సందిగ్ధం

క్షణాల అలలు అలసట లేకుండా
వస్తూ ఉన్నాయ్ వెళ్తూ ఉన్నాయ్
ప్రతి క్షణం ఒక ప్రవహ్లిక
ప్రతి క్షణం ఒక మర్మకావ్యం

నేను కాలంలో పయనిస్తున్నానా..?
నాలో కాలం ప్రవహిస్తోందా..??
రెండూనా..??

కాలం నదిలో నా ఈత
ప్రవాహంతో పాటా, ఎదురా..??
రెండూనా..??

అక్షరాల్లో ఆలోచనల్ని వెదుకుతున్నానా?
ఆలోచనల్ని అక్షరాలుగా మారుస్తున్నానా?
రెండూనా..??

బ్రతుకుపాటకు స్వరాలు కూర్చానా..??
జీవనరాగానికి మాటలు చేర్చానా..??
రెండూనా..?

నేనొక కంటిచెమ్మలో ప్రతిబింబాన్నా..??
ఒక ప్రతిబింబపు కంటిచెమ్మనా..??
రెండూనా..??

ప్రతి క్షణం ఒక ప్రవహ్లిక
ప్రతి క్షణం ఒక మర్మకావ్యం

–రమాకాంత్ రెడ్డి