సకల విజయాలకు శుభారంభం

సకల విజయాలకు శుభారంభం

శ్రవణ నక్షత్రంతో కలిసిన ఆశ్వయుజ దశమికి విజయ అనే సంకేతముంది. అందుకే దసరా సమయంలో ఈ నెల15న వచ్చే దశమికి విజయదశమి అనే పేరు వచ్చింది. తిథి, వారం, తారాబలం, గ్రహబలం, ముహూర్తం మొదలైనవి చూడకూండా దసరా పండగ రోజు చేపట్టిన ఏ పనిలోనైనా విజయం తథ్యం. విజయదశమి వచ్చిందంటే దేశమంతా ఒకటే కోలాహలం. ఎందుకంటే దేశంలో విభిన్న ప్రజలు ఉన్నప్పటికీ దసరాను అందరూ కలిసి జరుపుకుంటారు. ఈ రోజు ఏ పని ప్రారంభించిన విజయ చేకూరుతుందని విశ్వసిస్తారు.

ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలోని మొదటి తొమ్మిది రోజులు శరన్నవరాత్రుల పేరుతో రోజుకో రూపంలో అమ్మవారిని ఆరాధిస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో చివరి మూడురోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. దేవదానవులు పాలసముద్రాన్ని మధించినప్పుడు విజయదశమి రోజునే అమృతం ఉద్భవించిందని ఇతిహాసాల్లో పేర్కొన్నారు. ‘శ్రవణా’ నక్షత్రంతో కలసిన ఆశ్వయుజ దశమికి ‘విజయ’ అనే సంకేతముంది. అందుకే దీనికి‘విజయదశమి’అనే పేరు వచ్చింది. తిథి, వారం, తారాబలం, గ్రహబలం, ముహూర్తం మొదలైనవి చూడకుండా విజయదశమి రోజు చేపట్టిన ఏ పనిలోనైనా విజయం తథ్యం. ‘చతుర్వర్గ చింతామణి’గ్రంథంలో ఆశ్వయుజ శుక్ల దశమి నాటి నక్షత్రోదయ వేళనే ‘విజయం’ అని తెలిపింది. ఈ పవిత్ర సమయం సకల వాంచితార్ధ సాధకమైందని గురువాక్యం.

చెడు మీద మంచిని సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. మనిషి తనలోని కామ, క్రోద, మధ, మత్సర, మోహ, లోభ, స్వార్ధ, అన్యాయ, అమానవత, అహంకార అనే పది దుర్గుణాలను ఈ నవరాత్రులలో అమ్మ వారి శరణుజొచ్చి తమలో ఉన్న దుర్గుణాలను తొలగించు కునుటకు ఆధ్యాత్మికంగా ఉత్తమైన మార్గం ఈ శరన్నవరాత్రులు. దీనిని పది రోజులపాటు జరుపుకుంటారు.

‘శమీపూజ’ దశమి రోజు మరింత ముఖ్యమైంది. శమీవృక్షమంటే ‘జమ్మిచెట్టు’.పాండవులు అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను శమీవృక్షంపైనే దాచిపెట్టారు. ఈ సమయంలో విరాటరాజు కొలువులో ఉన్న పాండవులు.. ఏడాది షరతు పూర్తికాగానే ఆ వృక్షాన్ని ప్రార్ధించి, తిరిగి ఆయుధాలను పొంది, శమీవృక్ష రూపంలోని ‘అపరాజితా దేవి’ ఆశీస్సులు పొంది, కౌరవులపై విజయం సాధించినారు.

రాముడు విజయదశమి నాడే అపరాజితా దేవిని పూజించి, రావణుని సహరించాడు. తెలంగాణలో శమీపూజ అనంతరం ‘పాలపిట్ట’ను చూసే సంప్రదాయం ఉంది. విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శనం అనంతరం శమీవృక్షం వద్ద అపరాజితాదేవిని పూజించి, ‘శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ, అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ’ అనే ఈ శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షిణలు చేస్తారు. ఈ శ్లోకం రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయడం వల్ల అమ్మవారి కృప, శనిదోష నివారణ జరుగుతుందని ప్రతీతి.

దుర్గాదేవి మహిషాసురుడితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతడిని వధించింది. ఈ సందర్భంగా పదో రోజు ప్రజలంతా సంతోషంతో పండగ జరుపుకున్నారు. అదే విజయదశమి. దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశంలో అధికంగా ఉంటుంది. దేనదానవులు పాల సముద్రం మధించినప్పుడు అమృతం జనించిన శుభముహూర్తాన్నే ‘విజయదశమి’గా పేర్కొన్నారు.

ఈ దసరా పండుగకు నీలి రంగులో మెరుస్తూ కనిపించే పాలపిట్టకూ సంబంధం ఉంది. నవరాత్రులు పూర్తయ్యాక… విజయ దశమి రోజున పాలపిట్టను చూడటాన్ని అదృష్టంగా, శుభ సుచికంగా ప్రజలు భావిస్తారు. ఎందుకంటే… దసరా అంటేనే చెడుపై విజయానికి గుర్తు. ఇదే దసరా రోజున రావణాసురుణ్ని అంతమొందించి శ్రీరాముడు ఘన విజయం సాధించాడు. అలాగే రాక్షసుల రాజు మహిషాసురిడిని నేల కూల్చి… కాళికా మాత ఘన విజయం సాధించింది. ఇలాంటి విజయాలకు ప్రతీకగా పాలపిట్టను సూచిస్తారు. ఆ పిట్ట కనిపిస్తే విజయం దక్కినట్లే. అందుకే… పండుగ నాడు పాలపిట్టను చూడాలి. అదృష్టంగా భావించాలని పండితులు చెబుతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published.