విశ్వ నట యశస్వి

విశ్వ నట యశస్వి

విశ్వ నట యశస్వి రంగారావు

సహజ గంభీరమైన నటనతో తెలుగు ప్రేక్షక సామ్రాజ్యాన్ని ఏలిన ఎస్వీ రంగారావు..అంటే తెలియనివాళ్లు బహుశా ఎవరూ ఉండరేమో…కానీ ఆయన పూర్తిపేరు చాలా మందికి తెలియనే తెలియదు..సామర్ల వెంకట రంగారావు అనే పేరు చిత్ర సీమలో ఎస్వీ రంగారావుగా సుప్రసిద్ధమైంది. జూలై 3న ఆయన 102వ జయంతి సందర్భంగా కథనం….

కృష్ణాజిల్లాలోని నూజివీడులో 03-07-1918న లక్ష్మినరసాయమ్మ, కోటేశ్వరరావు దంపతులకు ఎస్వీ రంగారావు జన్మించారు. స్వస్థలం కాకినాడ. తండ్రి ఎక్సైజ్ అధికారిగా నూజివీడులో పనిచేసారు. తల్లి వెంకటేశ్వరస్వామి భక్తురాలు అవటం చేత కొడుకుకు వెంకట రంగారావు అనే పేరు పెట్టుకున్నారు.

ధనవంతులైన తల్లితండ్రులు ఇతనిని హైస్కూల్ విద్యకే మద్రాస్ పంపించారు. శ్వృ తన 12 వ ఏటనే, హైస్కూల్ విద్య పూర్తి చేసి,భ్.శ్చ్ లో చేరారు. హైస్కూల్ విద్యార్ధిగా ఉన్నప్పటి నుంచి ఇతనికి కళలంటే ఎక్కువ మక్కువ. కాలేజీలో చదువుకునేటప్పుడే, అతను తన నటనకు మెరుగులు దిద్దుకున్నాడు. డిగ్రీ పూర్తి అయిన తర్వాత, బందరులో అగ్నిమాపక శాఖలో ఉద్యోగం సంపాదించకముందు నటనా రంగంవైపు ఆకర్షితులయ్యారు.

నాటకరంగంలో
ఏలూరులో ఉన్న రంగారావు మేనమామ బడేటి వెంకటరామయ్య మరణించడంతో కూతురికి తోడుగా ఉండటం కోసం రంగారావు నాయనమ్మ తన మకాంను మద్రాసు నుంచి ఏలూరుకు మార్చింది. తమ ఇంట్లో ఎవరూ కళాకారులు లేరు. అందువల్ల అతను బాగా చదువుకుని ఏదైనా ఉద్యోగం సంపాదించుకుని స్థిరపడాలనేది ఇంట్లో వాళ్ళ కోరిక. కానీ రంగారావుకు మాత్రం నటుడవ్వాలనే కోరిక బలంగా ఉండేది. బాగా చదువుకుంటూనే నటనను కూడా వదిలి పెట్టలేదు. కాకినాడలోని యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్లో చేరి ఎన్నో నాటకాల్లో పాల్గొన్నారు. అతనికి అక్కడ అంజలీదేవి, ఆదినారాయణరావు, బి.ఎ.సుబ్బారావు, రేలంగి వంటి వారితో పరిచయం ఏర్పడింది.
నాటకాల్లో రంగారావు అనేక వైవిధ్యమైన పాత్రలు పోషించారు. పీష్వా నారాయణరావు వధ నాటకంలో రంగారావు ఇరవై రెండేళ్ళ వయసులో అరవై ఏళ్ళ వృద్ధుని పాత్ర ధరించి మెప్పించారు. ఖిల్జీ రాజ్యపతననం నాటకంలో మాలిక్ కపూర్ పాత్రలో, స్ట్రీట్ సింగర్ నాటకంలో విలన్ పాత్ర మొదలైన పాత్రలు పోషించారు. రంగారావుకు ఇంగ్లీషు మీద కూడా పట్టు ఉండటంతో షేక్స్‌పియర్ నాటకాల్లోని సీజర్, ఆంటోనీ, షైలాక్ లాంటి పాత్రలు పోషించేవారు. నాటకాలు వేస్తూనే బి. ఎస్. సి పూర్తి చేశారు. తర్వాత ఎం. ఎస్. సి చేయాలనుకున్నారు. కానీ అగ్నిమాపక దళంలో పని చేసే చొలెనర్ అనే అభిమాని సలహాతో అగ్నిమాపక దళంలో ఉద్యోగానికి దరఖాస్తు చేశారు. మద్రాసులో కొన్ని రోజులు శిక్షణ తర్వాత మొదట బందరులో తర్వాత విజయనగరంలో ఫైర్ ఆఫీసరుగా పనిచేశారు. ఈ ఉద్యోగంలో రంగారావుకు పెద్దగా పని ఉండేది కాదు. కానీ ఉద్యోగ స్వభావ రీత్యా ఖాళీ సమయాల్లో నటించడానికి వీలులేదు. తాను కళకు దూరం అవుతున్నేనేమో నని భావించిన రంగారావు ఆ ఉద్యోగం నుంచి బయటకు వచ్చేశారు

అప్పుడు ఆయన మదిలో రెండు ఆలోచనలుండేవి. ఎంఎస్సీలో లో చేరటమా లేక సినిమా రంగంలో నటుడిగా కృషి చెయ్యటమా! అని. వారి బంధువైన బి.వి.రామానందం గారు తాను తీయబోయే సినిమాకోసం శ్వృ ను సినీ రంగానికి ఆహ్వానించారు. ఆ సినిమా పేరు వరూధిని. రంగారావు గారు వెంటనే ఉద్యోగం మానివేసి, సినీరంగంలో ప్రవేశించటానికి మద్రాస్ పయనమయ్యారు. వరూధిని అనుకున్నంత విజయం సాధించలేదు. అందుచేత కొంతకాలం వరకు వారికి సినిమాలలో వేషాలు వేసే అవకాశం రాలేదు. తర్వాత రంగారావు గారికి విసుగు పుట్టి, జంషెడ్ పూర్ లో టాటా సంస్థలో కొన్నాళ్ళు ఉద్యోగం చేసారు. అయితే అతనికి నటన పైన ఉన్న ప్రేమ తొలగిపోలేదు, పైగా ఎక్కువ కూడా అయింది.

తొలినాళ్ళలో
రంగారావు నటించిన మొట్టమొదటి చిత్రం 1946లో వచ్చిన వరూధిని అనే చిత్రం. ఈ సినిమా దర్శకుడు బి. వి. రామానందం రంగారావుకు దూరపు బంధువు. రంగారావు ఈ చిత్రంలో ప్రవరాఖ్యుడిగా నటిస్తే, నటి గిరిజ తల్లి దాసరి తిలకం అతనుకు జోడీగా నటించింది. అప్పటి దాకా నాటకాల్లో ఆడవేషాలు వేసే మగవాళ్ళ పక్కనే నటించిన రంగారావుకు మొదటి సారిగా నిజంగా ఆడవాళ్ళతో నటించడానికి కొంచెం జంకు వేసింది. అయితే రామానందం ప్రోత్సాహంతో సినిమాను పూర్తి చేయగలిగారు. తన తొలి సినిమాలో పాత్ర పోషించినందుకు గాను రూ.750 పారితోషికంగా అందుకున్నారు. కానీ చిత్రం బాక్సాఫీసు వద్ద నిరాశపరిచింది. దాంతో అతనుకు మళ్ళీ సినిమా అవకాశాలు రాలేదు. దాంతో ఉద్యోగం కోసం జంషెడ్పూర్ వెళ్ళి టాటా కంపెనీలో బడ్జెట్ అసిస్టెంట్ గా చేరారు. జంషెడ్పూర్ లో పనిచేసే ఆంధ్రులకు ఒక సంఘం ఉండేది. ఈ సంఘం ఉత్సవాల్లో భాగంగా నాటకాలు వేస్తూ ఉండేవారు. వీరాభిమన్యు నాటకంలో కర్ణుడిగా, ఊర్వశి నాటకంలో దుర్వాసునిగా అతను వేషాలు వేసేవారు. అదే సమయంలో అతను వివాహం కూడా జరిగింది.

మళ్లీ సినిమాల్లోకి
కొద్ది రోజుల తర్వాత బి. ఎ. సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పల్లెటూరి పిల్ల సినిమాలో విలన్ పాత్ర కోసం మద్రాసు నుంచి కబురందింది. అదే సమయంలో రంగారావు తండ్రి కోటేశ్వరరావు ధవళేశ్వరంలో మరణించడంతో అంత్యక్రియలకు హాజరై మద్రాసు చేరుకునేసరికి ఆ వేషం ఎ. వి. సుబ్బారావుకు ఇచ్చేశారు. బి. ఎ. సుబ్బారావుకు రంగారావుతో ఉన్న పరిచయం దృష్ట్యా అదే సినిమాలో మరో చిన్నపాత్ర దక్కింది. తర్వాత ఎల్. వి. ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన మనదేశం, పి. పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన తిరుగుబాటు చిత్రంలో కూడా అంతగా ప్రాధాన్యంలేని పాత్రలే వచ్చాయి. అయినా రంగారావు నిరుత్సాహ పడకుండా మంచి అవకాశం కోసం ఎదురుచూడసాగాడు.

అప్పుడే నాగిరెడ్డి, చక్రపాణి కలిసి విజయా ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ తొలిసారిగా నిర్మించిన షావుకారు సినిమాలో సున్నపు రంగడు అనే కీలకమైన పాత్రను రంగారావుకిచ్చారు. ఈ సంస్థలో ప్రవేశించడం రంగారావు కెరీర్ కు గట్టి పునాది పడింది. తర్వాత అదే సంస్థ నిర్మించిన పాతాళ భైరవి (1951) సినిమాలో అతి ముఖ్యమైన మాంత్రికుడి పాత్రను రంగారావుకిచ్చారు. కొత్త నటుడికి అంత కీలకమైన పాత్రను ఇస్తున్నారని నిర్మాతలకు కొంతమంది హెచ్చరించినా వారు పట్టించుకోలేదు. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో రంగారావుకి మంచి పేరు వచ్చింది.

వివాహం
మొదటి సినిమా వైఫల్యం తర్వాత మళ్ళీ అవకాశాలు దొరక్కపోవడంతో సినీ రంగం మీద ఆశలు వదిలేసుకున్న రంగారావు జంషెడ్పూర్ లో టాటా కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ఇదే సమయంలో అతని మేనమామ బడేటి వెంకటరామయ్య, కోటేశ్వరమ్మ దంపతుల కుమార్తె లీలావతిని 1947 డిసెంబరు 27న వివాహం చేసుకున్నారు. సినిమా అవకాశాలు అంతగా లేని రోజుల్లో అతని భార్య అతనిమీద అలిగి పుట్టింటికి వెళ్ళిపోయేది. ఆమెకు ఇష్టమొచ్చినప్పుడు తిరిగి రమ్మనీ, తమకు రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇచ్చేవారు. వ్యక్తిగా రంగారావు సహృదయుడు, చమత్కారి. సినిమా సెట్స్ మీద గంభీరంగా ఉండేవారు. వ్యక్తిగత విషయాలు సహనటులతో చర్చించడానికి ఇష్టపడేవాడు కాదు. మనసు బాగాలేనప్పుడు తన ఫాం హౌస్ లోకి వెళ్ళిపోయేవారు. దర్శక నిర్మాతలే అతడిని వెతుక్కుంటే వెళ్ళేవారు. అతని ఇష్టదైవం శివుడు. ప్రతిరోజూ శివపూజ చేసిన తర్వాత దినచర్య ప్రారంభించేవారు. అతనికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమార్తెల పేర్లు విజయ, ప్రమీల. కొడుకు పేరు కోటేశ్వరరావు. కొడుకును సినిమాల్లోకి తీసుకురావాలనుకుని కొంత చిత్రీకరణ కూడా జరిగింది. కొన్ని కారణాల వలన ఈ సినిమా కొనసాగలేదు.

పాతాళ భైరవిలో నేపాలీ మాంత్రికుడి వేషం

రంగారావుకు ‘పల్లెటూరిపిల్ల’ చిత్రంలో విలన్ గా నటించటానికి బి.ఏ. సుబ్బారావు నుండి ఆహ్వానం వచ్చింది. అయితే, దురదృష్టం ఏమిటంటే, వీరు మద్రాస్ వెళ్ళటానికి రైలు ఎక్కే సమయంలో, వారి నాన్న గారు స్వర్గస్తులైనారనే తంతి వార్త వచ్చింది. తండ్రి అంత్యక్రియలు పూర్తి చేసుకొని, మద్రాస్ వెళ్ళేటప్పటికి, ఆ వేషం మరొకరికి ఇచ్చేశారు.. ఆయన అదృష్టమేమంటే–విజయా వారి, కే.వి.రెడ్డి గారి దృష్టిలో పడటమే! పాతాళ భైరవిలో నేపాలీ మాంత్రికుడి వేషం వేసే ఛాన్స్ వచ్చింది. వచ్చిన ఆ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటమే కాకుండా, ఆయన ఆ పాత్ర పోషించిన తీరు పండిత పామరుల ప్రశంసలు అందుకుంది. ఇక విజయా వారికి ఈయన ఆస్థాన నటుడయ్యారు. ఆ తర్వాతనే విడుదలైన విజయా వారి ‘పెళ్లిచేసిచూడు’ సినిమాలో వీరు పోషించిన ‘వియ్యన్న’ పాత్ర కూడా నేపాలీ మాంత్రికుడి వేషం వలే తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. దాని తమిళ రీమేక్ లో కూడా అదే పాత్రను పోషించి, తమిళ ప్రజల మన్ననలను కూడా పొందారు. విజయా వారు మాయాబజార్ తీసేటప్పుడు, ‘ఘటోత్కచుని’ వేషానికి ముందుగా వీరిని తీసుకున్నారు. కే.వి.రెడ్డి గారు అన్నారుట ‘ఆ వేషానికి వేరే ఆప్షన్ లేదు’ అని. మాయాబజార్ అంత రసవత్తరంగా తయారు కావటానికి ముఖ్యకారకులలో అతిముఖ్యుడీయన! అలా నిర్విరామంగా వీరి నటయాత్ర తెలుగు, తమిళరంగాలలో కొనసాగింది. వీరు నటించిన నర్తనశాల లోని కీచకుని వేషానికి పలువురి ప్రశంసలు లభించింది. సతీ సావిత్రి అనే సినిమా తీసేటప్పుడు, చైనా ప్రధాని చౌ యెన్ లై , వీరిని సెట్లో యముని వేషంలో చూసి ఆశ్చర్య చకితులయ్యారట! జకార్తాలో జరిగిన ఇండోనేసియా ఫిలిం ఫెస్టివల్ లో, వీరి కీచకుని వేషానికి ఉత్తమ నటుని అవార్డుతో పాటుగా బంగారు పతకం కూడా దక్కింది. ముఖ్యంగా పౌరాణిక సినిమాలలో ప్రతినాయకుడిగా నటించి తనదైన ఒక ప్రత్యేక బాణీని ప్రవేశపెట్టారు.

తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా
రావణ బ్రహ్మ, దుర్యోధనుడు, హిరణ్యకశిపుడు, మాయల పకీరు తదితర వేషాలు వీరిని తెలుగు ప్రేక్షకుల గుండెలపై చిరస్థాయిగా కూర్చో పెట్టాయి. సంభాషణల ఉచ్చారణ, పలికే విధానం, మాటల విరుపు, హావభావాలు మరెవరి తరంకావు. ఎంత మహా నటుడినైనా అధిగమించగలిగిన సత్తా సామర్ధ్యం వీరి సొంతం. వీరితో నటించాలంటే ఆనాటి అగ్రనటులు సైతం భయపడేవారు, ఒక్క సావిత్రి తప్ప! ఆయన సమకాలీనుడైన గుమ్మడి గారి మాటల్లో చెప్పాలంటే, ఇటువంటి నటుడు పొరపాటున మన దేశంలో పుట్టాడు, మరే దేశంలోనైనా పుట్టివుంటే ప్రపంచపు నటులలోనే మేటి నటుడయ్యే వాడు! ఇంతకన్నా గొప్ప అవార్డు, రివార్డ్ ఏమున్నది? వీరు నటించిన “బంగారు పాప” (1955) ఆర్ధికంగా విజయం సాధించక పోయినా మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఈ చిత్రంలో ఎస్‌.వి.రంగారావు గారి నటనను, లండన్‌లో చూసిన చార్లీ చాప్లిన్‌, ఇలియట్‌ “బ్రతికి ఉంటే చాలా సంతోషించి ఉండేవాడని” అన్నారు.(జార్జి ఇలియట్‌ రాసిన “సైలాస్‌ మార్నర్‌” అన్న ఆంగ్ల నవల ‘బంగారుపాప’కు ఆధారం.)

అగ్రనటులతో సమానంగా
చాలా సాంఘిక, చారిత్రిక, పౌరాణిక సినిమాలలో విభిన్న పాత్రలు పోషించి తనకు తానే సాటి అని అనిపించుకున్నారు రంగారావు. బంగారు పాప అనే సినిమాలో ఒక గుడ్డివాని వేషం వేస్తున్నారు, అదే సమయంలో ఎన్ టీ రామారావు చిరంజీవులు అనే సినిమాలో గుడ్డివాని వేషం వేస్తున్నారు. ఇద్దరూ కలిసి పొద్దున్నే, మద్రాస్ రైల్వే స్టేషన్ కి వెళ్లి, గుడ్డి వారి హావభావాలు పరిశీలించేవారట! అలా సమాజంలో ఉన్న వ్యక్తులను పరిశీలించటం వల్లనే, వారి నటన అతి సహజంగా ఉండేది! ఆ రెండు సినిమాలలో వారి నటన అందరి మన్ననలను పొందిన విషయం మనందరికీ తెలిసినదే! తెలుగులో ణ్టృ నటించిన ‘కథానాయకుడు’ సినిమా ఎంత విజయం సాధించిందో మనందరికీ తెలిసిన విషయం. అందులో నాగభూషణం గారు ప్రతినాయకుడి పాత్రను అద్భుతంగా నటించారు. అదే సినిమాను తమిళంలో మళ్ళీ తీసేటప్పుడు, నాగభూషణం వేసిన పాత్రను తమిళ సినిమాలో రంగారావు వేసారు. కేవలం అతని నటన వల్లనే ఆ సినిమా తెలుగులో కన్నా ఘనవిజయం సాధించింది! తమిళం కూడా అనర్గళంగా మాట్లాడే ఆయన, తమిళ సినిమాలలో నటించేటప్పుడు తమిళులు చాలామంది, వీరు మా తమిళుడే అని భావించేవారట! అగ్రనటులతో సమానంగా వీరు పారితోషికం తీసుకునే వారట!

ఇతర భాషల్లో
1952లో విజయ ప్రొడక్షన్స్ వారు నిర్మించిన పెళ్ళి చేసి చూడు సినిమాను తమిళంలో కల్యాణం పణ్ణి పార్ అనే పేరుతో పునర్నిర్మాణం చేశారు. తెలుగులో తాను పోషించిన పాత్రను రంగారావు తమిళంలో కూడా చేశారు. తర్వాత అన్నై, శారద, కర్పగం, నానుం ఒరుపెణ్ వంటి తమిళ చిత్రాలలో నటించి తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ముఖ్యమైన సహాయనటుడిగా పేరు గాంచారు. తెలుగులో ఘనవిజయం సాధించిన పాతాళ భైరవి సినిమాని జెమిని అధినేత వాసన్ హిందీలో కూడా తీయగా అందులో కూడా రంగారావు మాంత్రికుని పాత్ర పోషించారు. హిందీ భాషలో ప్రవేశమున్న రంగారావు తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. భానుమతి దర్శక నిర్మాత వచ్చిన నాది ఆడజన్మే ఆధారంగా హిందీలో తీసిన మై భీ లడ్కీ హూ లాంటి హిందీ చిత్రాల్లో నటించారు. భూకైలాస్, మాయాబజార్ లాంటి కన్నడ చిత్రాలలోనూ, విదయాగలే ఎతిలే ఎతిలే, కవిత వంటి మలయాళ చిత్రాలలో కూడా నటించారు.

ఎంతో గుర్తింపు
నటసామ్రాట్, విశ్వనట చక్రవర్తి మొదలగు బిరుదులతో తెలుగు ప్రేక్షకులు అతనిని గౌరవించారు. ఎస్వీయార్ నటించిన నర్తనశాల ఇండొనేషియాలోని జకార్తాలో ఆఫ్రో-ఆసియా అంతర్జాతీయ చిత్రోత్సవము‍లో ప్రదర్శించబడడమే కాకుండా కీచకపాత్రకు గాను ఎస్వీయార్ అప్పటి ఎన్నో చిత్రాల కథానాయకులను వెనుకకు నెట్టి భారతదేశం నుంచి తొలి అంతర్జాతీయ ఉత్తమ నటుడుగా బహుమతి పొందారు. కొన్ని చిత్రాలకు అతను దర్శకత్వం వహించారు. ముఖ్యంగా అతను దర్శకత్వం వహించిన చదరంగం చిత్రానికి రెండో ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం లభించింది. రెండో చిత్రం బాంధవ్యాలు ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం అందుకున్నది. నటి లక్ష్మి ఈ చిత్రంతోనే సినీ రంగంలోకి ప్రవేశించింది. అయితే ఈ సినిమాలు ఆర్థికంగా విజయం సాధించలేదు.

నటనా శైలి
రంగారావు తన నటనలో ఆంగిక, వాచిక, ఆహార్య, సాత్వికాభినయాలు కలబోసిన నటుడు. సహజ నటుడిగా పేరుగాంచారు. రంగారావుకు తొలినాళ్ళలో మంచి పేరు తెచ్చిన షావుకారు చిత్రంలోని సున్నం రంగడి పాత్ర కోసం తన స్వగ్రామంలో కోడి రంగడు అనే రౌడీని మనసులో పెట్టుకుని అతని మాట తీరుని, ప్రవర్తనా విధానాన్ని అనుకరించారు. సంతానం చిత్రంలో అతను పోషించిన గుడ్డివాని పాత్ర కోసం కొన్నాళ్ళు పాటు అంధుల ప్రవర్తనను గమనించారు. మాంత్రికుడి పాత్ర కూడా అతను పోషించిన పాత్రల్లో బాగా పేరొందింది. నిజంగా మాంత్రికులను గమనించడం సాధ్యం కాదు గనక తాను ఆంగ్ల నాటకాల్లో ధరించిన షైలాక్ పాత్రలను ఆధారంగా చేసుకుని మరింత రౌద్రరసాన్ని కలిపి తనదైన శైలిలో నటించారు.

రంగారావు యుముడి పాత్ర పోషించిన సతీ సావిత్రి సినిమా మద్రాసులో జెమినీ స్టూడియోలో చిత్రీకరణ జరుగుతుండగా మద్రాసు పర్యటనకు వచ్చిన చైనా ప్రధాని చౌ ఎన్ లై ఇతను నటనను అభినందించారు. వాచికం విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవాడురు. రౌడీ పాత్రల్లో నటించేటపుడు అప్పటిదాకా వస్తున్న సాంప్రదాయం ప్రకారం భీకరమైన అరుపులతో కాకుండా నెమ్మదిగా నటిస్తూనే గూట్లే, డోంగ్రే లాంటి పదాలను ప్రయోగిస్తూ తనదైన శైలిని ప్రవేశపెట్టారు. అతను కళ్ళు, కంఠస్వరం వివిధ పాత్రలకు తగ్గట్టుగా మలచేవారు.

పాత్రలోకి ఒదిగిపోయే రంగారావు

కీచకుడు, దుర్యధనుడు, మాంత్రికుడు, రావణాసురుడు, బీదవాడు, జమిందార్… ఒకటేంటి, ఏ పాత్ర చేసినా ఆ పాత్రగా మారిపోయే మహానటుడాయన. ఎన్టీఆర్ లాంటి ఉద్దండ నటుడితో ఢీ అంటే ఢీ అని నటించిన మేరునటధీరుడు ఎస్వీఆర్. ఆయన సినిమాల్లో ఎక్కువసార్లు చూసిన సినిమా నర్తనశాల. ఓ యాభై సార్లకు తగ్గకుండా చూసాను. ఎన్నిసార్లు చూసినా కొత్తగా అనిపిస్తుంది.

కథా రచయితగా
ఎస్.వి.రంగారావు నటుడిగానే కాక కథా రచయితగా కూడా రాణించాడు. ఆయన రాసిన కథలు ఆంధ్రపత్రిక, యువ, మనభూమి వంటి పత్రికలలో 1960-64 మధ్యకాలంలో ప్రచురింపబడ్డాయి. “వేట”, “ఆగష్టు 8”, “పసుపు కుంకుమ”, “ప్రాయశ్చిత్తం”, “విడుదల”, “సంక్రాంతికి”, “సులోచన” అనే ఏడు కథలు మాత్రం లభ్యమౌతున్నాయి. ఇటీవల ఈ కథలతో ఎస్.వి.రంగారావు కథలు అనే పుస్తకం వెలువడింది.

జీవన తాత్వికత
యస్వీఆర్ ఒక రకమయిన వేదాంతి. అతని ఇంటి లైబ్రరీలో వివేకానందునికి సంబంధించిన పుస్తకాలు ఎన్నో ఉండేవి. తానే స్వయంగా కొన్ని రచనలు కూడా చేశారు. ప్రజాహిత సంస్థలకు లెక్కలేనన్ని విరాళాలు ఇచ్చారు. చైనాతో యుద్ధం వచ్చినపుడు ఏర్పాటు చేసిన సభలో పదివేల రూపాయలు విరాళం ఇచ్చారు. తర్వాత పాకిస్తాన్‌తో యుద్ధం వచ్చినపుడు కూడా ఎన్నో సభలు నిర్వహించి, మిగతా నటులతో కలసి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి, విరాళాలు సేకరించి, ఆ డబ్బును రక్షణ నిధికి ఇచ్చారు. పెంపుడు జంతువులంటే రంగారావుకిష్టం. వాళ్ళ ఇంటిలో జర్మన్ షెఫర్డ్ జాతికి చెందిన రెండు కుక్కలుండేవి. వేట అంటే కూడా అతనుకు ఆసక్తి ఉండేది. కానీ కొద్దికాలం తర్వాత ఆ అలవాటు మానేశారు. ఆంగ్ల చిత్రాల్లో నటించలని అతనుకు కోరికగా ఉన్నా అలాంటి అవకాశం రాలేదు.

నిర్మాతగా కూడా
రంగారావు దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు ఆడపిల్లలు(విజయ,ప్రమీల) ఒక కుమారుడు(కోటేశ్వరరావు). నిర్మాతగా కూడా మారి విజయవంతమైన నాదీ ఆడజన్మే!, చదరంగం, బాంధవ్యాలు, సుఖదు:ఖాలు లాంటి చక్కని సినిమాలను తీసారు. చదరంగం, బాంధవ్యాలు–సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు, పలు సంస్థల నుండి చాలా అవార్డ్స్, బిరుదులు పొందారు. 1974 ఫిబ్రవరిలో హైదరాబాదులో హృద్రోగానికి గురై ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందిన రంగారావు ఆరోగ్యవంతుడై తిరిగి వచ్చాడు. వైద్యులు అతనుకు విశ్రాంతి అవసరమని సూచించినా నటించడం మాత్రం మానలేదు. నటుడిగా అతను చివరి చిత్రాలు చక్రవాకం (1974), యశోద కృష్ణ (1975). యశోద కృష్ణ సినిమా చిత్రీకరణ తర్వాత బైపాస్ సర్జరీ కోసం అమెరికా వెళ్ళాలనుకున్నారు. కానీ ఈ లోపే అకస్మాత్తుగా, తీవ్రమైన గుండెనొప్పి వచ్చి, ఉస్మానియా హాస్పిటల్ లో వైద్యం తీసుకునే సమయంలో, మళ్ళీ మరొక్కసారి గుండెనొప్పి చేత 18-03-1974 న తుదిశ్వాస విడిచారు.

Send a Comment

Your email address will not be published.