విలక్షణ విలనిజం

విలక్షణ విలనిజం

వెండితెరపై విలక్షణ విలనిజాన్ని పండించిన రావు గోపాలరావు
ఈ నెల13 ఆయన వర్ధంతి

సినీ నటుడు, రాజకీయవేత్తగా గుర్తింపు పొందిన రావు గోపాలరావు వెండితెరపై విలక్షణ విలనిజాన్ని ఆవిష్కరించిన ప్రతిభాశాలి. ఈ నెల13 ఆయన వర్ధంతి..ఈ సందర్భంగా ఆయన జీవిత విశేషాలు గుర్తుచేసుకుందాం

కాకినాడ సమీపంలోని గంగనపల్లి లో జనవరి 14, 1937లో రావు గోపాలరావు జన్మించారు. చిన్నప్పటినుంచీ నటనపై ఆసక్తితో ఎనో నాటకాల్లో నటించారు. రంగస్థల నటుడుగా భమిడిపాటి రాధాకృష్ణ రచించిన ‘కీర్తిశేషులు’ నాటకంలోని పాత్రతో ప్రాముఖ్యత సంతరించుకున్న రావు గోపాలరావు కాకినాడలో కొంతకాలం అసోసియేటెడ్‌ అమెచ్యూర్‌ డ్రామా కంపెనీ నెలకొల్పి పలు నాటకాలు ప్రదర్శించారు. రావు గోపాలరావు నాటకాలను చూసి ఎస్‌.వి.రంగారావు మెచ్చుకుంటూ గుత్తా రామినీడుకి పరిచయం చేస్తే ‘భక్తపోతన’ చిత్రానికి అసిస్టెంట్‌ డైరక్టర్‌గా పెట్టుకున్నారు. గుత్తా రామినీడు దర్శకత్వంలో వచ్చిన భక్తపోతన (1966) సినిమాలో రంగారావు శ్రీనాథుని పాత్ర పోషించాడు. అందులో శృంగార నైషధాన్ని రాజుకు అంకితమిచ్చే ఘట్టంలో శ్రీనాథుడు రాజు కాళ్ళకు దణ్ణం పెట్టే సన్నివేశం ఉంది. ఎవరికంటే వాళ్ళకు దణ్ణం పెట్టడానికి ఇష్టపడని రంగారావు, రావు గోపాలరావు ను మద్రాసు పిలిపించి, రామినీడుకి పరిచయంచేసి అతనిచేత రాజా మామిడి శింగనామాత్యుని పాత్ర పోషింపజేసి, అతని కాళ్ళకు దణ్ణం పెట్టాడు. గోపాలరావులో ఉన్న ప్రతిభను గమనించిన రామినీడు ఆ చిత్రానికి అసిస్టెంట్‌ డైరక్టర్‌గా పెట్టుకున్నారు. అలా రామినీడు వద్ద బంగారు సంకెళ్ళు, మూగప్రేమ చిత్రాలకు సహాయ దర్శకుడుగా పనిచేసాడు. ప్రతాప్ ఆర్ట్స్ సంస్థ నిర్మాత కె. రాఘవ, కీర్తిశేషులు నాటకం చూసి రావు గోపాలరావు కు జగత్ కిలాడీలు (1969) సినిమాలో ప్రధాన విలన్ గా అవకాశం ఇచ్చాడు. ‘బంగారు సంకెళ్లు, మూగప్రేమ’ చిత్రాలకు సహాయ దర్శకుడుగా పనిచేసి, ‘జగత్‌ కిలాడీలు’ చిత్రంలో నటించి విలన్‌ అనిపించుకున్నారు. ఆ చిత్రానికి ఆయన కంఠస్వరం నచ్చక వేరొకరితో డబ్బింగ్‌ చెప్పించారు నిర్మాతలు. కె.ఎస్.ఆర్. దాస్ దర్శకత్వం వహించిన గండర గండడు (1969) సినిమాలో గోపాలరావు తన సొంత కంఠంతోనే పాత్రను పోషించి మెప్పించాడు.

బాపు-రమణల ముత్యాలముగ్గు (1975) సినిమాలో గోపాలరావు విలక్షణ విలన్ అవతారమెత్తడమేకాకుండా గోదావరి యాసలో తను పలికే డైలాగులతోనే సినిమా విజయంలో పాలుపంచుకున్నాడు. వేటగాడు సినిమాలో ప్రాసతో కూడిన పెద్దపెద్ద డైలాగులు, వింతైన విలనీతో ఆ సినిమాకే ఒక ప్రత్యేకత కట్టబెట్టారు. ఆరోజుల్లో మిమిక్రీ కళాకారులు రావు గోపాలరావు డిక్షన్ ను అనుసరిస్తూ ఎన్నో పేరడీలు వల్లించి ఆదరణ పొందేవారు. బాపు దర్శకత్వంలో రూపొందిన భక్త కన్నప్ప, గోరంత దీపం, మనవూరి పాండవులు, కలియుగ రావణాసురుడు, త్యాగయ్య, జాకీ, బుల్లెట్‌, చిత్రాలు ఆ చిత్రాల్లోని డైలాగ్స్‌ గుర్తిండిపోతాయి. అలా గుర్తుండి పోయే డైలాగ్స్‌ని, నటనని మగధీరుడు, కొండవీటి సింహం, కొండవీటి రాజా, కిరాయి రౌడీలు, ఖైదీ, కటకటాల రుద్రయ్య, జస్టిస్ చౌదరి, గోపాలరావుగారి అమ్మాయి, ఘరానా మొగుడు, దేవాలయం, చండశాసనుడు, బొబ్బిలిపులి, బొబ్బిలి బ్రహ్మన్న, అనుగ్రహం, అల్లరి ప్రియుడు, అభిలాష, యమగోల తదితర చిత్రాల్లోనూ ప్రదర్శించారు. కేవలం విలన్ గానే కాకుండా కొన్ని సినిమాల్లో హాస్యాన్ని కూడా గోపాలరావు పండించాడు. రావు – గోపాలరావు సినిమాలో నత్తి ప్రొఫెసర్ గా, పట్నం వచ్చిన పతివ్రతలు, మల్లెపువ్వు సినిమాల్లో మాలిష్ మారాజుగా, మావూర్లో మహా శివుడు సినిమాలో శివుడుగా, స్టేషన్ మాస్టర్ సినిమాలో స్టేషన్ మాస్టర్ గా రాణించారు. ముత్యాల ముగ్గులో పాత్రకు భిన్నంగా ఇంటిదొంగ సినిమాలో కంటనీరు పెట్టించే పాత్రను పోషించి మెప్పించారు. రావు గోపాలరావు వాచకానికి ప్రేక్షకులు జేజేలు కొట్టారు. దక్షిణ ఆసియాలో సినిమా సంభాషణలు, సౌండ్ ట్రాక్ తో విడుదలైన తొలి లాంగ్ ప్లే రికార్డు ముత్యాలముగ్గు సినిమాలో రావు గోపాలరావుది కావడం ఒక రికార్డు. ఆయన నట జీవితం ముత్యాల ముగ్గు చిత్రంలోని కొంపలు కూల్చే కంట్రాక్టర్ వేషంతో గొప్ప మలుపు తిరిగింది. అప్పట్లో ఆ చిత్రంలో ఆయన డైలాగులు మారుమోగిపోయాయి. ఆడియో క్యాసెట్స్, రికార్డుల అమ్మకాలలో రికార్డులు సృష్టించాయి. తరువాత తెలుగు సినిమా విలనీలోనే కొత్తదనానికి రావుగోపాలరావు కొత్త రూపునిచ్చారు. వీటిలో ఆయన డైలాగ్ మాడ్యులేషన్ వలనే అనేది ప్రత్యేకంగా చెప్పవలసినది. వేటగాడు చిత్రంలో యాస పాత్రతో కూడిన పెద్ద పెద్ద డైలాగ్స్ తో రావుగోపాలరావు జనం హృదయాలల్ను మరోసారి కొల్లగొట్టుకున్నారు. గోపాలరావుగారి అమ్మాయి చిత్రంలో వయసు మళ్ళినా వయసులో వున్నట్లు కనిపించే పాత్రలో, అలాగే మావూళ్ళో మహాశివుడు, స్టేషన్ మాస్టర్, వింత దొంగలు, రావుగోపాలరావు, మనవూరి పాండవులు, ఈనాడు లాంటి చిత్రాలలో ఆయన నట విశ్వరూపం కనిపిస్తుంది.

బాపు దర్శకత్వంలో రూపొందిన భక్తకన్నప్ప, గోరంత దీపం, మనవూరి పాండవులు, కలియుగ రావణాసురుడు, త్యాగయ్య, జాకీ, బుల్లెట్‌, చిత్రాలు ఆ చిత్రాల్లోని డైలాగ్స్‌ గుక్తుండిపోతాయి. అలా గుర్తుండి పోయే డైలాగ్స్‌ని, నటనని మగధీరుడు, కొండవీటి రాజా, కిరాయి రౌడీలు, ఖైదీ, కటకటాల రుద్రయ్య, జస్టిస్‌ చౌదరి, గోపాలరావుగారి అమ్మాయి, ఘరానా మొగుడు, దేవాలయం, చండశాసనుడు, బొబ్బిలిపులి, బొబ్బిలి బ్రహ్మన్న, అనుగ్రహం, అల్లరి ప్రియుడు, అభిలాష, యమగోల తదితర చిత్రాల్లోనూ ప్రదర్శించారు.

నిర్మాతగా గోపాలరావు స్టేషన్ మాస్టర్, లారీ డ్రైవర్, భార్గవ రాముడు, వింత దొంగలు వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించాడు విజయం సాధించారు. 1993లో ఆ ఒక్కటీ అడక్కు, అల్లరి ప్రియుడు, అల్లరి అల్లుడు, ప్రేమ అండ్ కో. అనే నాలుగు సినిమాలలో నటించారు. గోపాలరావు నటించిన ఆఖరి చిత్రం ప్రేమ అండ్ కో. సినిమా ఆయన చనిపోయిన కొద్దిరోజుల తరవాత విడుదలైంది. గోపాలరావు 125 సినిమాలకు పైగా నటించారు.

రావు గోపాలరావు అభినయానికి నాటకరంగంలో ఎన్నెన్నో ఒన్స్ మోర్ లు .. వెండితెరపై సైతం ఆయన నటనావిన్యాసాలు ప్రేక్షకుల చేతులు నొప్పిపుట్టేలా చప్పట్లు కొట్టించాయి.. ఏ పాత్రలోకైనా ఇట్టే పరకాయప్రవేశం చేసి ఆకట్టుకోవడం ఆయన శైలి… వాచకంతోనే ఆకట్టుకుంటూ వందలాది పాత్రలకు జీవం పోసి మెప్పించారు రావు గోపాలరావు… రావు గోపాలరావు అభినయానికి ముఖ్యంగా ఆయన వాచకానికి జనం జేజేలు పలికారు… అయితే అదే వాయిస్ ఆయనకు ఆరంభంలో శాపమయింది… కొన్ని చిత్రాల్లో రావు గోపాలరావు గొంతు బాగుండదని ఇతరుల చేత డబ్బింగ్ చెప్పించిన సందర్భాలూ ఉన్నాయి… బాపు-రమణ ఆయన వాచకంలోని విలక్షణాన్ని గ్రహించి ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో రావు గోపాలరావును నటింప చేశారు… రావు గోపాలరావు సాంఘికాల్లోనే కాదు పౌరాణిక, జానపద, చారిత్రకాల్లోనూ తనదైన బాణీ పలికించారు…

‘వేటగాడు’లో దివాన్‌జీ అయిన రావు గోపాలరావుకు విలువైన హారం కావాలి. దానిని మెడలో వేసుకొని మారువేషంలో ఎన్‌.టి.ఆర్‌ వస్తారు. ‘మా గురువు కల్లు కొండయ్య గారు’ అని నగేష్‌ ఎన్‌.టి.ఆర్‌ గురించి బిల్డప్‌ ఇస్తాడు. ఎన్‌.టి.ఆర్‌ ఊరికే ఉంటాడా? ‘ఏరా కుయ్యా’ అని రావు గోపాలరావును తిడతారు. తిడితే పర్వాలేదు. ‘ఏవన్నాను’ అని ఆయన్నే రిపీట్‌ చేయమంటారు. అప్పుడు రావుగోపాలరావు ‘ఏదో కుయ్యా అని చిన్న సౌండ్‌ ఇచ్చారండీ’ అంటారు. ప్రేక్షకులు ఎంత నవ్వుతారో. ఆ సినిమాలోనే రావు గోపాలరావు ప్రాసతో ప్రాణాలు తీస్తుంటారు. కొడుకైన సత్యనారాయణ విసిగిపోయి గుక్క తిప్పుకోకుండా ఎంత ప్రాస మాట్లాడతావో మాట్లాడు చూస్తాను అంటాడు. దానికి రావు గోపాలరావు చెప్పే డైలాగ్‌– ‘ఈస్టు స్టువర్టుపురం స్టేషనుమాస్టరు గారి ఫస్టు సన్‌ వెస్ట్‌కెళ్లి తనకిష్టమైన అతి కష్టమైన బారిష్టరు టెస్టులో ఫస్టు క్లాసులో బెస్టుగా పాసయ్యాడని తన నెక్స్ట్‌ ఇంటాయాన్ని ఫీస్టుకని గెస్టుగా పిలిస్తే ఆయన టేస్టీగా ఉన్న చికెను రోస్టుతో బెస్టు బెస్టు అంటూ తినేసి హోస్టుకు కూడా మిగల్చకుండా ఒక్కముక్క కూడా వేస్టు చేయకుండా సుష్ఠుగా భోంచేసి పేస్టు పెట్టి పళ్లు తోముకుని మరీ రెస్టు తీసుకున్నాడట ఏ రొస్టు లేకుండా. చాలా, ఇంకా వదలమంటావా భాషా బరాటాలు మాటల తూటాలు యతిప్రాసల పరోటాలు….. ’ ఇంకెక్కడి సత్యనారాయణ. పాయే.

రావు గోపాలరావు విలన్‌గా తెలుసు. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తెలుసు. కాని కామెడీని పండించే నటుడుగా వచ్చిన అవకాశాలను వదలుకోలేదటాయన. ‘ముత్యాల ముగ్గు’లో అంత సీరియస్‌ విలనే అయినా ‘డిక్కీలో పడుకోబెట్టేస్తానని’ ప్రేక్షకులు భయంభయంగానే అయినా నవ్వేలా చేశాడు. చిరంజీవి ‘మగ మహారాజు’లో రావు గోపాలరావు ఎప్పుడూ ఒక మరుగుజ్జు పిల్లాడిని చంకనేసుకొని దింపినప్పుడల్లా వాడు ఏడుస్తుంటే హైరానాపడుతూ తెగ నవ్విస్తారు. ‘మా ఊళ్లో మహాశివుడు’ రావు గోపాలరావు ప్రతిభకు మచ్చుతునక. అందులో ఆయన శివుడుగా భూమ్మీదకు వచ్చి పూజారి అయిన సత్యనారాయణతో పాలిటిక్స్, కరప్షన్, ప్రత్యేకరాష్ట్ర ఉద్యమాల గురించి మాట్లాడుతూ నవ్విస్తారు. శోభన్‌బాబు ‘దేవత’ సినిమాలో రావు గోపాలరావు జయప్రదకు వరుసకు బాబాయ్‌. కాని జయప్రదకు చెల్లెలు శ్రీదేవి పెళ్లి కానిదే తాను చేసుకోకూడదని ఉంటుంది. ఆ సంగతి తెలిసినా రావు గోపాలరావు శ్రీదేవితో జయప్రద పెళ్లి గురించి మాట్లాడుతుంటే సడన్‌గా జయప్రద వస్తుంది. ఆ సమయంలో కప్పిపుచ్చుకోవడానికి రావు గోపాలరావు చేసే కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది.

రావు గోపాలరావుతో జంధ్యాల ‘రావు గోపాలరావు’ సినిమా తీశారు. అందులో ఆయనకు మతిమరుపు ప్రొఫెసర్‌ వేషం ఇచ్చాడు. కోడి రామకృష్ణ ‘తోడు దొంగలు’ సినిమాలో పూర్తి స్థాయి కామెడీ వేషం చేయించారు. అందులో లాంచి గైడుగా రావు గోపాలరావు చాలా సందడి చేస్తారు. ఇక రాజేంద్ర ప్రసాద్‌తో నటించిన ‘ఆఒక్కటీ అడక్కు’లో రొయ్యల నాయుడుగా కామెడీ పండిస్తాడాయన. చివరి రోజులలో ఆయన నాగార్జున ‘అల్లరి అల్లుడు’లో వాణిశ్రీ భర్తగా నటించారు. ‘ఏదో సామెత చెప్పినట్టు’ అనేది ఆయన ఊతపదం. ఆయన చెప్పే సామెతలు అసలు సామెతలేనా అని సందేహం వస్తుంటుంది. ‘ఇదెలా ఉందంటే చీర కట్టుకోవే చిలకమ్మా గుడికెళదాం అని గుండూరావంటే తొక్కతో సహా ఎప్పుడో తినేశాను అనందంట అనసూయమ్మ. అలా ఉంది వ్యవహారం’… ఇది ఆయన చెప్పే సామెత.

కొన్ని చిరస్మరణీయ సంభాషణలు
ముత్యాల ముగ్గు: సెగట్రీ! సూరీడు నెత్తుటి గడ్డలా లేడూ! ఆకాసంలో ఎదో మర్డరు జరిగినట్టు లేదూ…. ఎప్పుడూ యదవ బిగినెస్సేనా. మడిసన్నాక కుసంత కలాపోస నుండాల. తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకూ తేడా ఏముంటది? నారాయుడూ…ఆ ఎగస్పార్టీ వాళ్లిచ్చే డబ్బు నువ్వే ఇవ్వరా మిగిలిపోతావు అంటే వినిపించుకున్నావా? కరుసైపోయావు. కారు ఎనకసీట్లో దర్జాగా రాజాలా కూసుని ఎల్లేటోడివి. ఇప్పుడు డిక్కీలో తొంగున్నావు. దర్జా తగ్గిపోలే.”/ “చూడు గుర్నాధం. నీలాటోళ్ళు నన్ను బాగా పొగిడేసి బోర్లా కొట్టిన్చేస్తున్నారని బయమేసి ఈ బట్రాజు మేళం ఎట్టిచ్చాడు మా శగట్రీ. ఎవరైనా సరే పొగిడారో… ఈళ్ళు బాజా కొట్టేస్తారు. నేను బరతం పట్టేస్తాను.”/”అయ్ బాబోయ్.. అదేటండి అలా సూసేత్తన్నారు. ఆవిడ ఎవరనుకున్నారు? పెద్ద ఆఫీసరు భార్య…ఇద్దరు పిల్లలు. దీన్సిగదరగ…ఆఫీసర్ల పెళ్ళాలు డాన్సు చెయ్యకూడదేటండి! కలాపోసన. పొద్దత్తమాను తిని తొంగుంటే ఇక గొడ్డుకీ, మడిసికీ తేడా ఏటుంటాది? అంచేతే డాన్సు కోసం సెపరేషనుగా ఓ డిపార్టుమెంటే పెట్టేశాను.” (కరడుగట్టిన కాంట్రాక్టరు పాత్రలో)
వేటగాడు: “గాజుగదీ గాజుగదీ అనాలని మోజుపడి ప్రతిరోజూ ఆ మాటనే పోజుగా స్క్రూ లూజుగా వాడితే మనబూజు దులిపేసి గ్రీజు పెట్టేస్తారురా నిరక్షర కుక్షి.”/ “కొండయ్యగారు ఏదో ఆటకీ ఈపూట తేట తెలుగులో ఒక మాటన్నారని అలా చీటికీ మాటికీ అంటున్నారని నువ్వు సూటిగా కోపం తెచ్చుకుంటే తీట తీరిపోయి వీధిలో చాటలమ్ముకుంటూ, పాటలు పాడుకుంటూ పూటతిండి అడుక్కుని బతకాల్రా బేటా”
మనవూరి పాండవులు:”కన్నప్పా! తాగి వాగుతున్నావు. ఇంటికెళ్ళి పడుకో. ఒకేళ పొద్దున్న బతికి బావుండి మేలుకున్నావనుకో…. దొరగార్ని తిట్టానని గుర్తొచ్చి మనసు పాడైపోయి సచ్చిపోతావు. పో…ఆంజనేయ దండకం సదూకుంటూ పడుకో” (దొర మూడోకన్ను తెరుచుకొని కన్నప్ప మీద కత్తి దూస్తూ)
భక్త కన్నప్ప: “భక్తులారా నిన్న రాత్రి కూడా యధాప్రకారం కైలాసం వెళ్లి స్వామిని సేవించి వచ్చాను. మీ మీ కష్టసుఖాలూ, కోరికలూ వారికి మనవి చేశాను. నేను కైలాసం వెళ్ళకపోతే స్వామివారు బెంగపెట్టుకుంటారు. రా సుబ్బన్నా. నీ కష్టాల గురించి స్వామికే కాదు, అమ్మవారికి కూడా విన్నవించాను. తల్లీ….ఇలా బతికి చితికిన కుటుంబం. వాళ్లకి మళ్ళీ దశెత్తుకోవాలంటే కరుణించక తప్పదు అని చెప్పగా వారు సరేనన్నారు.” (కైలాసనాథశాస్త్రి తన భక్తులతో)
గోరంత దీపం:”సర్లేవో. వేళకి తిండిలేక నీరసవొస్తే వేళాకోళమొకటి. మా సేటు నేనంటే ముచ్చటపడి చస్తాడు. రాజశేఖరం… నువ్వారో ఘంటకి రాపోతే గడియారాలాగిపోతాయి. నా ఫ్యాక్టరీలు నడవవోయ్ అంటాడు. నువ్విలా నిలబడి ఖడేరావను… చాలు… వర్కర్లు ఝామ్మని పనిజేస్తారు. నువ్వింటికెల్తానంటే నాకు గుండె గాభరా అంటాడు.” (రాజశేఖరం తన భార్యతో గొప్పలు చెబుతూ)
త్యాగయ్య: “రాజదర్శనం త్రోసిరాజని, రాముడి పూజకోసం వచ్చేస్తావా? ఏం చూసుకొనిరా నీకా పొగరు? ఆ కండ కావరం! నాన్నగారికన్నా గొప్పవాడివా? కొత్తగా కొమ్ములు మొలిచాయా? ఆయనతో చిన్నప్పుడు రాజసభకు వెళ్ళలేదూ! అక్కడ రామాయణం చదవలేదూ” (సాత్వికత ఉట్టిపడేలా)

ఎన్నో ప్రతిభా పురస్కారాలు

రావు గోపాలరావు కళారాధనకు గుర్తుగా ఆంధ్రవిశ్వ విద్యాలయం ఆయనకు 1990లో కళాప్రపూర్ణ (డాక్టరేట్) ప్రదానం చేసింది. అనేక నాటక సంస్థలు గోపాలరావుకు నటవిరాట్ బిరుదును ప్రదానం చేశాయి. సితార, నంది అవార్డులు, చిత్తూరు నాగయ్య (1987) పేరుతో ఇచ్చే బహుమతులు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్ లో కమిటీ సభ్యునిగా పనిచేశారు.1984-85 మధ్య ఆంధ్రప్రదేశ్ లిజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా పనిచేశారు. 1986-92 మధ్య కాలంలో రాజ్యసభ సభ్యునిగా వున్నారు.

తెరపై ఎన్నో ప్రతినాయక పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసిన రావు గోపాలరావు నిజజీవితంలో ఎంతో సౌమ్యులు.. మధుమేహవ్యాధి తీవ్రమై, కిడ్నీలు చెడిపోయిన స్థితిలో 1994, ఆగష్టు 13న 57 ఏళ్ల చిన్న వయసులోనే రావు గోపాలరావు మరణించారు… ఎన్నో మరపురాని పాత్రలు పోషించిన రావు గోపాలరావు నటవారసునిగా రావు రమేశ్ ఈ తరం వారిని తనదైన నటనతో అలరిస్తున్నారు… తెలుగు ప్రతినాయకుల్లో నటవిరాట్ గా జనం మదిలో నిలచిపోయారు రావు గోపాలరావు.