శారీరక శ్రమ లేకుంటే గుండెపోటు...

ప్రస్తుత జీవన విధానంలో శారీరక శ్రమ రానురానూ తగ్గిపోతోంది. యాంత్రిక జీవితంలో డబ్బు సంపాదనపై ఉన్నంత ధ్యాస ఆరోగ్యంపై ఉండటం లేదు. ఏదైనా రోగం వచ్చేంత వరకు అలా ఉండిపోయి వచ్చిన తర్వాత ఆలోచించడం పరిపాటిగా మారింది. వ్యాయామాలు చేయడం మంచిదని తెలిసినా తీరికలేకో, బద్ధకం వల్లో చాలా మంది ఒళ్లు వంచడానికి దూరంగా ఉంటున్నారు. ఫలితంగా లేని పోని రోగాలతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంటారు.

సరైన వ్యాయామం లేకపోవడం వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలే కాదు గుండెపోటు వంటి ప్రమాదకరమైన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఆరు సంవత్సరాల కంటే ఎక్కువ రోజులు వ్యాయామం చేయని వారికి గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శారీరక శ్రమ చేసేవారిలో గుండెపోటు వచ్చే అవకాశం తక్కువంటున్నారు.

మధ్య వయస్కులు వారానికి కనీసం 150 నిమిషాలన్నా శరీరానికి తగినంత పని చెప్పాల్సిందే. నడక, పరుగు, సైకిల్‌ తొక్కడం లాంటివి చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవంటున్నారు నిపుణులు. మధ్య వయస్కులు ఎవరైతే ఆరు సంవత్సరాలు శారీరక శ్రమ చేస్తారో వారికి గుండెపోటు వచ్చే అవకాశం 23 శాతం తక్కువగా ఉంటుందని జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్త చియాడీ న్యుమేలే వివరిస్తున్నారు.