వెండితెర హాస్యానికి చిరునామా

వెండితెర హాస్యానికి చిరునామా

వెండితెర హాస్యానికి చిరునామా రేలంగి
ఆగస్టు9న రేలంగి 111వ జయంతి

భారతదేశం మొత్తం మీద హస్యనటుల్లో తొలిసారిగా పద్మశ్రీ అందుకున్న ఘనత రేలంగికే దక్కింది. నలుపు, తెలుపు రోజులలో హాస్యానికి చిరునామాగా వెలుగొందారు రేలంగి. ఒకే షాట్‌లో ముఖంలోని భావాలు మార్చి ప్రదర్శించడం, అందుకు అనుగుణంగా డైలాగ్‌లను టైమింగ్‌లో పలికి హాస్యం పండించడంలో ఆయనకు ఆయనే సాటిగా పేరుతెచ్చుకున్నారు. ఈనెల 9న రేలంగి 111వ జయంతి సందర్భంగా నాటి వెండితెర హాస్యానికి చిరునామాగా పేరొందిన ఆయన విశేషాలు…

రేలంగిగా పేరుగాంచిన రేలంగి వెంకట్రామయ్య ఆగష్టు 9, 1910న తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ సమీపంలోని రావులపాడు అనే గ్రామంలో జన్మించాడు. తండ్రి హరికథ, సంగీతం నేర్పించేవాడు. చిన్నతనంలో తండ్రి దగ్గర ఈ విద్యలు నేర్చుకున్నాడు. బాల్యమంతా ఎక్కువ భాగం రావులపాడు, కాకినాడల్లో గడిచింది. చదువుకునే వయసునుంచే నాటకాలు వేయడం ప్రారంభించాడు. 1935లో కృష్ణ తులాభారం చిత్రం ద్వారా 1935లోనే దర్శకుడు సి.పుల్లయ్య రేలంగిని సినీ పరిశ్రమకు పరిచయం చేశాడు కానీ, 1948 దాకా చెప్పుకోదగ్గ గుర్తింపు రాలేదు. ఈ సమయంలో పుల్లయ్య దగ్గర సినీ నిర్మాణానికి సంబంధించి పలు శాఖల్లో పని చేశాడు. 1948లో వచ్చిన వింధ్యరాణి సినిమాతో ఆయన కెరీర్ విజయాల బాట పట్టింది. తర్వాత వచ్చిన కీలుగుర్రం, గుణసుందరి కథ, పాతాళ భైరవి, పెద్ద మనుషులు, మాయాబజార్, మిస్సమ్మ లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించడంతో ఆయన దాదాపు నాలుగు దశాబ్దాల పాటు 300కి పైగా చిత్రాల్లో నటించాడు.

రేలంగి తండ్రి అసలు పేరు రామస్వామి. ఒక పాఠశాలలో సంగీతం మాస్టారుగా పనిచేస్తూ హరికథలు, సంగీతం నేర్పించేవాడు. అందుకని ఈయన్ను దాసు అనీ, తర్వాత రామదాసు అని పిలవడం ప్రారంభించారు. తల్లి అచ్చయ్యమ్మ. వీరికి వెంకట్రామయ్య ఒక్కడే సంతానం. ఈమె రేలంగి మూడు సంవత్సరాల వయసులోనే మరణించింది. రామస్వామి భార్య చెల్లెలైన గౌరమ్మను వివాహం చేసుకున్నాడు.

రేలంగి కాకినాడలోని మెక్లారిన్ పాఠశాలలో చదువుకున్నాడు. రేలంగి రూపం చూసి తండ్రి అతన్ని పోలీసును చేయాలని ఆశపడ్డాడు. ఏమీ తెలియని వయసులో రేలంగి అందుకు సంబరపడినా నెమ్మదిగా అతని దృష్టి నాటకరంగం వైపు మళ్ళింది. దాంతో చదువు సజావుగా సాగలేదు. రామదాసు ఆర్థిక పరిస్థితి కుమారుడిని పై చదువులు చదివించే స్థోమత లేకపోయినా ఎం. ఎన్. ఎస్. ఛారిటీస్ సహాయంతో చదివించాలనుకున్నాడు. కానీ వాళ్ళు మార్కులు బాగా రావాలని షరతు విధించారు. కానీ రేలంగి మాత్రంచదువు కన్నా నాటకాల మీదనే ఎక్కువ ఆసక్తి కనబరచసాగాడు. తండ్రి కూడా తన కొడుకు బాగా చదువుకుని ఉద్యోగం చేసుకుని ప్రశాంతంగా జీవించాలని ఆశించినా కొడుకుకు నటనపై ఉన్న ఆసక్తిని చూసి ఏమీ అనలేక తటస్థంగా ఉండిపోయాడు. దాంతో ఆయన చదువు నాలుగో ఫారం (ప్రస్తుత తొమ్మిదో తరగతి) లో ఆగిపోయింది.

నాటక రంగం
ఒకసారి రామదాసు తన కొడుకు రేలంగిని ఎస్వీ రంగారావు, అంజలీదేవి తదితరులు సభ్యులుగా ఉన్న యంగ్‌మెన్ హ్యాపీ క్లబ్ వేస్తున్న రఘుదేవ రాజీయం అనే నాటకానికి తీసుకుని వెళ్ళాడు. అది రేలంగికి బాగా నచ్చింది. తాను కూడా నాటకాల్లో నటించాలనే కోరిక పుట్టింది. కానీ తండ్రికి చెబితే కాదంటాడేమోనని ఆయనకు తెలియకుండా నాటకాల్లో పాల్గొనడం మొదలుపెట్టాడు. యంగ్‌మెన్ హ్యాపీ క్లబ్ లో చేరి 1919లో తన పదవ ఏట బృహన్నల అనే నాటకంలో స్త్రీ పాత్రలో మొదటిసారి నటించాడు. ఈ విషయం తండ్రికి తెలిసి తీవ్రంగా మందలించాడు కానీ రేలంగిని మాత్రం నటనకు దూరం చేయలేకపోయాడు. తర్వాత కూడా అనేక నాటకాల్లో ఆడ పాత్రలు ధరించాడు. అప్పట్లో ఆడ వేషాలకు నటులు అంతగా ముందుకు వచ్చేవారు కాకపోవడంతో ఈయనకు విరివిగా అవకాశాలు వచ్చాయి.

ఆంధ్ర బాల గాన సంఘం, ఆంధ్ర సేవా సంఘం వారు ప్రమీలార్జునీయం, రామదాసు, రోషనార, మోహినీ భస్మాసుర, చింతామణి మొదలైన నాటకాల్లో ఈయనకు పాత్రలు ఇచ్చి ప్రోత్సహించారు. ప్రమీలార్జునీయంలో సుయోగుడు, చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి, చింతామణి తల్లి శ్రీహరి పాత్రలు, విప్రనారాయణ లో శ్రీనివాసుడు, శ్రీకృష్ణ తులాభారంలో వసంతకుడు, మిస్ ప్రేమ ఎం. ఎ అనే సాంఘిక నాటకంలో విషాదరావు అనే విలన్ పాత్ర లాంటి విభిన్నమైన పాత్రలు పోషించి ప్రశంసలు అందుకున్నాడు. దాంతో నటన మీద మంచి పట్టు ఏర్పడింది.

నాట్యమిత్ర మండలి
రేలంగి కొంతమంది మిత్రులతో కలిసి నాట్యమిత్ర మండలి అనే పేరుతో ఒక నాటక సంస్థను స్థాపించాడు. ఈ సమాజం వాళ్ళ తొలి నాటకం శ్రీరామనవమి పర్వదినాన తెనాలిలో ఏర్పాటు అయింది. ఈ నాటకం రక్తి కట్టింది కానీ నాటకం కోసం ఇంట్లో అమ్మ చీరలు దొంగతనం చేసుకుని వచ్చాడు. తిరిగి ఇంటికి వెళ్ళడానికి భయపడి ఎక్కడ నాటకాల్లో అవకాశాలు వస్తే అక్కడ నటిస్తూ ఊరూరా తిరగసాగాడు. ఉన్నప్పుడు తిండి, లేనప్పుడు పస్తులు ఇలా గడిచాయి ఆ రోజులు. అదే సమయంలో పారుపల్లి సుబ్బారావు, జొన్నవిత్తుల శేషగిరిరావు ఈయనకు తమ నాటక కంపెనీలో ఆశ్రయం కల్పించారు. ఈ కంపెనీలో హరిశ్చంద్ర, రంగూన్ రౌడీ మొదలైన నాటకాల్లో వేషాలు వేస్తూ దత్త మండలంలోని జిల్లాలు తిరిగాడు.

సినీ రంగ ప్రవేశం
రేలంగికి బాగా జ్ఞానం వచ్చేనాటికి థియేటర్లలో మూకీ చిత్రాలు ఆడుతుండేవి. అప్పటి దాకా నాటకరంగంలోనే అనుభవం ఉన్న రేలంగికి మనుషులు తెరమీద కనిపించడం ఆసక్తి కలిగించింది. 1931లో విడుదలయిన భక్త ప్రహ్లాద చిత్రం చూశాడు. తాను కూడా చలనచిత్రాలలో నటించాలని నిశ్చయించుకుని సినిమాలు ఎక్కడ నిర్మిస్తారో వారి చిరునామా తెలుసుకుని తనకు తెలిసీ తెలియని ఆంగ్ల భాషలో ఉత్తరాలు రాయడం మొదలుపెట్టాడు. కానీ వాటికేమీ ప్రత్యుత్తరాలు వచ్చేవి కావు. అప్పటికే టాకీ సినిమాల శకం మొదలైంది. రేలంగికి సినిమాల్లో ఎలాగైనా కనిపించాలనే కోరిక మరింత పెరిగింది.

పారుపల్లి సుబ్బారావు ట్రూపులో రేలంగికి పరదేశి అనే తబలా కళాకారుడితో పరిచయం ఏర్పడింది. అప్పటి దాకా ఒక లక్ష్యమంటూ లేకుండా లోకజ్ఞానం లేకుండా ఉన్న రేలంగికి పరదేశి రూపంలో ఒక మార్గనిర్దేశకుడు కనిపించాడు. తల్లిదండ్రులను వదిలి వచ్చేసి తాను తప్పు చేశాడని తెలుసుకుని, తిరిగి ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులను క్షమాపణ వేడుకుని, ఇకమీదట బుద్ధిగా వాళ్ళు చెప్పినట్టే నడుచుకుంటానని చెప్పాడు. వాళ్ళు పెళ్ళి చేస్తే అతని జీవితం గాడిలో పడుతుందని తాడేపల్లిగూడెం పక్కనే ఉన్న పెంటపాడుకు చెందిన బుచ్చియ్యమ్మనిచ్చి వివాహం జరిపించారు. ఆయన బావమరుదులు వ్యాపారంలో బాగా సంపాదించారు. అప్పటికి రేలంగి జీవితంలో స్థిరపడకపోయినా ఒక కళాకారుడిగా అతన్ని గౌరవించారు బావమరుదులు. భార్య తరపున ఎంత సంపద ఉన్నా స్వంతకాళ్ళ మీద నిలబడి ఆమెను బాగా చూసుకోవాలనుకున్నాడు. మళ్ళీ నాటకాలు వేయడం మొదలుపెట్టాడు. వచ్చిన కొద్దో గొప్పో డబ్బును భార్య చేతిలో పెట్టేవాడు. ఆమె కూడా నటీనటుల జీవితాలు ఎలా ఉంటాయో ఎరిగుండటం చేత సర్దుకుని పోగలిగింది.

తొలి అవకాశం

 

కొద్ది రోజులకు నాటకాల్లో అవకాశాలు కూడా సన్నగిల్లాయి. రేలంగికి మాత్రం నటనపై మోజు అంతకంతకు పెరుగుతూనే ఉంది. కొద్ది రోజులకి పరదేశికి కలకత్తాలో సి. పుల్లయ్య దర్శకత్వంలో రూపొందుతున్న లవకుశ సినిమాలో అవకాశం వచ్చింది. పరదేశితో పాటు తాను కూడా కలకత్తా వస్తానన్నాడు. కానీ ఆయన మాత్రం తాను అక్కడ కుదురుకున్న తర్వాత అతని కోసం అవకాశాలు వెతుకుతాననీ మాట ఇచ్చాడు. కానీ రేలంగి మనసంతా కలకత్తా మీదనే ఉంది. అప్పుడు కలకత్తాలో ఐ. రాజారావు అనే వ్యక్తి శ్రీకృష్ణ తులాభారం సినిమాగా తీయడానికి సన్నాహాలు పూర్తి చేశాడు. ఇందులో వసంతకుడి పాత్ర కోసం అప్పట్లో నాటకాల్లో సున్నిత హాస్యానికి పెట్టింది పేరైన ఘండికోట జోగినాథం ఎంపికై కలకత్తాకు ప్రయాణమవుతున్నాడు. ఆయనతో పాటు హార్మోనిస్టు దూసి శాస్త్రి, దర్శకుడు రాజారావు మొదలైన వారంతా బయలు దేరారు. ఆ సినిమాలో ముందుగా అవకాశమేమీ రాకపోయినా ఏదో ఒక పని చేయవచ్చులే అని రేలంగి కూడా ఇంట్లో వాళ్ళనూ, భార్యను ఒప్పించి వాళ్ళతో పాటు బయలుదేరాడు. కలకత్తా వెళ్ళగానే నిర్మాత దగ్గరకు వెళ్ళి ఆ సినిమాలో ఏదో ఒక వేషం ఇవ్వమని అడిగాడు. అప్పటికే ప్రధాన పాత్రలు నిర్ణయమైపోవడంతో రేలంగి కొద్ది సేపు మాత్రమే కనిపించే వసుదేవుడు, చాకలివాడు, గొల్లవాడు లాంటి మూడు పాత్రల్లో నటించాడు. ఈ సినిమాకి గాను రేలంగికి నాలుగు నెలలు బస, భోజనం పెట్టి డెబ్భై రూపాయలు పారితోషికం ఇచ్చారు. 1935లో నిర్మించిన ఈ చిత్రం రేలంగికే మొదటి చిత్రం కాదు. జోగినాథానికి, కాంచనమాలకీ, ఋష్యేంద్రమణికీ, కపిలవాయి రామనాథ శాస్త్రికీ, లక్ష్మీరాజ్యానికి మొదటి సినిమానే. కానీ ఈ సినిమా ఆర్థికంగా పరాజయం పొందడం వల్లా, రేలంగి ధరించిన పాత్రలు బొత్తిగా ప్రాధాన్యం లేకపోవడం వల్లా, సరైన గుర్తింపు దొరకలేదు. మరే చిత్రంలోనూ అవకాశం లభించలేదు. దాంతో చేతికందిన డబ్బు తీసుకుని కలకత్తా వదిలి మళ్ళీ కాకినాడకు వచ్చేసి మళ్ళీ నాటకాల్లో వేషాలు వేయడం ప్రారంభించాడు.

పుల్లయ్య పరిచయంతో
సి. పుల్లయ్య దగ్గర లవకుశ సినిమాకు పనిచేసిన, రేలంగికి ఆత్మీయుడు అయిన పరదేశికి మళ్ళీ ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న అనసూయ ధృవ విజయం అనే సినిమాలో అవకాశం వచ్చింది. ఎలాగైనా పరదేశి ద్వారా పుల్లయ్య దగ్గర అవకాశం సంపాదించాలనుకున్నాడు. దాంతో ఆయన రేలంగిని కూడా కలకత్తాకు తీసుకువెళ్ళి పుల్లయ్యకు పరిచయం చేశాడు. దాంతో రేలంగి ఒక్క వేషాలే కాకుండా సహాయకుడిగా, క్యాస్టింగ్ సహాయకుడిగా ఇలా సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని పనుల్లోనూ పాలుపంచుకున్నాడు. అనసూయ ధృవ విజయంలో రేలంగి ఇంద్రుడి వేషం వేశాడు. ఈ సినిమా తర్వాత రేలంగి పుల్లయ్య దగ్గరే పదిహేనేళ్ళ పాటు ప్రొడక్షన్ అసిస్టెంటుగా, సహాయ దర్శకుడిగా, క్యాస్టింగ్ అసిస్టెంటుగా, ప్రొడక్షను మేనేజరుగా గొల్లభామ (1947) చిత్రం వరకు పని చేశాడు. క్యాస్టింగ్ ఏజెంట్ కావడం వల్ల ఎంతోమంది నూతన నటీ నటులు ఈయన ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. వీరిలో కృష్ణవేణి, పుష్పవల్లి, భానుమతి, అంజలీ దేవి మొదలైన నటీమణులు ఉన్నారు. భానుమతి, అంజలీ దేవి నిర్మాతలుగా మారి సినిమాలు చేసినప్పుడు ఆయనకు కృతజ్ఞతగా మంచి వేషాలిచ్చారు. అదే సమయంలో వర విక్రయం, మాలతీమాధవం, మోహినీ భస్మాసుర, శ్రీ సత్యనారాయణ, బాలనాగమ్మ, గొల్లభామ మొదలైన సినిమాల్లో చిన్న పాత్రలు వేశాడు. వరవిక్రయంలో వీధిగాయకుడి పాత్రలో ఒక పాటను కూడా పాడాడు. బాలనాగమ్మ సినిమాలో తలారి రాముడు పాత్రలో నటించాడు. గొల్లభామ సినిమాలో రాజుగారి విదూషకుడిగా నటించాడు. బాలనాగమ్మ, గొల్లభామ చిత్రాలతో రేలంగికి కాస్త గుర్తింపు లభించింది.

విజయాల వైపు

గొల్లభామ (1947) దాకా పుల్లయ్య దగ్గర పనిచేసిన రేలంగి తర్వాత కుటుంబం కోసం మళ్ళీ కాకినాడ వెళ్ళిపోవలసి వచ్చింది. అక్కడే ఉంటే సంసారం ఎలా నెట్టుకురావాలో తెలియక సినిమాల్లోనే తాడో పేడో తేల్చుకుందామని కుటుంబ సమేతంగా మద్రాసు వచ్చేశాడు. కానీ అవకాశాలు మాత్రం పెద్దగా వచ్చేవి కావు. దాంతో కుటుంబం గడవడం కష్టంగా ఉండేది. తండ్రి అనారోగ్యం ఒక వైపు. భార్య మెటర్నటీ ఆసుపత్రిలో మరో వైపు. చేతిలో సరిపడా డబ్బులు ఉండేవి కావు. కొంతకాలం గడిచాక 1948లో వింధ్యరాణి అనే చిత్రంలో మంచి హాస్యపాత్ర లభించింది. పింగళి నాగేంద్రరావు రాసిన నాటకం ఆధారంగా వైజయంతీ ఫిలిమ్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు. డి. వి. సుబ్బారావు, పుష్పవల్లి నాయక, నాయికలుగా నటిస్తే రేలంగికి జంటగా జి. వరలక్ష్మి నటించింది. ఈ సినిమాకు గాను రేలంగికి మూడు వందల రూపాయల పారితోషికం లభించింది. దీంతో ఆర్థిక కష్టాలు కొద్దిగా తీరాయి. తర్వాత శోభనాచల ప్రొడక్షన్స్ వారు తీస్తున్న కీలుగుర్రం (1949) అనే సినిమాలో ప్రముఖ నటి కృష్ణవేణి సహకారంతో ఒక చిన్న వేషం సంపాదించగలిగాడు. రేలంగికి జోడీగా కనకం నటించింది. రేలంగి ఈ చిత్రంలో స్వయంగా ఓ పాట కూడా పాడాడు. ఈ సినిమాకు గాను మరో మూడు వందలు లభించాయి. ఈ డబ్బులుతో తన వ్యక్తిగత సమస్యలు తీర్చుకుంటూనే రంగూన్ రౌడీలో తనతో పాటు నటించిన పద్మనాభాన్ని తన సైకిల్ మీద తిప్పుతూ వింధ్యరాణి సినిమాలోనే అవకాశం ఇప్పించాడు. కీలుగుర్రం సినిమా శతదినోత్సవం జరుపుకుంది. ఈ చిత్రంలో రేలంగిది చిన్న పాత్రే అయినా ఈ చిత్ర నిర్మాత అయిన మీర్జాపురం రాజా నుండి వెండి కీలుగుర్రాన్ని జ్ఞాపికగా అందుకున్నాడు. ఈ రెండు సినిమాలతో రేలంగ్ కెరీర్ విజయపథం వైపు మళ్ళింది.

రేలంగి ప్రతిభను గుర్తించిన వారిలో కె.వి.రెడ్డి ఒకరు. ఆయన గుణసుందరి కథ (1949) సినిమాలో రేలంగికి మంచి పాత్రనిచ్చాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. దాంతో ఆయనకు మరిన్ని అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఆయన మనస్తత్వం దర్శక నిర్మాతలకు బాగా నచ్చింది. స్త్రీ సాహసము, పాతాళ భైరవి, పెద్దమనుషులు, షావుకారు, సంసారం, బ్రతుకుతెరువు, పక్కింటి అమ్మాయి మొదలైన చిత్రాలతో ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతులు లభించాయి.
తర్వాత దాదాపు ప్రతి సినిమాలో రేలంగి ఒక ప్రముఖ పాత్రలో కనిపించేవాడు. ముఖ్యముగా మిస్సమ్మ, మాయాబజార్, దొంగరాముడు, వెలుగునీడలు, విప్రనారాయణ, నర్తనశాల, అప్పు చేసి పప్పు కూడు మొదలయిన చిత్రాలలో వేసిన పాత్రలు కథానాయకుడితో సరిసమాన పేరు ప్రాముఖ్యతలను తెచ్చిపెట్టాయి.

రేలంగి పోషించిన కొన్ని పాత్రలు ఏ తరానికైనా అలరిస్తాయి..అలాంటి వాటిలో …నర్తనశాలలో – ఉత్తరకుమారుడు, మాయాబజార్లో – లక్ష్మణకుమారుడు, హరిశ్చంద్రలో – నక్షత్రకుడు, లవకుశలో – రజకుడు, జయభేరిలో – లచ్చన్న బంగారయ్య, జగదేకవీరుని కథలో – రెండు చిడతలు, సువర్ణ సుందరిలో – కైలాసం, ప్రేమించి చూడు లో – బుచ్చబ్బాయ్, వెలుగునీడలులో – వెంగళప్ప, అప్పుచేసి పప్పుకూడులో – భజగోవిందం, మిస్సమ్మలో – దేవయ్య ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నెన్నో..

రేలంగి సరసన సూర్యకాంతం, గిరిజ ఎక్కువ నటించారు. రేలంగి నటుడిగా మాత్రమే కాకుండా కొన్ని చిత్రాలలో పాటలు కూడా పాడేవాడు. ఆయన పాడిన వినవే బాల నా ప్రేమ గోల, కాణీ ధర్మం సెయ్ బాబూ, సరదా సరదా సిగరెట్టు వంటి పాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. నిర్మాతగా రేలంగి సామ్రాజ్యం అనే చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రం హాస్యనటుడు రాజబాబుకు మొదటి చిత్రం.

రేలంగి తనకు పేరు, డబ్బు వచ్చిన తర్వాత తోటి హాస్యనటులకు అవకాశం కల్పించడం కోసం తన చిత్రాలను బాగా తగ్గించుకున్నాడు. ఇలా అవకాశం దక్కించుకున్న వారిలో చలం, పద్మనాభం మొదలైన వారున్నారు. అంతే కాకుండా ఉత్తమ హాస్యనటుడికిచ్చే పురస్కారాల పోటీల నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నాడు. వృద్ధాప్యం మీద పడినా, కీళ్ళ నొప్పులతో బాధ పడుతున్నా పారితోషికం గురించి పట్టింపు లేకుండా కాలక్షేపం కోసం చిన్న చితకా వేషాలు వేస్తూనే ఉండేవాడు.

కుటుంబ విశేషాలు

రేలంగి సతీమణి పేరు బుచ్చియమ్మ. ఈమె పెంటపాడుకు చెందిన చేబోలు వీరాస్వామి కుమార్తె. ఈమె అన్నదమ్ములు పెద్దగా చదువు లేకపోయిన తమ కులవృత్తి అయిన అబ్కారీ వ్యాపారంలో బాగా సంపాదించారు. తమ చెల్లెలికి వెంకట్రామయ్య తగిన జోడీ అని భావించారు. 1933 డిసెంబరు 8 వ తేదీన వీరి వివాహం వధువు స్వగృహంలో జరిగింది. పెళ్ళి సమయానికి బుచ్చియమ్మ రేలంగి కన్నా పదిహేనేళ్ళు చిన్నది. వీరి కుమారుడు సత్యనారాయణ బాబు. సినిమాల్లో తీరిక లేకుండా నటిస్తున్నప్పుడు ఇంటి వ్యవహారాలన్నీ భార్య బుచ్చియ్యమ్మే చూసుకునేది. రేలంగి తన సంపాదన మొత్తం ఆమె చేతిలో పెట్టి తన అవసరాలకు, దాన ధర్మాలకు వరకు ఆమె నుంచి తీసుకునే వాడు. భార్యా భర్తలిద్దరూ దైవ భక్తి కలవారు కావడంతో ఖాళీ దొరికినపుడు కుటుంబంతో సహా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి వచ్చేవారు. కొడుక్కి పెళ్ళీడు వచ్చేసరికి రేలంగి మంచి స్థితిమంతుడు. ఎంతోమంది తమ ఆడపిల్లలని ఇవ్వడానికి ముందుకు వచ్చారు. కానీ ఆయన మాత్రం తనకు పూటకు ఠికాణా లేని రోజుల్లో కూడా గౌరవించి పిల్లనిచ్చిన తమ బావమరిది కూతుర్నిచ్చి వివాహం జరిపించాడు.
బుచ్చియమ్మ భర్త మరణానంతరం దాదాపు మూడు దశాబ్దాల పాటు జీవించింది. తాడేపల్లి గూడెంలో రేలంగి కట్టించిన విశాలమైన ఇంటిని కొడుకు అమ్మేసే దాకా ఆమె అక్కడే జీవించింది. ఒక్క థియేటరు తప్ప భర్త సంపాదించిన అపారమైన సంపద అంతా ఆమె కళ్ళ ముందే కరిగిపోయింది. చివరి దశలో రేలంగి చిత్రమందిర్ వెనుకల ఉన్న అతిథి గృహంలో నివసించేవారు. ఈమె 2004లో మరణించింది.

విశిష్టత
రేలంగి ఎన్నో కళాశాలలకు విరాళాలు ఇచ్చేవాడు. ఎందరికో వివాహాలకు సహాయం చేసేవాడు. రేలంగి ఇంట నిత్యం అన్నదానములు జరిగేవి. రేలంగి పుట్టింది రావులపాడు, పెరిగింది కాకినాడలో అయినా తాడేపల్లి గూడెంతో ప్రత్యేకమైన అభిమానం ఉండేది. అందుకు కారణం ఆ ఊరి ప్రజలు ఆయనపై చూపిన అభిమానం. వారికోసం ఏమైనా చేయాలనుకున్నాడు. ఊరి ప్రజలకు సినిమాలపై ఆసక్తి మెండు. ఆయన పెద్ద నటుడైన తర్వాత తన సినిమా విడుదలైతే మొదటి రోజునే చూడాలని ఉబలాట పడేవాళ్ళు. అందుకని అక్కడే అత్యాధునిక సదుపాయాలతో సినిమా థియేటర్ నిర్మించాలనుకున్నాడు. అనేక వ్యయప్రయాసలతో కూడుకున్న ఈ పనికి పూనుకున్న రేలంగిని కొంతమంది శ్రేయోభిలాషులు వారించారు. కానీ రేలంగి మాత్రం వారి మాటలు లెక్క చేయలేదు. అలా రేలంగి చిత్ర మందిర్ నిర్మాణం ప్రారంభమైంది. తాను చిత్రీకరణల్లో విరామం లేకుండా ఉండటంతో తన కుమారుడికి ఈ బాధ్యత అప్పజెప్పాడు. ఈ పని కోసం ఆయన మద్రాసు నుంచి కుటుంబంతో సహా తాడేపల్లిగూడెం కి వచ్చి స్థిరపడ్డాడు. నిర్మాణానికి అనుకున్నదానికంటే ఖర్చు చాలా ఎక్కువైంది. చివరికి 1962 లో ఈ థియేటర్ నిర్మాణం పూర్తయింది. దీని ప్రారంభోత్సవానికి ఎస్. వి. రంగారావు, జమున, కాంతారావు, జె. వి. రమణమూర్తి లాంటి ప్రముఖులందరూ విచ్చేశారు.

సన్మానాలు, పురస్కారాలు
రేలంగి నటుడిగా తారా స్థాయికి చేరగానే ఆయనకు సన్మానాలు, బిరుదులు, కనకాభిషేకాలు, గజారోహణలు మొదలైనవెన్నో జరిగాయి. 1955 లో హైదరాబాదులో ఆంధ్ర నాటక కళాపరిషత్తు వాళ్ళు ఆయనకు ఘన సన్మానం చేశారు. ఈ సన్మాన కర్త ప్రముఖ రంగస్థల నటుడు స్థానం నరసింహారావు. 1956లో రేలంగికి రాజమండ్రిలో లలిత కళానికేతన్ వారిచే మరో ఘన సన్మానం జరిగింది. ఈ సభలో హాస్యబ్రహ్మగా పేరు గాంచిన భమిడిపాటి కామేశ్వరరావు రేలంగికి హాస్య నటచక్రవర్తి అనే బిరుదును ప్రదానం చేశాడు. ఈ సభలో ఆయనకు సువర్ణ కంకణాలు, దండం బహుకరించారు. 1959 మే 14 న తెలుగు ఫిల్మ్ జర్నలిస్టులు మద్రాసు వాణీ మహల్ లో రేలంగిని గజారోహణం చేయించి ఘనసన్మానం జరిపారు. ఆ మరుసటి రోజునే మద్రాసు విజయా గార్డెన్స్ లో తోటి నటీనటులందరూ కలిసి సన్మానం చేశారు. ఈ సన్మానానికి ప్రముఖ తెలుగు, తమిళ భాషల నటులందరూ హాజరయ్యారు. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యుడిగా నియమింపబడ్డాడు. ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడెమీ వారు ఫెలోషిప్ ఇచ్చి గౌరవించారు. బండారులంక, రాజమండ్రి, కొవ్వూరు మొదలైన ఊళ్ళలో రేలంగికి కనకాభిషేకాలు జరిగాయి. 1967 లో ఏలూరు పట్టణంలోని ప్రభాత్, శ్యామల థియేటర్ల సంయుక్త ఆధ్వర్యంలో రేలంగికి ఘన సన్మానం జరిగింది. 1970లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రధానం చేసింది.

చివరి దశలో రేలంగి తీవ్రమైన నడుమునొప్పితో బాధపడ్డాడు. వైద్యులు ఇది ఎముకలకు సంబంధించిన వ్యాధిగా తేల్చారు. ఈ సమయంలో ఆయనకు రేలంగి సతీమణి బుచ్చియమ్మ అక్క కూతురైన రాజేశ్వరి ఆయనకు దగ్గరుండి సేవలు చేసింది. 1975 నవంబరు 27 ఉదయం తాడేపల్లి గూడెంలోని తన స్వగృహంలో మరణించాడు.