శ్రీ కృష్ణ దేవరాయలు

పదిహేడు ఒకటి పదునాలుగు
వందల నలుబదిఒకటిన ,
కర్నాటక హంపిలోన తుళువ
నరసనాయక ,నాగలాంబల
అనుంగు తనయుడై జన్మించినరాయలు ॥ శ్రీ కృష్ణ దేవరాయాలు. ॥

విద్యా వినయ సర్వ సద్గుణ సంపన్నుడై ,తుళు
వంశ తేజమై విరాజిల్లి
పదిహేను వందల తొమ్మిది నుండి
పదిహేను వందల ఇరువది తొమ్మిదవ వత్సరము దనుక
విజయనగర సామ్రాజ్యమేలిన
ఆంద్ర భోజ బిరుదాంకితుడు
శ్రీ కృష్ణ దేవరాయ భూపాలుడు॥ రాయలు ,రాయలు,॥

ఉదార స్వభావ దయాదాక్షిణ్య పూరిత ,
సుందరవదనం ,ధీర, వీర,స్థైర్య రాజసం ,
రాయల పిలుపున “అప్పాజీ”గ ఖ్యాతి గాంచిన
“మహామంత్రి తిమ్మరుసు ” నేతృత్వమున
జైత్ర యాత్రా
విజయ పరంపరల డంకామ్రొగించి
“రాజాధి రాజ రాజ మార్తాండ కృష్ణరాయ”బిరుదు నందిన
వీర భూపాలుడు రాయలు ॥ రాయలు,రాయలు॥

అక్బర్,మహమ్మదుల,మించి
క్షణ క్షణ రణ రంగ వ్యూహ రచనా మార్పిడుల
నిపుణతను,
మెరుపువోలె పరాక్రమించిన విక్రమశాలి,
వైరి భయంకర హారి శ్రీ కృష్ణ దేవరాయలు,
దక్కను సుల్తానుల పక్కలో బల్లెమై
దక్కను తదితర దిగ్విజయ విజేతగా,సామ్రాజ్య స్తాపన
జేసిన రాయలు,॥ శ్రీ కృష్ణ దేవరాయలు ॥

వీణాగాన మాధురి తిరుమలదేవి,
నాట్య కళావిశారద చిన్నాదేవిలు దేవేరులు గా
ప్రణయ సీమ నేలిన శృంగార రాయలు,
శ్రీ కృష్ణ దేవరాయలు,
మృదు మధుర కావ్యము
“ఆముక్తమాల్యద” విరచిత కావ్యప్రియుడు,
అలసాని పెద్దన ,నంది తిమ్మన,
ధూర్జటి, వికటకవి తెనాలి రామకృష్ణ ,ఆది గాగల
“అష్ట దిగ్గజ” నామ విఖ్యాత ఆంద్ర కవి కోవిద,
తమిళ కన్నడ అన్య భాషా సాహిత్య వేత్తల
సాదర సంమానిత “భువనవిజయ”నామధేయ
సభాప్రాంగణ నిర్మాత,
రాయలు,॥ శ్రీకృష్ణ దేవరాయలు,॥

రాయలు రాజ్య నగరు
రామును మించినది గా తోచెనని,
నవరత్నములు విపణి వీధుల
రాసులుగా పోసి విక్ర యించెడి వారని
రాయలు రాజ్య పాలనమొక
స్వర్ణ యుగమని,పోర్చుగల యాత్రికుడు
డోమింగో పేయస్ ” ,పడి పడి కీర్తించే,॥ రాయలు,రాయలు॥

విసిష్ట న్యాయనిర్ణేతగా,
దేశ విదేశ అతిధి అభ్యాగతుల నాదరించి
సన్మానించు ప్రతాపశాలిగ,
బహు ముఖ ప్రజ్ఞ్యా శాలిగ ,
“డోమింగో పేయస్”,”ఫెర్నాడ్ న్యూనిజ్ ”
లచే ప్రసంశ లందిన శ్రీ కృష్ణ దేవరాయలు,॥ రాయలు,రాయలు.॥

“మూరు రాయ గండర గండ ”
“కన్నడరాజ్య రమారమణ “మల్లరాయ
బిరుదుల వీర విహార సమాహారము
విజయనగర సామ్రాజ్యలక్ష్మి
గలము నలంకరించిన రాయలు,
“దేశ భాష లందు తెలుగు లెస్స “యని
“ఆంద్ర జనని”కి కీర్తి మకుటముంచి
దేశభక్తిని చాటిన శ్రీ కృష్ణదేవ రాయలు,॥ రాయలు,రాయలు,

కొనగోట మీటినా సప్తస్వరములు పలుకు,
స్తంభముల ఆలయము,
“విరూపాక్ష” ” విట్టల ఆంద్ర మహా విష్ణు”
ఆలయ నిర్మాణ కర్తగా,
మాతృదేవి నామధేయాన “నాగలాపురమును”
నిర్మించిమాత్రు భక్తిని చాటి రాయలుకీర్తి పతాక,
ఆచంద్రార్కం గగన వీధుల విహరుంచు గాక..
————————————–

కామేశ్వరి సాంబమూర్తి భమిడిపాటి