వేణువై వచ్చాను భువనానికి...

తెలుగు సినీపాటల తోటమాలి
– మే22 వేటూరి వర్థంతి

Veturiవేటూరిగా తెలుగు సంగీత ప్రియుల హృదయాల్లో చెరగని ముద్రవేసిన వేటూరి సుందరరామ్మూర్తి సుప్రసిద్ధ తెలుగు సినీ గీత రచయిత. వేటూరి దైతా గోపాలం ఆ తర్వాత మల్లాది వద్ద శిష్యరికం చేశారు. తొలినాళ్ళలో పాత్రికేయునిగా పనిచేసిన వేటూరి కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఓ సీత కథ ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. తర్వాత కొన్ని వేల పాటలను రాశారు. వేటూరి సుందరరామ్మూర్తి 8 నంది అవార్డులతో పాటు మొత్తం 14 అవార్డులు, ఒక జాతీయ పురస్కారం అందుకున్నారు. తెలుగు పాటకు శ్రీశ్రీ తర్వాత జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టింది వేటూరియే.

వేటూరి సుందరరామ్మూర్తి 1936 న జనవరి 29 న కృష్ణా జిల్లా, మోపిదేవి మండలం పెదకళ్ళేపల్లిలో జన్మించాడు. మద్రాసులోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్మీడియట్, బెజవాడలో డిగ్రీ పూర్తిచేశారు. ఆంధ్రప్రభ పత్రికలో ఉపసంపాదకుడిగా పనిచేశారు. 1956 నుంచి పదహారేళ్ళపాటు పాత్రికేయ వృత్తిలో ఉన్నారు.

సినీ ప్రస్థానం
కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఓ సీత కథ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన వేటూరి, సంగీత జ్ఞానాన్నీ పదరచనల బాణీల్నీ స్పష్టంగా వంటబట్టించుకొని ఆ బాణీలతో సినిమాపాటకు వోణీలు వేయించారు. సాంప్రదాయ కీర్తనల్లోని పల్లవుల్ని, పురాణసాహిత్యంలోని పంక్తుల్నీ గ్రహించి అందమైన పాటల్ని అలవోకగా రచించడంలో ఆయన అసాధ్యుడు. వేటూరి అనగానే వెంటనే స్ఫురించేది అడవి రాముడు, శంకరాభరణం. ఇంకా సిరిసిరిమువ్వ, సాగరసంగమం, సప్తపది, సీతాకోకచిలుక, ముద్దమందారం, సితార, అన్వేషణ, స్వాతిముత్యం… ఇలా ఎన్నో సినిమాలు…ఈ సినిమాలలోని అందమయిన అద్బుతమయిన పాటలు!

“పిల్లనగ్రోవికి నిలువెల్లగాయాలు అల్లన మ్రోవిని తాకితే గేయాలు” “నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడిబొమ్మా ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ” ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు స్పందించు నవనాడులే వీణాగానాలు కదులు ఎదలోని సడులే మృదంగాలు ఇలాంటి అపురూప పదవిన్యాసాలు ఆయన పాటల్లో అడుగడుగునా కనిపిస్తాయి.

వేటూరి చాలా రకాల పాటలను రాసారు. సంప్రదాయ కవిత్వం దగ్గర నుండి జానపద గీతాల వరకు అన్నింటిలోనూ తన ప్రతిభను నిరూపించుకున్నారు. పండితుల నుండి పామరుల వరకు అందరిని అలరించిన విశిష్ట శైలి ఈయన సొంతం. శ్రీశ్రీ తర్వాత తెలుగు సినిమా పాటకి జాతీయ ఉత్తమ సినిమా పాటల రచయిత పురస్కారాన్ని అందించారు. ఆయన మాతృదేవోభవ సినిమాకి రాసిన రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే… అనే పాటకి 1994వ సంవత్సరానికి గాను ఈ పురస్కారం వచ్చింది. ఇది తెలుగు పాటకు రెండవ జాతీయ పురస్కారం. అయితే కేంద్ర ప్రభుత్వం తెలుగు భాషకు ప్రాచీన భాషా హోదా ఇవ్వనందుకు నిరసనగా తన పాటకు వచ్చిన జాతీయ పురస్కారాన్ని తిరిగి ఇచ్చి వేసిన మాతృ భాషాభిమానం ఈయన వ్యక్తిత్వ శైలికి ఒక మచ్చు తునక. కళాతపస్వి కె.విశ్వనాథ్, కె.వి.మహదేవన్ మరియు ఇళయరాజాలతో వేటూరి అద్భుతమైన గీతాలను అందించారు. తను రాసిన పాటలలో తాను గొప్పగా భావించే పాటలు సాగర సంగమంలో తకిట తదిమి తకిట తదిమి తందాన, నాదవినోదము….ఇలాంటివి ఎన్నెన్నో

పుస్తకాలు, ప్రచురణలు
వేటూరి రేడియో కోసం రాసిన సంగీత నాటిక “సిరికాకొలను చిన్నది”. రాయల నాటి తెలుగు సంస్కృతిని, ప్రజా జీవన సరళిని ప్రతిబింభించే కథ. కథా స్థలం కృష్ణా నదీ తీరాన ఆంధ్ర విష్ణు క్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన శ్రీకాకుళం.

కొమ్మ కొమ్మకో సన్నాయీ పేరుతో మరోరచన, ఉత్తమ సాహితీ సుగందాలు గుబాళించే అజరామర సినీ గీతాలను తెలుగు కళామతల్లి చరణ సుమాలుగా అర్పించి అర్చిస్తున్నసారస్వత మూర్తి నవనవోన్మేష విశిష్ట రచనా స్ఫూర్తి వేటూరి కలం నుండి పల్లవించిన ఎందఱో సినీ మహనీయుల ప్రస్తుతి వ్యాసాలే ఈ కొమ్మ కొమ్మకో సన్నాయీ.

పురస్కారాలు
1977లో నంది పురస్కారం(మానస వీణా మధుగీతం..పంతులమ్మ సినిమా)
1979లో నంది పురస్కారం (శంకరా నాదశరీరాపరా శంకరాభరణం)
1984లో నంది పురస్కారం (బృందావని ఉంది కాంచనగంగ)
1985లో నంది పురస్కారం (ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో…ప్రతిఘటన)
1991లో నంది పురస్కారం (పావురానికి పంజరానికి పెళ్లిచేసే పాడు లోకం…చంటి )
1992లో నంది పురస్కారం, మనస్విని పురస్కారాలు (ఆకాశాన సూర్యుడండడు సంధ్యవేళకి…సుందరకాండ)
1994లో భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు (రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే…మాతృదేవోభవ)
(కేంద్ర ప్రభుత్వం తెలుగు భాషకు ప్రాచీన భాషా హోదా ఇవ్వనందుకు నిరసనగా ఈ అవార్డ్ వెనక్కి ఇచ్చేందుకు సిద్ధపడ్డారు)

1994లో మనస్విని పురస్కారాలు (వేణువై వచ్చాను భువనానికి…మాతృదేవోభవ)
1993లో నంది పురస్కారం (ఓడను జరిపే… రాజేశ్వరికల్యాణం)
2000 నంది పురస్కారం, ఫిల్మ్ ఫేర్ )ఉప్పొంగెలే గోదావరి ….గోదావరి)

మూడు దశాబ్దాల కెరిర్‌లో ఎనిమిది నందులు వేటూరికి దక్కాయి.
1974 నుంచి 2011 వరకూ వేలాది సినీగీతాలు రాసి రసజ్ఞుల మన్నలు అందుకున్నారు

పాటల ప్రపంచ్గంలో వెలుగులు అందించిన వేటూరి 75 సంవత్సరాల వయస్సులో మే 22, 2010 న హైదరాబాదులో గుండెపోటుతో అస్తమించారు

Send a Comment

Your email address will not be published.