వచనరచనా మేస్త్రి రావిశాస్త్రి

వచనరచనా మేస్త్రి రావిశాస్త్రి

ఆధునిక తెలుగు కల్పనా సాహితీ సృష్టికర్తల్లో ప్రత్యేకత గలవారు రావిశాస్త్రిగా ప్రసిద్ధుడైన రాచకొండ విశ్వనాథ శాస్త్రి (1922 జులై 30 – 1993 నవంబర్‌ 10). వచన రచనకు మేస్త్రిగా పేద బతుకుల కథల శాస్త్రిగా గుర్తింపు పొందిన ఆయన శతజయంతి ఈనెల30. ఈ సందర్భంగా ఆయన విశేషాలు….

శ్రీకాకుళంలో సాధారణ కుటుంబంలో సీతాలక్ష్మి, నారాయణమూర్తి దంపతులకు 1922 జులై 30న జన్మించిన రావిశాస్త్రి వృత్తిరీత్యా న్యాయవాది. ఆయన 1935-36లోనే కథారచన ప్రారంభించినా, 1950 తరవాతనే జీవిత వాస్తవికతను వస్తువుగా చేసుకోవడం మొదలైంది. చిన్న వయసులో చార్లెస్‌ డికెన్స్‌ నవలల్ని చదివి పేదవాళ్ల గురించి రాయాలనుకున్నారు. ఆంటన్‌ చెహోవ్‌ను చదివి గట్టి కథలు రాయాలనుకున్నారు. మొదట్లో కొన్ని తమాషా కథలు రాశారు. 1950 నుంచి జీవితాన్ని అంటిపెట్టుకున్న సాహిత్యం సృష్టించారు. డెబ్భైఒక్క ఏళ్ల జీవితంలో 56 ఏళ్లు రచనలు చేయడం విశేషం. ‘రావిశాస్త్రి దాపరికం లేని, దొంగతనం ఎరగని రచయిత. ఏ పరిస్థితుల్లోనూ బాధ్యతను విస్మరించని రచయిత. భద్రతకోసం, కీర్తికోసం పాకులాడని రచయిత’ అంటారు చలసాని ప్రసాద్‌.

రావిశాస్త్రి రాసిన కథలు 75 దాకా లభిస్తున్నాయి. లభించనివి మరో 25 ఉంటాయి. ఆయన రాసిన నవలలు 10 దాకా ప్రచురితమయ్యాయి. అచ్చుకానివి మరో పదిదాకా ఉంటాయి. మూడు నాటకాలు రాశారు. ముందుమాటలు, పరామర్శలు, ఇంటర్వ్యూలు, లేఖలు- అంతా కలిపి ఆయన సాహిత్యం రెండున్నర వేల పుటలదాకా ఉంటుంది. ఆయన కథలలో వేతనశర్మ, పిపీలికం, ఎండ, లక్ష్మి వంటివి పాఠకులను ఎంతగానో ఆలోచింపజేశాయి. రావి శాస్త్రివి దాదాపు ఎనిమిది సంపుటాలలో కథలు వచ్చాయి. తిరస్కృతి, నిజం, విషాదం నాటకాలున్నాయి. అల్పజీవి, రాజు-మహిషి, గోవులొస్తున్నాయి జాగ్రత్త, సొమ్ములు పోనాయండి, మూడు కథల బంగారం, రత్తాలు-రాంబాబు, ఇల్లు వంటి నవలలు రాశారాయన. ‘దారిద్య్రం ఎవ్వరికీ, నా పగవారిక్కూడా ఉండకూడదని నేను అనుకుంటూ ఉంటాను’ అన్నది రావిశాస్త్రి అభిప్రాయం. పేదరికంలో పుట్టిన రావిశాస్త్రి చదువుకొని ఉన్నత స్థానానికి వెళ్ళాక, పేదల పక్షమే వహించి సాహిత్య సృజన చేశారు. ఆయన పేదల రచయిత. సాంఘికంగానూ, ఆర్థికంగానూ అణచివేతకు గురైన వాళ్లవైపు నిలిచిన నిబద్ధతగల రచయిత. పీడితుల పక్షం వహించిన రావిశాస్త్రి సాహిత్యంలో రాజ్యం స్వరూప స్వభావాలు ప్రతిఫలిస్తాయి.

రాజ్యానికి శాసన, కార్యనిర్వహణ, న్యాయవ్యవస్థలు మూలస్తంభాలు. ఇవి ఎవరిపక్షాన ఉన్నాయో రావిశాస్త్రి తన సాహిత్యంలో కళ్లకుకట్టారు. రాజీ ఎరగని పోరాటం ఆయనది. మార్క్సిజం అందించిన సామాజిక చలన సూత్రాలతో జీవితాన్ని అర్థం చేసుకున్న రావిశాస్త్రి, స్వాతంత్య్రానంతర భారతీయ సామాజిక పరిణామాలను తన సాహిత్యంలో ప్రతిబింబించారు. ఆరు సారో కథలు, ఆరు సారా కథలు, ఆరు చిత్రాలు, మరో ఆరు చిత్రాలు, కలకంఠి, ఓ మంచివాడి కథ, బాకీ కథలు, ఋక్కులు వంటి కథాసంపుటాలు, నవలలు, నాటకాల్లో స్వాతంత్య్రానంతర నాలుగు దశాబ్దాల సామాజిక జీవితం ఆవిష్కృతమైంది. ‘నిజం’ నాటకంలో రాజ్యం సంపన్నులవైపు ఉన్నదన్న నిజాన్ని, ‘ఇల్లు’ నవలలో సొంత ఆస్తి అదుపు తప్పితే మానవ సంబంధాలు ఎలా ఉంటాయో చెబుతారు. ‘మూడు కథల బంగారం’ కూడా బంగారం రూపంలో సొంత ఆస్తి ఏయే పాత్రలు నిర్వహిస్తుందో చెబుతుంది. విశాఖ ప్రాంత గ్రామీణ భాషలో రావిశాస్త్రి రాసిన ‘సొమ్ములు పోనాయండి’ నవల ఆయన రాజకీయార్థిక పరిజ్ఞానానికి దర్పణం. చిన్నవాళ్లకు చిన్న తగాదాలే విషమ సమస్యలుగా ఎలా పరిణమిస్తాయో ‘అల్పజీవి’ నవల ఆవిష్కరించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1960లలో సారా నిషేధం విధించినప్పుడు దొంగసారా వ్యాపారం పెరిగిపోయిన తీరును ఆరు సారా కథలు వాస్తవికంగా చిత్రించాయి.

తను అమితంగా ప్రేమించిన విశాఖపట్నం గురించి, అక్కడి డాల్ఫిన్స్‌ నోస్‌ అలియాస్‌ యారాడ గురించి, విశాఖపై పడి బతకడానికి వచ్చి అక్కడి వాళ్ళని ఈసడిరచుకున్న ఎగువ జిల్లాల వారి టెంపరితనం గురించి రావిశాస్త్రి గారు రాసేరు.

ప్రపంచంలోని ఏ రచయితకైనా దిక్సూచిలా పనిచేసే మాట చెప్పేరు ‘ఎందుకు రాసేను’ అన్న వ్యాసంలో. ‘‘రచయిత ఎవరైనా తాను రాస్తున్నది ఏ మంచికి హాని కలిగిస్తుందో ఏ చెడ్డకి ఉపకారం చేస్తూందో అని ఆలోచించవలసిన అవసరం ఉందని నేను తలుస్తాను. మంచికి హాని చెడ్డకి సహాయమూ చెయ్యకూడదని నేను భావిస్తాను,’’ అని అంటారు. రచయితల చుట్టూ ఎన్నో వ్యామోహాలు, ఆకర్షణలు, ప్రలోభాలు వున్న రోజుల్లో ఏ తోవ పట్టాలన్న ప్రశ్న వచ్చినపుడు రచయితలు తమకు తాము ఈ ప్రశ్న వేసుకుంటే సరిపోతుంది.
‘నాకు రాయాలని!’ అన్న వ్యాసంలో .. ‘‘నాకు రాయాలని లేదు.. ఎందుచేతనంటే .. నీతులు గోతుల్లోకి పోతున్నాయి. పాపాలు కొండలెక్కి కోటలు కట్టుకుంటున్నాయి. వారి బందూకులు బ్రహ్మచెముడు డొంకల్లా పెరుగుతున్నాయి. జనాన్ని వేటాడుతున్నాయి. పాలకుల తుపాకీలకి అక్షరాలు పూల తోరణాలు కడుతున్నాయి. ఎక్కడ చూసినా మబ్బుగానూ, గబ్బుగానూ వుంది. కానీ నాకు రాయాలని వుంది. నాకు ఈ ప్రభువుల్ని ఈడ్చి ఎండబెట్టాలని వుంది కూలి కులాలన్నీ ఏకం కావాలని వుంది. కొండల మీద కోతల్ని కూల్చవలసి వుంది. బ్రహ్మచెముడు డొంకల్ని దుంప నాశనం చెయ్యాలని వుంది.’’ ఇది రావిశాస్త్రి గారి రచనలకు ఒక ప్రియాంబుల్‌. ఆయన రాసిన ఏ వాక్యమూ ఈ లక్ష్యాలకు భిన్నంగా కనబడదు.

ఒకసారి రచన చేసేశాక రచయతలు ఆ రచనల్ని పట్టుకు వేళ్లాడకూడదని, దానిమానన దాన్ని వదిలేయాలని అంటారు. ‘‘కథ రాసేక, దాన్ని మరింక విడిచిపెట్టక, దాని మానాన దాన్ని బతకనివ్వక (లేదా చావనివ్వక) ఆ రాసినవాడు దాన్ని సాకుతో సంరక్షించుకుంటూ సమర్ధించుకుంటూ నెత్తిని పెట్టుకుని తిరగడం నాకు ఇష్టం లేదు. నిజానికి దగ్గరగా ఉంటే కథ కొన్నాళ్ళు ఉండవచ్చు. సత్తువుంటే ఉంటుంది లేకపోతే పోతుంది,’’ అని ‘రత్తాలు- రాంబాబు’ గురించి వచ్చిన విమర్శలపై రాసిన జవాబులో రాసేరు.

రావిశాస్త్రి ‘పిపీలికం’ (1969) తెలుగులో గొప్ప ఐతిహాసిక కథ. ‘ఆరు సారో కథలు’ మానవ సమాజంలో, పేదల జీవితంలో దుఃఖం ఎలా ఉందో ఆవిష్కరించాయి. ఒక కవి మాటలు శీర్షికలుగా కథలు రాయడం బహుశా రావిశాస్త్రితో మొదలైందేమో! శ్రీశ్రీ రచించిన ‘ఋక్కులు’ అనే కవితలోని కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, అరటితొక్క, రొట్టెముక్క, బల్లచెక్క, హారతిపళ్ళెం, తలుపుగొళ్ళెం పదాలు శీర్షికలుగా రావిశాస్త్రి కథలు రాశారు. ‘కాదేదీ కవితకనర్హం’ అని శ్రీశ్రీ అన్నట్లు ‘కాదేదీ కథకనర్హం’ అని ధ్వన్యాత్మకంగా రావిశాస్త్రి చెప్పారు. తన కథల్లో కవిత్వాంశను పుష్కలంగా చేర్చారు. కళింగాంధ్ర జన సామాన్యుల భాష ఆయన రచనలను అలంకరించి సాహిత్య గౌరవం పొందింది. 1950-90 మధ్య నాలుగు దశాబ్దాలలో ఆయన రచించిన సాహిత్యం 1990 తరవాత భారతదేశ ఆర్థిక రాజకీయ పరిణామాలను అర్థం చేసుకోవడం సహా ప్రపంచీకరణ ప్రభావాన్ని రచనలుగా మలచడానికీ తోడ్పడుతుంది.