విలక్షణ దర్శకుడు విజయ బాపినీడు

vijaya Bapineedu
సెప్టెంబర్ 22 విజయబాపినీడు జయంతి

విలక్షణ దర్శకుడు, పత్రికా సంపాదకుడు, రచయిత విజయ బాపినీడు అసలు పేరు గుత్తా బాపినీడు చౌదరి. ఏలూరు సమీపంలోని చాటపర్రులో లీలావతి, సీతారామస్వామి దంపతులకు 1936 సెప్టెంబర్‌ 22న జన్మించారు బాపినీడు. ఏలూరులోని సీఆర్‌ఆర్‌ కళాశాలలో బీఏ చదివిన ఆయన కొంతకాలం వైద్య ఆరోగ్య శాఖలో పనిచేశారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన బాపినీడుకి మొదటినుంచీ రచనా వ్యాసంగం పట్ల ఆసక్తి ఉండేది. గుత్తా బాపినీడు పేరుతో డిటెక్టివ్‌ నవలలు రాసేవారు. ఆ తర్వాత భార్య విజయ పేరు కలిసి వచ్చేలా విజయ బాపినీడు పేరుతో రచనలు చేశారాయన.

తన పుస్తకాలను వేరే వాళ్లు పబ్లిష్‌ చేయడం కంటే సొంతంగా పబ్లిష్‌ చేసుకుంటే సంపాదన పెరుగుతుందనే ఉద్దేశ్యంతో ఉద్యోగానికి రాజీనామా చేసి, కుటుంబంతో సహా మద్రాసు వెళ్లారు. అక్కడ అప్పటికే పేరున్న రచయితలు విశ్వప్రసాద్, కొమ్మూరిలను బాపినీడు కలిశారు. ‘డిటెక్టివ్‌ నవలలు ప్రచురించడం వల్ల లాభం లేదు’ అని వారు చెప్పడంతో ‘బొమ్మరిల్లు, విజయ’ అనే మాస పత్రికలను ప్రారంభించారు. ఆ రోజుల్లో బొమ్మరిల్లు పుస్తకం లేని ఇల్లు ఉండేది కాదంటే అతిశయోక్తి కాదు. ఇండియన్‌ ఫిల్మ్, నీలిమ పత్రికలకు ఎడిటర్‌గానూ వ్యవహరించారు. బాపినీడుని ఫల్గుణా ప్రొడక్షన్స్‌ వారు పిలవడంతో తన దృష్టిని చలన చిత్రరంగంవైపు మళ్లించారు. ఆయన రాసిన ‘జగత్‌ జెట్టీలు’ కథను ఫల్గుణా ప్రొడక్షన్స్‌వారు సినిమాగా తీశారు. ఆ తర్వాత ‘హంతకులు–దేవాంతకులు’ సినిమాకి కథ అందించారు బాపినీడు.

శ్యామ్‌ ప్రసాద్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌ ఏర్పాటు…
మూడు నాలుగు సినిమాలకు కథలు అందించిన తర్వాత శ్యామ్‌ ప్రసాద్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌ను నెలకొల్పిన విజయ బాపినీడు ‘మయంగిగిరాళ్‌ ఒరు మాదు’ అనే తమిళ సినిమా రీమేక్‌ హక్కులు కొన్నారు. దాన్ని దాసరి నారాయణరావు దర్శకత్వంలో ‘చెడిన ఆడది’ పేరుతో తెరకెక్కించాలనుకున్నారు. అయితే ఆ టైటిల్‌ని అప్పటి ‘దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి’ అధ్యక్షుడు పి.పుల్లయ్య తిరస్కరించడంతో ‘యవ్వనం కాటేసింది’గా పేరు మార్చి నిర్మించారు. ఆ తర్వాత ‘రంభ–ఊర్వశి–మేనక, బొమ్మరిల్లు, ప్రేమపూజారి, విజయ, బొట్టు–కాటుక, రుద్రతాండవం’ వంటి సినిమాలు నిర్మించారాయన. యువచిత్ర కె.మురారితో కలిసి ‘జేగంటలు’ సినిమా నిర్మించారు. ఈ సినిమాకి బాపినీడే కథ అందించడం విశేషం.

bapineeni movies
ఇతర దర్శకుల దర్శకత్వంలో 12 సినిమాలు నిర్మించిన ఆయన.. చిరంజీవి హీరోగా 1983లో ‘మగ మహారాజు’ సినిమాతో దర్శకునిగా మారారు. ఆ తర్వాత ‘మహానగరంలో మాయగాడు, మగధీరుడు, ఖైదీ నెం.786, గ్యాంగ్‌లీడర్, బిగ్‌బాస్‌’ చిత్రాలను స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన ‘ఖైదీ నెం. 786’ చిరంజీవి నూరవ సినిమా కావడం విశేషం. అలాగే, ‘గ్యాంగ్‌ లీడర్‌’ చిరంజీవి కెరీర్‌కి ఓ మైలురాయి అయింది. బాపినీడు తెరకెక్కించిన చిత్రాలు ఫ్యామిలీస్‌తో పాటు మాస్‌కి బాగా కనెక్ట్‌ అయ్యాయి. బాక్సాఫీస్‌ దగ్గర భారీ వసూళ్లు కురిపించాయి. ఆ విధంగా తనలో మంచి మాస్‌ దర్శకుడు ఉన్నాడని ఆయన నిరూపించుకున్నారు.

ఎందరినో పరిచయం…
విజయబాపినీడు ఎంతోమందిని తన సినిమాల ద్వారా పరిచయం చేశారు. రాజాచంద్ర, దుర్గా నాగేశ్వరరావు, జి. రామమోహనరావు, మౌళి, వల్లభనేని జనార్ధన్‌లను దర్శకులుగా, ఎం.వి.రఘు, మహీధర్, శ్రీనివాసరెడ్డి, బాబు, ప్రసాద్‌లను కెమెరామేన్‌లుగా, పాటల రచయిత భువనచంద్రను, మాటల రచయిత కాశీ విశ్వనాథ్‌… వంటి ఎందర్నో పరిచయం చేశారాయన. విజయబాపినీడు మొత్తం 22 సినిమాలకు దర్శకత్వం వహించారు. చిరంజీవి, శోభన్‌బాబులతోనే ఎక్కువ సినిమాలు చేశారాయన.

కృష్ణతో ‘కృష్ణ గారడీ’, రాజేంద్రప్రసాద్‌తో ‘వాలు జడ తోలు బెల్టు, దొంగ కోళ్లు, సీతాపతి చలో తిరుపతి’ సినిమాలు తీశారు. తన కుమార్తెలు నిర్మాతలుగా బాపినీడు నిర్మించిన చివరి చిత్రం ‘కొడుకులు’ (1998). ఆ తర్వాత చిరంజీవి హీరోగా మళ్లీ సినిమా తీయాలనుకున్నారు కానీ కుదరలేదు.
Vijayashanti
ప్రయోగాలంటే ఇష్టం
ప్రయోగాలు చేయడం విజయ బాపినీడుకి ఇష్టం. ఒక కన్నడ, ఒక మలయాళ చిత్రం అనువాద హక్కులు కొని, రెండు చిత్రాలను కలుపుతూ కొంత భాగం షూటింగ్‌ చేశారు. ఆ రెండు చిత్రాలను ఒకే సినిమాగా విడుదల చేయడం విశేషం. భారత చలనచిత్ర రంగంలో ఇది తొలి ప్రయోగం. అలాగే శరత్‌బాబుతో తీసిన ‘రుద్ర తాండవం’ చిత్రాన్ని ఒకేసారి అన్ని ఏరియాల్లో విడుదల చేయలేదు. ఒక్క వైజాగ్‌లో మాత్రమే రిలీజ్‌ చేసి. ప్రేక్షకులు స్పందనను బట్టి మిగతా ఏరియాల్లో విడుదల చేయాలనుకున్నారు. అయితే ఫ్లాప్‌ టాక్‌ రావడంతో రిలీజ్‌ చేయలేదు. బాపినీడు తాను నిర్మించిన చిత్రాలకు నిర్మాణత: విజయ బాపినీడు అని వేసుకునేవారు. నిర్మాణత అనే పదాన్ని తొలిసారి ఆయనే ప్రయోగించారు.

మధ్యతరగతి కథలే
విజయబాపినీడు ఎంచుకున్న కథలన్నీ మధ్యతరగతి మందహాసాలే. వాళ్ల జీవితాల్ని వెండి తెరపై ఆవిష్కరించడానికి ప్రయత్నించేవారు. అందులోనే హీరోయిజాన్ని తెలివిగా మిళితం చేసేవారు. కుటుంబ కథకు వినోదం, మాస్‌ అంశాలు జోడించడంలో ఆయన సిద్ధహస్తుడు. స్వతహాగా రచయిత కాబట్టి కథకుల్ని ఆదరించేవారు. ఎక్కడ మంచి రచయితలున్నారో అన్వేషించి వాళ్లందరికీ తన బృందంలో చోటు కల్పించేవారు. పాటల రచయితగా భువనచంద్రనీ, మాటల రచయితగా కాశీవిశ్వనాథ్‌ని పరిచయం చేసింది ఈయనే. ఎం.వి.రఘు, మహీధర్‌, శ్రీనివాసరెడ్డి, బాబు, ప్రసాద్‌లకు ఛాయాగ్రాహకులుగా తొలి అవకాశం ఇచ్చారు. విజయబాపినీడు ఆధ్వర్యంలోనే ప్రముఖ దర్శకుడు మౌళి అరంగేట్రం చేశారు.

with ANR

వినూత్నమే ‘విజయ’ సూత్రం
రచయితగా, దర్శకుడిగా బాపినీడును విజయతీరాలకు చేర్చింది.. వినూత్నమైన ఆలోచనలే. పదిమంది నడిచే దారి కాకుండా కొత్త మార్గాన్ని ఎంచుకోవడం ఆయనకు ముందు నుంచీ ఉన్న అలవాటు. ‘బొమ్మరిల్లు’, ‘విజయ’ పత్రికలు విజయపథం వైపు నడిచాయంటే కారణం.. విజయబాపినీడు ఆలోచనలే. అప్పట్లో ‘విజయ’ పత్రిక ఓ సంచలనం. పత్రిక ఒక్కటే.. కానీ విడదీస్తే అయిదు భాగాలుగా మారిపోయేది. సినిమా, నవల, వినోదం, సీరియల్‌, కథలు.. ఇలా ఎవరికి కావల్సింది వాళ్లు చదువుకోవచ్చు. ఇప్పుడు సినిమా రేటింగులు మామూలు విషయం. అప్పట్లో ఈ ఆలోచనకు నాంది పలికిన వారిలో బాపినీడు కూడా ఉన్నారు. తన పత్రికల్లో సినిమా సమీక్షలు రాసేవారు. ప్రతి సినిమాకీ రేటింగు ఇచ్చేవారు. ఆ రేటింగుల కోసం పత్రిక వచ్చేవరకూ ఆసక్తిగా ఎదురుచూసేవారు సినీ అభిమానులు. తన సొంత సినిమా అయినా సరే, తప్పొప్పుల్ని సమీక్షించడంలో రాజీ పడేవారు కాదు. కె.బాలచందర్‌ దర్శకత్వంలో రూపొందిన ఓ చిత్రాన్ని ‘మన్మథలీల’ పేరుతో తెలుగులో అనువదించారు. ఎడిటింగ్‌ రూమ్‌లో కూర్చుని కొన్ని సన్నివేశాల్ని తొలగించి, స్క్రీన్‌ ప్లే మార్చి విడుదల చేశారు. అప్పట్లో ఓ అనువాద చిత్రానికి ఇంత హంగామా చేయడం అదే తొలిసారి. ‘మన్మథలీల’ విడుదలై, విజయవంతమైన తరవాత ఈ చిత్రాన్ని బాలచందర్‌ చూసి, విజయబాపినీడుని అభినందించారు. ఒక కన్నడ చిత్రం, ఓ మలయాళ చిత్రం కొన్న బాపినీడు.. ఆ రెండింటినీ ఒకేసారి తెలుగులో డబ్‌ చేశారు. కొన్ని సన్నివేశాల్ని కొత్తగా తెరకెక్కించి, రెండు సినిమాల్ని కలిపి ఒకే సినిమాగా విడుదల చేశారు. భారతీయ చలన చిత్ర చరిత్రలో ఇదో వినూత్న ప్రయోగం. ఎన్ని సినిమాలు చేసినా నిర్మాత అనే పదం ఎక్కడా వాడలేదు. ‘నిర్మాణత’ అనే టైటిల్‌ కార్డు మాత్రం వేసుకునేవారు. తన సినిమాకి సంబంధించిన ప్రచారం కూడా చాలా వినూత్నంగా చేసేవారు. ఆ ప్రకటనల కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసేవారు. విజయ పత్రికతోటే బొమ్మరిల్లు చిన్నపిల్లల పత్రిక కూడా నడిపేవారు బాపినీడు. దాసరి సుబ్రహ్మణ్యం గారి మృత్యులోయ లాంటి అద్భుతమైన సీరియల్స్ తో బొమ్మరిల్లు పిల్లలను విశేషంగా ఆకట్టుకునేది. నిర్మాతగా మారి అదే టైటిల్ తో ఓ అద్భుతమైన ఫ్యామ్లీ డ్రామా తీసి భారీ వసూళ్లు సాధించారు బాపినీడు.

చిన్న సినిమాలతో మొదలెట్టి

క్రియేటివిటీ కుర్చీలో కూర్చుని పనిచేసుకోనివ్వదు. విజయబాపినీడు విషయంలో అదే జరిగింది. డిగ్రీ చదివిన వెంటనే పంచాయితీ బోర్టులో ఉద్యోగం వచ్చింది బాపినీడుకి. ఆ తర్వాత డిప్యూటీ తాసీల్దారుగా ప్రమోషనూ వచ్చింది. అయినా అందులో ఆయన నిలవలేదు. చలో మద్రాసు అనేశాడు. పత్రికా నిర్వహణ…ఆ తర్వాత సినిమాలు ఇలా జీవితం సాగింది. హిట్లు…ఫట్లు…విమర్శలు…పొగడ్తలు…అన్నిటినీ భరించాడాయన. చిన్న సినిమాలతో మొదలెట్టి పెద్ద సినిమాలకు ఎదిగాడు … కథను నడపడంలో నైపుణ్యమే కాదు…మాస్ ను ఎట్రాక్ట్ చేసే అంశాలేమిటనే విషయంలోనూ స్పష్టత ఎక్కువగా ఉండడమే విజయబాపినీడు సక్సస్ సూత్రం.

పండంటి కాపురం సినిమా లాంటి కథనే ఇంకాస్త నావల్ గా తయారు చేసుకుని బొమ్మరిల్లు తీశారు. విజయబాపినీడు సినిమా తీయాలనుకున్న టైమ్ లో దాసరి మంచి స్వింగ్ మీదున్నారు. వెంటనే ఆయన్ను కల్సి యవ్వనం కాటేస్తే కథను ఖాయం చేసి కృష్ణంరాజు, జయచిత్ర, నరసింహరాజు తదితరులతో తెరకెక్కించారు. అదే టైమ్ లో మన్మథలీలై పేరుతో తమిళ్ లో వచ్చి సూపర్ హిట్ కొట్టిన బాలచందర్ సినిమా రైట్స్ తీసుకుని తెలుగులో డబ్ చేశారు. డబ్బింగ్ సినిమా ఎలా చేయాలో ప్రపంచానికి చాటి చెప్పారు. స్ట్రెయిట్ సినిమా లెవెల్లో తీసిన ఆ సినిమా తెలుగులో బారీ విజయం సాధించింది. శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ సంస్ధను నిలబెట్టింది.

విజయబాపినీడు తీసిన తొలి చిత్రం యవ్వనం కాటేసిందే అయినా…పేరు తెచ్చిన సినిమా మాత్రం మన్మథలీలే. మన్మథలీల సినిమా ఒరిజినల్ ను చాలా ఎడిట్ చేసి కొన్ని సీన్లు ముందుకు మార్చి…ఇలా తెలుగు ఆడియన్స్ కు నచ్చేలా దాదాపు స్ట్రెయిట్ మూవీకి పడ్డంత కష్టం పడ్డారు విజయబాపినీడు. కమల్ హసన్ కు చక్రవర్తి…కమల్ దగ్గరుండే ముసలి సెక్రటరీకి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం డబ్బింగ్ చెప్పడం విశేషం.

చిరంజీవి పరిచయం
VijayaBapineeduబొట్టు కాటుక టైమ్ లో విజయబాపినీడుకు చిరంజీవి పరిచయం అయ్యారు. బొట్టు కాటుక సినిమాలో నూతన్ ప్రసాద్ గెటప్ చూసిన చిరంజీవి అదే విషయమై విజయబాపినీడుతో మాట్లాడారు. అలా మొదలైన పరిచయం ఆ తర్వాత సినిమా చిరంజీవితోనే తీసేలా చేసింది. చిరంజీవి మోహన్ బాబు కాంబినేషన్ లో ‘పట్నం వచ్చిన పతివ్రతలు’ టైటిల్ తో వచ్చిన ఆ సినిమాకు మౌళి దర్శకత్వం వహించారు. విజయబాపినీడు కమర్షియల్ సినిమాలే చేశారు. జనం కోరుకునే చిత్రాలే తీశారు. కమర్షియల్ యాంగిల్ మిస్ కాకుండానే ప్రయోగాలు చేయడానికి ప్రయత్నాలు చేశారు. తన సినిమాల్లో కామెడీ ఉండేలా చూసుకునేవారు. అలాగే ఓ తరహా ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసేందుకు జాగ్రత్తలు పాటిస్తూనే శృంగారాన్నీ తగుపాళ్లలో కలిపేవారు. కొన్ని సెన్సిబుల్ ఇంట్రస్టింగ్ అంశాలూ ప్రస్తావించేవారు. అవి కూడా శృంగారపరిధిలోనే ఉండేలా చూసుకునేవారు. అదే ఆయన సక్సస్ సీక్రెట్. పట్నం వచ్చిన పతివ్రతలు తర్వాత అనుకోకుండా తనే డైరక్టర్ అయిపోయారు బాపినీడు. మౌళి బిజీ కావడంతో తనే డైరక్ట్ చేయాల్సి వచ్చింది. అదే మగమహారాజు. ఫ్యామ్లీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తే కాసులు గ్యారంటీ అని నమ్మేవారు విజయబాపినీడు. ఆయన సినిమాలన్నిట్లోనూ మధ్యతరగతి కుటుంబ నేపధ్యం తప్పనిసరిగా ఉంటుంది. ఆనాటి సామాజిక పరిస్ధితుల నేపధ్యంలో ఫ్యామ్లీస్ ని ఎట్రాక్ట్ చేయడమే సేఫెస్ట్ మెధడ్ గా భావించేవారాయన. ఆ బ్యాలెన్స్ తప్పిన సందర్భాల్లోనే అపజయాలు చవిచూడాల్సి వచ్చింది.

పట్నం వచ్చిన పతివ్రతలు తర్వాత శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చిన సినిమా మగమహారాజు. మౌళినే డైరక్ట్ చేయాల్సిన ఈ సినిమా అనుకోకుండా విజయబాపినీడుని డైరక్టర్ ని చేసింది. డేట్స్ క్లాష్ రావడంతో బాపినీడే మెగాఫోన్ పట్టుకున్నారు. మళ్లీ ఫ్యామ్లీ డ్రామా. దాదాపు బొమ్మరిల్లు లాంటి కథే. ఇంటిని చక్కదిద్ది మగమహారాజు అనిపించుకున్న ఓ పెద్ద కొడుకు కథతో తెరకెక్కిన ఈ సినిమా చాలా పెద్ద విజయాన్ని సాదించింది.

చిరంజీవికి స్టార్ ఇమేజ్ తెచ్చిన సినిమాల్లో మగమహారాజు కూడా ఒకటి. ఆ సినిమాతోనే చిరంజీవి సన్నిహిత వర్గాల్లో ఒకడుగా మారిపోయారు విజయబాపినీడు. టైటిల్స్ సెట్ చేయడంలో విజయబాపినీడు కొంచెం డిఫరెంటు. కేవలం టైటిల్ తోనే బిజినెస్ చేసేయడం ఆయన స్టైల్. చిరంజీవితో మగమహారాజు తర్వాత ప్రారంభించిన మహానగరంలో మాయగాడు టైటిల్ కీ అంతటి క్రేజే వచ్చింది. సినిమా కొంచెం కన్ఫూజ్ చేసినా ఓపెనింగ్స్ మాత్రం కుమ్మేశారు.

బొమ్మరిల్లు నుంచి మురళీమోహన్ తోనే సినిమాలు తీసిన విజయబాపినీడు పట్నం వచ్చిన పతివ్రతలు తర్వాత చిరంజీవితో కంటిన్యూ అయ్యారు. చిరంజీవితో పాటే శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ బడ్జట్ కూడా పెరగడం ప్రారంభమైంది. చిన్న సినిమాలతో మొదలైన ప్రయాణం క్రమంగా బిగ్ మూవీస్ కి చేరింది. చిరంజీవితో విజయబాపినీడు తీసిన మరో బిగ్ సక్సస్ ఖైదీ నంబర్ 786. చిరంజీవి, మోహన్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ భారీ ఓపెనింగ్స్ సాధించింది. చిరంజీవితో విజయబాపినీడు కలయికలో వచ్చిన ‘ఖైదీ నెం.786’, ‘గ్యాంగ్‌లీడర్‌’ గుర్తుండిపోయాయి. ‘గ్యాంగ్‌ లీడర్‌’తో చిరు నెంబర్‌ వన్‌ కథానాయకుడిగా మారిపోయారు. ఆ సినిమాలో పాటలన్నీ హిట్టే. ఆ చిత్రంలో చిరు ధరించిన చొక్కాలు ఓ ట్రెండ్‌గా మారాయి. ఈ సినిమా వంద రోజుల పండగనూ కొత్తగా జరిపారు. ఒకేరోజు నాలుగు ప్రధాన పట్టణాల్లో శతదినోత్సవాన్ని నిర్వహించారు. ఈ చిత్రాన్ని హిందీలోనూ రీమేక్‌ చేశారు. ‘బిగ్‌ బాస్‌’ తరవాత ఆయన చిరంజీవితో సినిమా చేయలేదు. కాకపోతే… అందుకు ప్రయత్నాలు భారీగానే జరిగాయి. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా ఓ సినిమా నిర్మించాలని చాలా ప్రయత్నించారు. కొన్ని కథలు విన్నా సాధ్యం కాలేదు. ‘మనసంతా నువ్వే’తో గుర్తింపు తెచ్చుకున్న వి.ఎన్‌.ఆదిత్య దర్శకత్వంలో చిరంజీవితో ఓ చిత్రాన్ని రూపొందించాలనుకున్నారు. ఓ దశలో ‘చిరంజీవికి సరిపడ కథలు కావాలి’ అని పత్రికల్లో ప్రకటన ఇచ్చారు. ‘చిరంజీవి’ అనే పేరుతో ఓ పత్రిక నడిపారు బాపినీడు. అందులో ప్రతి పేజీ చిరు కోసమే. సరదా ఇంటర్వ్యూలు, చిరంజీవికి సంబంధించిన ఆసక్తికరమైన సమాచారంతో పత్రికని తీసుకొచ్చేవారు. అప్పట్లో అత్యంత ఖరీదైన పత్రికల్లో అదొకటి. డిమాండ్‌ ఉన్నా, దాన్ని నిర్వహించడం వీలు కాక మధ్యలోనే ముద్రణ ఆపేశారు

bapineeni movies
చిరంజీవి తో విజయబాపినీడు సాన్నిహిత్యం ఎంతదాకా వెళ్లిందంటే..చిరంజీవి కోసం ఓ భారీ పత్రిక పెట్టేదాకా. చిరంజీవి టైటిల్ తో ఓ పత్రిక తీసుకొచ్చి..దానిలో అన్నీ చిరంజీవికి సంబంధించిన ఎక్స్ క్లూజివ్ స్టోరీస్ ఉండేలా ప్లాన్ చేశారు విజయబాపినీడు. క్రేజీ మ్యాగజైన్ గా చిరంజీవి పత్రిక ప్రారంభమైన టైమ్ లోనే చిరంజీవితో ఓ భారీ విజయాన్ని నమోదు చేశారు బాపినీడు. చిరంజీవికి సంబంధించిన సమాచారంతోనే ఒక పత్రిక తీసుకురావడం విజయబాపినీడు ముందుచూపుకు నిదర్శనం. ప్రస్తుతం ఎవరికి వారు వెబ్ సైట్లు పెట్టీ…ట్విట్లర్ సాయంతోటీ జనాలకు దగ్గరగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్ధితిని అప్పట్లోనే ఊహించిన బాపినీడు చిరంజీవి అనే పత్రిక తీసుకువచ్చారు. సక్సస్ ఫుల్ గా నడిపారు. అదే టైమ్ లో చిరంజీవిని స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్ లాంటి అపజయాలు చుట్టుముట్టాయి. ఆ టైమ్ లో గ్యాంగ్ లీడర్ సంధించారు బాపినీడు. సినిమా మామూలు సక్సస్ కొట్టలేదు. బాక్స్ బద్దలైపోయింది.

చిరంజీవి కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ లో గ్యాంగ్ లీడర్ ది స్పెషల్ పేజ్. ఎందుకంటే ఈ సినిమా శతదినోత్సవం కూడా చాలా నావల్ గా ప్లాన్ చేశారు బాపినీడు. ఒకే రోజు విజయవాడ, హైద్రాబాద్, విశాఖపట్నాల్లో ప్లాన్ చేసి సక్సస్ ఫుల్ గా చేయించేశారు. అసలు గ్యాంగ్ లీడర్ కు ముందు అనుకున్న టైటిల్ అరె ఓ సాంబ. నిజానికి గ్యాంగ్ లీడర్ అని టైటిల్ ఎందుకు పెట్టావ్ అని ఒ దశలో చిరంజీవి ప్రశ్నించారు. ఫ్లామ్లీ ని గ్యాంగ్ కు సింబలైజ్ చేసి లీడర్ అనే పదాన్ని జస్టిఫై చేశారు బాపినీడు. ప్రతి పాటా సూపర్ హిట్ కొట్టడం విశేషం.

విజయబాపినీడు తో ఎప్పుడంటే అప్పుడు డేట్స్ ఇచ్చేవారు చిరంజీవి. ఆయన మీద నమ్మకం అంతటిది. అల్లు అరవింద్ బ్యానర్ గీతాఆర్ట్స్ నిర్మించిన చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు బాపినీడు. ఈ నమ్మకాన్ని గ్యాంగ్ లీడర్ ఎక్కడికో తీసుకెళ్లింది. బాపినీడు ప్లానింగ్ తో పాటు టేకింగ్ మీద కూడా చిరంజీవికి బారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉండేవి. పాటల దగ్గర నుంచి చాలా చాలా కేర్ తీసుకునేవారు విజయబాపినీడు.

ఫైట్స్ విషయంలోనూ గ్యాంగ్ లీడర్ ఓ ట్రెండ్ సెట్టింగ్ మూవీనే. ఒకేసారి వందమందితో తలబడడం అనేదాన్ని చాలా ఎఫెక్టివ్ గా చూపించారు బాపినీడు. ఆ స్టైల్ మళ్లీ ఏ తెలుగు సినిమాలోనూ కనపడదరు. ఒక మాస్ హీరో నుంచి ఆడియన్స్ ఏమి ఆశిస్తారో…ఏం చూడాలని కోరుకుంటారో…అవన్నీ తన సినిమాల్లో పుష్కలంగా ఉండేలా చూసుకుంటారు బాపినీడు.

చివరి రోజుల్లో
V B familyఎంతటి నిర్మాతకైనా దర్శకుడికైనా అపజయాలు తప్పవు. కె.వి.రెడ్డి లాంటి వాడికి కూడా కెరీర్ చివరి రోజుల్లో సరైన హిట్ తగల్లేదు. విజయబాపినీడు కీ తప్పలేదు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన బిగ్ బాస్ సినిమా బాక్సాఫీసు దగ్గర డీలా పడింది. ఆ తర్వాత చేసిన ఒకటి రెండు ప్రయత్నాలు కూడా కలసి రాలేదు. చిరంజీవితో మరో సినిమా చేయాలన్న ఆలోచనలూ కలసి రాలేదు. ప్రియమిత్రుడు రవీంద్రనాథ్ చౌదరి భౌతికంగా దూరం అయిన తర్వాత ఎందుచేతో విజయబాపినీడుకి విజయం ముఖం చాటేసింది.

గ్యాంగ్ లీడర్ సినిమా పూర్తి అవుతున్న టైమ్ లో ఒక విచిత్రం జరిగింది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మర్రి చెన్నారెడ్డి మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేశారు శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ అధినేత మాగంటి రవీంద్రనాథ్ చౌదరి. ఆ తర్వాత నేదురుమిల్లి జనార్ధనరెడ్డి కాబినెట్ లోనూ మంత్రి పదవి వరించింది. ఆ సందర్భంగా ప్రమాణస్వీకారం చేస్తూ…వేదిక మీదే మరణించారు రవీంద్రనాథ్ చౌదరి. ఆయన మరణానంతరం గ్యాంగ్ లీడర్ విడుదలైంది. మాగంటి రవీంద్రనాథ్ మరణం తర్వాత శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చిన సినిమా బిగ్ బాస్. దాదాపు ఆ బ్యానర్ లో అదే చివరి చిత్రం కూడా. చిరంజీవి ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని విజయబాపినీడు పెట్టిన బిగ్ బాస్ టైటిల్ కు అనూహ్య స్పందన వచ్చింది. గ్యాంగ్ లీడర్ విజయాన్ని మరపించే చిత్రం అవుతుందన్నారు అంతా. 1995లో విడుదలైన బిగ్ బాస్ బాక్సాఫీసు దగ్గర దారుణంగా దెబ్బతింది. అభిమానుల అంచనాలను అందుకోవడంలో సినిమా పూర్తిగా విఫలం చెందింది. సాంకేతికంగా కూడా శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ వారి గత చిత్రాల స్తాయిలో కనిపించదు బిగ్ బాస్. బిగ్ బాస్ పరాజయం తర్వాత విజయబాపినీడు కూడా ఒకటి రెండు చిత్రాలు తీశారుగానీ అవీ కలసిరాలేదు. చిరంజీవితో ఎలాగైనా సినిమా చేసి హిట్ కొట్టి రిటైర్ కావాలనే ఆయన కల తీరనే లేదు. ప్రముఖ దర్శక నిర్మాతగా విజయ బాపినీడు తీసింది 22 సినిమాలే అయినా మెగస్టార్ చిరంజీవికి మెగా ఇమేజ్ తీసుకురావడంలో ఆయన పాత్ర అంతా ఇంతా కాదు. చిరంజీవికి సరికొత్త ఇమేజ్‌ను తీసుకురావడంలో విజయ బాపినీడు కీలక భూమిక పోషించారని చెప్పాలి.

తెలుగు సినీ రంగంలో సినీ రచయితగా, సినీ దర్శకునిగా, నిర్మాతగా, పత్రికా అధిపతిగా విజయపథంలో పయనించిన విజయ బాపినీడుగారు అనారోగ్యంతో 2019 ఫిబ్రవరి 12 న కన్నుమూసారు.

Send a Comment

Your email address will not be published.