వాహిని – సాహితీ ఝరి

Vahini
IMG-20190622-WA0009
IMG-20190622-WA0001-1
ఉత్తుంగ తరంగాలు, నదీ నదాలు, హోరెత్తిన జలపాతాలు, వాగులు, వంకలు, సాహితీ కిరణాలు, సందె పొద్దు పవనాలు, మృదుమధుర సంగీత గానాలు, సమర శంఖారావాలు, భువన విజయ గాధలు, పద్యాలు, పల్లవులు, చరణాలు, కథలు, కథనాలు – ఇలా ఎన్నో తెలిగింటి కళా వైభవాలు తనలో ఇముడ్చుకొని అలుపెరుగని వాగ్ధోరణి కలిగిన సాగరగామిని ఈ వాహిని. పాతికేళ్ళ సాహితీ ప్రయాణానికి నిశ్శబ్ద తరంగిణి. ఆస్ట్రేలియాలో రజతోత్సవం జరుపుకుంటున్న ఏకైక తెలుగు పత్రిక.

వాహిని అంటే – 81 ఏనుగులు, అంతే సంఖ్యలో రథాలు, అంతకు మూడు రెట్లు గుర్రాలు, ఐదు రెట్లు కాల్బలాలు కలిగిన సేనాబలం. అయితే ఈ బలమంతా గత పాతికేళ్ళుగా ఎంతోమంది సభ్యులు తమ విలువైన కాలాన్ని వెచ్చించి నిర్విఘ్నంగా ఈ త్రైమాసిక పత్రికను నడిపిన తీరు, నిబద్ధతతో నడిపించిన రీతి ఎంతో ముదావహం. గత ఏడాదికి పైగా ఈ పత్రిక ప్రతీ నెల ప్రచురించబడి సిడ్నీ తెలుగు సంఘం వెబ్ సైట్ (www.sydneytelugu.org)లో పెడుతున్నారు. కాలచక్రంలో ఎందరో మహానుభావులు, అమ్మ భాష అమర భాషగా నిలవాలని, పిల్లల మునివేళ్ళలో మురవాలని, ప్రపంచ భాషగా మెరవాలని ఎంతో తపనపడి భాషాభిమానంతో అహర్నిశలు కష్టపడి ఇష్టంగా ఈ పత్రికను ముందుకు నడిపించారు. ఈ పాతికేళ్లలో 17 సంవత్సరాలకు పైగా శ్రీ దూర్వాసుల మూర్తి గారు ఈ పత్రికకు సంపాదకత్వం వహించడం వారి భాషాభిమానానికి, నిబద్ధతకు తార్కాణం.

IMG-20190622-WA0003
IMG-20190622-WA0008

సిడ్నీ తెలుగు సంఘం ‘వాహిని’ పత్రికను అధికారికంగా 1993లో ఆంగ్లభాషలో ప్రచురించినా తొలిసారిగా జనవరి 1, 1994న తెలుగు భాషలో ప్రచురించడం జరిగింది. ఇప్పటికి పాతికేళ్ళు నిండింది అన్న మాట. ఆస్ట్రేలియాలో పాతికేళ్ళు నిర్విఘ్నంగా ఒక పత్రికను నిర్వహించిన ఘనత సిడ్నీ తెలుగు సంఘానిదే. ఇతర తెలుగు సంఘాల వారి పత్రికలు మొదలుపెట్టినా కొనసాగింపు జరగలేదు.

‘వాహిని’ పత్రిక ప్రతీ ఐదేళ్ళ మైలురాయిని పురస్కరించుకొని ఒక ప్రత్యేక సంచికని కూడా ప్రచురించడం జరిగింది. వాటిలో భారతదేశం నుండి చాలా మంది మన భాషలో నిష్ణాతులు మంచి వ్యాసాలు వ్రాసి వారి ప్రజ్ఞాపాటవాలు మనకు అందించడం జరిగింది.

ఈ పాతికేళ్ళ మైలురాయిని పురస్కరించుకొని సిడ్నీ తెలుగు సంఘం వాహినీ బృందం ఒక సాహితీ కార్యక్రమాన్ని ఈ నెల 16వ తేదీన (16-06-2019) నిర్వహించారు. ప్రస్తుత వాహినీ నిర్వాహక బృందం సమన్వయకర్త శ్రీమతి విజయమాధవి గొల్లపూడి గారి అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు వైవిధ్యమైన అంశాలపై ప్రసంగించి ప్రేక్షకులను సాహితీ క్షేత్రంలో ఓలలాడించారు. సుమారు 4 గంటలు జరిగిన కార్యక్రమం ఆహ్లాద వాతావరణంలో జరిగింది.
IMG-20190622-WA0005

Send a Comment

Your email address will not be published.