వన్‌మేన్‌ షో ‘పేట’

Petta

రజనీ వన్‌మేన్‌ షో ‘పేట’

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ హీరోగా 2.ఓ తరువాత తెరకెక్కిన మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ పేట. కోలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగులో మాత్రం ఎన్నో వివాదాల మధ్య అతి కష్టం మీద రిలీజ్‌ అయ్యింది. తెలుగులో భారీ చిత్రాలు బరిలో ఉండటంతో పేటకు సరైన స్థాయిలో థియేటర్లు దక్కలేదు. అయితే రజనీ మేనియా కారణంగా అంచనాలైతే భారీగానే ఉన్నాయి. ఇన్ని కష్టాల మధ్య పేట తెలుగు ప్రేక్షకులను యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గా ఆకట్టుకుంది.

కథ‌ :
కాళీ (రజనీకాంత్‌) ఓ హాస్టల్ వార్డెన్‌గా పనిచేస్తుంటాడు. అక్కడే ప్రాణిక్‌ హీలర్‌గా పనిచేసే డాక్టర్‌(సిమ్రన్‌)తో కాళీకి పరిచయం అవుతుంది. అంతా సరదాగా గడిచిపోతున్న సమయంలో కాళీకి లోకల్‌ గూండాతో గొడవ అవుతుంది. ఆ గొడవ కారణంగా కాళీ అసలు పేరు పేట అని, అతను ఉత్తరప్రదేశ్‌ నుంచి అక్కడకు వచ్చాడని తెలుస్తోంది. అసలు పేట, కాళీగా ఎందుకు మారాడు..? సింహాచలం(నవాజుద్ధీన్‌ సిద్ధిఖీ)కు, పేటకు మధ్య గొడవ ఏంటి.? పేట తిరిగి ఉత్తరప్రదేశ్ వెళ్లాడా.. లేదా..? అన్నదే మిగతా కథ.

న‌టీన‌టుల పర్ఫామెన్స్‌ :
రజనీకాంత్ మరోసారి తనదైన స్టైలిష్‌, మాస్‌ యాక్షన్‌తో ఆకట్టుకున్నాడు. పెద్దగా పర్ఫామెన్స్‌కు అవకాశం లేకపోయినా.. అభిమానులను అలరించే స్టైల్స్‌కు మాత్రం కొదవేలేదు. ఇద్దరు హీరోయిన్స్‌ ఉన్నా ఎవరికీ పెద్దగా ప్రాదాన్యం లేదు. ప్రతినాయక పాత్రలను కూడా అంత బలంగా తీర్చి దిద్దకపోవటంతో విజయ్‌ సేతుపతి, నవాజుద్ధిన్‌ సిద్ధిఖీ లాంటి నటులు ఉన్నా ఆ పాత్రలు గుర్తుండిపోయేలా లేవు. సినిమా అంతా రజనీ వన్‌మేన్‌ షోలా సాగటంతో ఇతర పాత్రలు గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. శశికుమార్‌, బాబీ సింహా, మేఘా ఆకాష్‌, నాగ్‌ తమ పాత్ర పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

విశ్లేష‌ణ‌ :
పేట పక్కా కమర్షియల్‌ ఫార్ములాతో తెరకెక్కిన సినిమా హీరో వేరే ప్రాంతంలో తన ఐడెంటినీ దాచి బతుకుతుండటం. ఓ భారీ యాక్షన్‌ ఫ్లాష్ బ్యాక్‌ ఇలాంటి కాన్సెప్ట్‌తో సౌత్‌ లో చాలా సినిమాలు వచ్చాయి. రజనీ కూడా గతంలో ఇలాంటి సినిమాలు చేశాడు. అయితే మరోసారి అదే ఫార్ములాకు రజనీ స్టైల్‌ను జోడించి తెరకెక్కించాడు దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌. తొలి భాగానికి ఇంట్రస్టింగ్‌ ట్విస్ట్‌లతో నడిపించిన కార్తీక్‌, ద్వితియార్థంలో కాస్త తడబడ్డాడు. రజనీ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని తయారు చేసుకున్న కథలో పెద్దగా కొత్తదనమేమీ లేదు. పూర్తిగా తమిళ నేటివిటీకి తగ్గట్టుగా తెరకెక్కించటం కూడా తెలుగు ప్రేక్షకులకు నిరాశకలిగిస్తుంది. అనిరుధ్ అందించిన పాటలు తమిళ ప్రేక్షకులను అలరించినా తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకోవటం కష్టమే. నేపథ్య సంగీతం మాత్రం సూపర్బ్‌ అనిపిస్తుంది. తిరు సినిమాటోగ్రఫి సినిమాకు రిచ్‌ లుక్‌ తీసుకువచ్చింది. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

తారాగణం : రజనీకాంత్‌, త్రిష, సిమ్రన్‌, విజయ్‌ సేతుపతి, నవాజుద్ధీన్‌ సిద్ధిఖీ
సంగీతం : అనిరుధ్‌, దర్శకత్వం : కార్తీక్‌ సుబ్బరాజ్‌, నిర్మాత : అశోక్‌ వల్లభనేని, కళానిథి మారన్‌

Send a Comment

Your email address will not be published.