లింగా ప్రోమో మీద క్రేజ్

లింగా ప్రోమో మీద క్రేజ్

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించి త్వరలో విడుదల కానున్న లింగా సినిమామీద బోలెడన్ని ఆశలు పెట్టుకున్న పంపిణీదారులు, అభిమానుల మాట ఎలా ఉన్న ఆ సినిమా ప్రోమో సృష్టించడంలో ఒక యువకుడు చూపిన ప్రతిభ అందరినీ ఆకట్టుకుంటోంది.

ఏ సినిమాకైనా ఎడిటింగ్ చాలా ముఖ్యం. చిత్రీకరణ ఎంత బాగా వచ్చినా ఆ తర్వాత దానికి ఎడిటింగ్ లో మరిన్ని అందాలు తీసుకురావడం అంత సామాన్యమైన విషయం కాదు. అందుకే ఎడిటింగ్ చేసే వ్యక్తి తన ప్రతిభను చూపడం చాలా ముఖ్యం. అప్పుడే అతని నైపుణ్యం కూడా తెలుస్తుంది. అందుకే ఫిలిం ఎడిటర్ కూడా సినిమాకో గుండెకాయ లాంటి వాడే. అతనిని తక్కువ అంచనా వేయకూడదు. అయితే ఈ ఎడిటింగ్ విభాగంలో అతికొద్ది మంది పేర్లే పలువురి నాలుకలపై నానుతుంటాయి. ఒకప్పుడేమో గానీ ఇప్పుడు యువకుల హవా మొదలైంది. చాలా మంది ఎడిటింగ్ విషయంలో తమ ప్రతిభను చూప్తున్నారు. ఇటీవల లింగా సినిమా కోసం తయారు చేసిన ప్రోమో గురించి ఇప్పుడు పలువురు మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో దీని గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ఇంతకూ ఈ ప్రోమో సృష్టికర్త మరెవరో కాదు …ఒక యువకుడు. అతని పేరు ఎన్ . నవీన్.

ఏ సినిమాకైనా ట్రైలర్ చాలా ప్రధానం. అయితే తనకు లింగా సినిమా ప్రోమో చేసే అవకాశం రావడం తన అదృష్టమని నవీన్ చెప్పారు.

ప్రోమో అనేది ఆ సినిమా కథను చూచాయగా చెప్పగలగాలి. ఆ ప్రోమో చూసి కథ బహుశా ఇలా అయి ఉండవచ్చు అని, అలా అయి ఉండవచ్చు అని అనుకోవడం మొదలుకావాలి. అంతే తప్ప ప్రోమో కేముంది రజనీకాంత్ నటిస్తున్నాడు కాబట్టి చూస్తే సరిపోతుంది అని అనుకునే వారిని సైతం ప్రోమో ఆకట్టుకోవడం ముఖ్యం. అందుకే ఒక ప్రోమో విజయ సాధించాలంటే ఆ ఎడిటర్ లో గొప్ప క్రియేటివ్ నెస్ ఉండాలి లేకుంటే ఒక మంచి ప్రోమో పుట్టడం చాలా కష్టం.

హైదరాబాదులో పుట్టి పెరిగిన నవీన్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఒక న్యూస్ చానెల్ లో ఉద్యోగానికి చేరాడు. అక్కడ అతను కొన్ని ప్రోమోలు చేసాడు. ఆ తర్వాత అతను సొంతంగా ప్రకటనలు చేయడం మొదలుపెట్టాడు. మహేష్ బాబు సంతూర్ సోప్ యాడ్ ని ఎడిట్ చేసింది నవీనే. అలాగే విరాట్ కోహ్లి సెల్కాన్ యాడ్ కి కూడా నవీనే ఎడిటర్. అలా అలా వందకుపైగా యాడ్ లకు వర్క్ చేసిన నవీన్ కెరీర్ లో మొదటి మలుపు గోవిందుడు అందరి వాడేలే సినిమాతో వచ్చింది. ఆ సినిమా దర్శకుడు కృష్ణ వంశీ. కృష్ణ వంశీ ఎప్పుడూ ఏదో ఒక కొత్తదం కోసం ఆలోచిస్తూ ఆ కొత్తదనాన్ని తను అనుకున్న విధంగా ప్రెజెంట్ చేయడానికి ఏ మాత్రం వెనుకాడరు. అలాంటి కృష్ణవంశి గోవిందుడు అందరి వాడేలే సినిమాకు ప్రోమో తయారు చేసు బాధ్యత నవీన్ కి అప్పగించారు. అది బాగా క్లిక్ అయ్యింది. ఫిలిం ఎడిటర్ గా అది తనకు తొలి బ్రేక్ అని నవీన్ చెప్పుకున్నాడు. ఆ ప్రోమో నచ్చి కె ఎస్ రవికుమార్ లింగా సినిమాకు ప్రోమో తయారు చేసే అవకాశం నవీన్ కి కల్పించారు. ఇలా వచ్చిన అవకాశాన్ని నవీన్ పూర్తిగా వినియోగించుకుని విజయవంతమవడం ముదావహం. అతని ప్రోమో చూసి అటు దర్శకుడు కె ఎస్ రవికుమార్, ఇటు సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంతో సంతృప్తి చెందారు. నవీన్ పనితనాన్ని అభినందించారు. దీవించారు. అంతే కాదు, నవీన్ ని చెన్నైలో ఎడిటింగ్ టీం లో చేరమని కె ఎస్ రవికుమార్ సలహా ఇచ్చారు. కె ఎస్ రవికుమార్ లాంటి ఒక దర్శకుడితో కలిసి పని చేసే అవకాశం రావడం తన అదృష్టంగా నవీన్ చెప్పుకున్నాడు.

ప్రస్తుతం నవీన్ రెండు సినిమాలకు వర్క్ చేస్తున్నాడు. అందులో ఒకటి మలయాళం చిత్రం. అతనికి మరో రెండు హిందీ సినిమాలకు వర్క్ చేసే అవకాశం కూడా వచ్చినట్టు సూచనప్రాయంగా తెలిసింది.

ఏ సినిమాకైనా ఎడిటింగ్ ఎంతో ముఖ్యమని, ఒక సామాన్యమైన సగటు సినిమాను సైతం ఎడిటింగ్ లో చూపే ప్రజ్ఞతో విజయమార్గంలోకి నడిపించవచ్చని నవీన్ అభిప్రాయం.

Send a Comment

Your email address will not be published.