సజీవ చిత్రకారుడు

టర్నర్…..ఈయన ప్రపంచప్రసిద్ది చెందినచిత్రకారుడు. ఆయన ఓ చిత్రం గీసారు. అది… సముద్రం మీద వీచే హోరుగాలిని ప్రతిబింబించే చిత్రం. చూడటానికి అచ్చం ప్రకృతికి అద్దం పట్టేదే. అంత యదార్ధంగా ఉంది ఆ చిత్రం.

టర్నర్ కి ఓ మిత్రుడున్నాడు. ఆయన ఒక కాలేజీ ప్రొఫెసర్. ఆయన పేరు చార్లెస్ కింగ్ స్లీ. టర్నర్ గీసిన ఈ హోరుగాలి చిత్రం గురించి విని దానిని చూడటానికి వచ్చాడు ఆయన దగ్గరకు.

టర్నర్ గీసిన చిత్రాన్ని తదేకంగా చూసి “ఈ చిత్రాన్ని ఎలా గీసావు? ఓ హోరుగాలిని ఊహించుకుని కదా ఈ చిత్రాన్ని గీసావు?” అని అడిగాడు ఆ ప్రొఫెసర్.

దానికి టర్నర్ ఇలా జవాబిచ్చారు –
“నేను సముద్రజలాలమీద హోరు గాలి వీస్తే బాగుంటుంది అని అనుకుని గీసాను. అందుకోసం హాలండ్ వెళ్లి హోరుగాలి, తుఫాను వచ్చినప్పుడు ఓ జాలరిని కలిసి ఓ పడవ ఎక్కి నడి సముద్రం వరకు సాగాను. నన్ను పడవలోని ఒక కొయ్యకు గట్టిగా కట్టేసేమన్నాను….జాలరి అలాగే చేసాడు. నేను మరుక్షణం హోరుగాలితో కలిసిపోయాను. తుఫాను, హోరుగాలి – వీటిని కనులారా చూసాను. మనసులో చూసిన వాటిని నమోదు చేసుకున్నాను. తుఫాను తగ్గిన తర్వాత తీరానికి వచ్చాను. అనంతరం నేను మనోఫలకంపై గీసిన దానిని కాన్వాస్ పై చిత్రించాను” అన్నాడు.

టర్నర్ పూర్తి పేరు జోసెఫ్ మలార్డ్ విలియం టర్నర్. 1775 మే 14వ ఎదీన పుట్టిన టర్నర్ 1851 డిసెంబర్ 19వ తేదీన కన్నుమూశారు. ల్యాండ్ స్కాపే పెయింటింగ్స్ కు ఆయన పెట్టింది పేరు. తైలవర్ణ చిత్రాలకు సుప్రసిద్ధుడైనా వాటర్ కలర్ లాండ్ స్కాపే పెయింటింగ్ లో దిట్ట. ఆయన తన ప్రేయసి సోఫియా కరోలిన్ బూత్ ఇంట తుదిశ్వాస విడిచారు. ఆయన తన ఆఖరి మాటగా చెప్పినది – “సూర్యుడే దేవుడు” అని.
ఆయన కోరిక మేరకు సెయింట్ పాల్ కేథడ్రల్ లో ఆయన భౌతికకాయాన్ని పాతిపెట్టారు. ఆయన అసలు గురువు డాక్టర్ మన్రో. వాటర్ కలర్స్ ని ఎలా ఉపయోగించాలో అనేది ఆయన దగ్గర నేర్చుకున్నారు టర్నర్.
ఆయన గీసిన చిత్రాలలో మొదటగా ఓ అమెరికా జాతీయుడు కొన్నాడు. ఆయన పేరు జేమ్స్ లెనాక్స్. ఆయన న్యూ యార్క్ నివాసి.
————————
యామీ