శివ! శివా!

శివ! శివా!

ఉత్పలమాల:
భక్తుడు శంభుడన్న అవిభక్తసరాగము చూపు శంకరా
ముక్తినొసంగు వాడవని ముచ్చటతీరగ నిన్ను కొల్చెదన్
భక్తిగ నిన్ దలంతును శుభంబుల నీయర! నిన్ను గూర్చి నే
రక్తిగ పాడనెంచెద సులక్షణ గీతుల నీదు గానముల్

ఉత్పలమాల:
అగ్గిరిజాసతిన్ తనువు నందున దాల్చిన శంకరుండు మా
దగ్గర బ్రహ్మ విష్ణులను దాపుగ నీ శివరాత్రి గూర్చి యా
ముగ్గురు నొక్క రూపనుచు మోదమొసంగెను కాని శక్తి నీ
ముగ్గురు దేవులందు ఘన మూర్తివి నీవెగదా సదాశివా

ఉత్పలమాల:
కంఠమునన్ హలాహలము కాయమునిండుగ బూదిదాల్చి యు
త్కంఠనురేపురూపమును కాలభుజంగములన్ ధరించి యా
డుంఠి గణేశుముద్దుడిచు డోగిలు శంకర శీర్ష చంద్రుడున్
లుంఠిత దృక్కులన్ కనగ లోలతనొందు నుమేశు గొల్చెదన్

ఉత్పలమాల:
ఇచ్చెడి వాడవీవనుచు నేలెడి వాడవు నీవు గాన నిన్
ముచ్చటగా భజించెదను మోదము తోడను కాని కేశవా
నిచ్చలు నాదు కోర్కెల గణింపగ నిన్ను తలంచుటొప్పునే
యచ్చెరువొంద మైమరచి యాత్మ గనుంగొన నానతీయరా!!

చంపకమాల:
కలమును చేతబట్టి యిల కావ్యమువ్రాయ దలంచునంత స/
త్ఫలములనిచ్చు శంభుడు భవాండము నీది యనంగ నా మదిన్/
జలధితరంగ నాట్యములు జావళి పాడగ జాను తెన్గులో/
పలుకుల రాణి మోదమిడి భాషకు సేవలొసంగుమా యనెన్ !!

—మల్లికేశ్వర రావు కొంచాడ