శ్రీ సుధీర్ మండలీక గారు వ్యాఖ్యాతగా వ్యవహరించి కార్యక్రమం సజావుగా నిర్వహించారు.