శివుడికి ప్రియమైన పువ్వులు

ఒకరోజు శౌనకాది మహామునులందరూ కలిసి సనత్కుమారుడికి నమస్కరించి శివుడికి ఇష్టమైన పువ్వులు యేవో చెప్పమని అడుగుతారు.

అంతట సనత్కుమారుడు ఇలా చెప్పాడు –

“తపోనిధులారా! వినండి. నిత్యాగ్నిహోత్రుడైన ఓ సద్బ్రాహమణుడికి స్వర్ణం, వెండి గొరిజలు, వస్త్రాలతో అలంకరించిన ఓ మంచి పాడి ఆవును ఇస్తే ఎంత పుణ్యమో అలాగే శివుడిని పూజించడానికి కూడా అతనికి ఇష్టమైన పువ్వులు కొన్ని ఉన్నాయి. తెల్ల గన్నేరు పువ్వులతో శివుడిని పూజించే పద్ధతి ఉంది. అలాగే యెర్ర గన్నేరు పువ్వులతో కూడా పూజిస్తే రెట్టింపు ఫలితం ఉంటుంది. జాజిపువ్వులతో పూజిస్తే వందరెట్ల పుణ్యం కలుగుతుంది. నవమల్లిక పువ్వులతో పూజిస్తే రెండు వందల రెట్ల ఫలం ఉంటుంది. తుమ్మి పూలతో పూజిస్తే ఎంత ఫలం దక్కుతుందో వేరేగా చెప్పక్కర లేదు. స్వర్ణ లింగాన్ని సువర్ణ ప్రసూనాలతో పూజిస్తే వచ్చే ఫలం చంపక పువ్వులతో పూజిస్తే లభిస్తుంది. అలాగే నాగమల్లి, బొడ్డుమల్లెలు, తులసిదళం, ఉమ్మెత్త పూలు, పద్మాలతో కూడా శివుడిని పూజించవచ్చు. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఇన్ని రకాల పువ్వులు శివుడికి ప్రియమైనవే అయినా మొగలిపువ్వులతో గానీ శివుడిని పూజిస్తే అప్పటి వరకు పొందిన ఫలితాలన్నీ నశిస్తాయి. అంతేకాదు కష్టాలు కూడా పడతారు. మొగలి పువ్వుతో పూజించకుండా శివుడు శపించినట్టు స్కంద పురాణంలో వివరంగా చెప్పబడింది. శివుడిని బిల్వదళంతో పూజిస్తే అనంతఫలితం దక్కుతుంది” అని సనత్కుమారుడు చెప్పగా మహామునులు ధన్యవాదాలు తెలిపి తమకు లభించిన పువ్వులతో శివుడిని ఆరాధించారు.
—————————–
సిరిచందన