సతీ స్మృతి "భరద్వాజ్"

మరణ వియోగంతో కలిగే బాధ అందరికీ ఒక్కటే. అయితే కొందరు ఆ బాధను చెప్పుకోగలరు. కొందరు చెప్పుకోలేరు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ తన భార్య పోయినప్పుడు బెంగాలీ భాషలో ఓ రెండు స్మృతి గీతాలు రాశారు. వాటి శీర్షిక స్మరణ. మన తెలుగు సాహిత్యంలోకివచ్చేసరికి ఇలాంటి ఎలిజీని శోకగీతం అని గానీ శోక కావ్యం అని గానీ చెప్పుకోవచ్చు. తాపీ ధర్మారావు, వావిలాల వాసుదేవ శాస్త్రి, వడ్డాది సుబ్బరాయ కవి, ఆది నారాయణ మూర్తి, రాయప్రోలు సుబ్బారావు, చిలకమర్తి, బసవరాజు అప్పారావు ఇలా ఎందరో ప్రముఖులు ఎలిజీలు రాయకపోలేదు. అలాగే నాయని సుబ్బారావు గారు కూడా స్మృతి కావ్యం రాశారు.
అయితే జ్ఞానపీఠం అవార్డు పొందిన రావూరి భరద్వాజ్ వారు రాసిన సాథీస్మృతి ఓ ప్రత్యేక తరహాలో సాగింది. ఆయన డైరీ తరహాలో ఈసాహిత్యం రాయడం విశేషం. ఈ గీతాలలో ఆయన వొట్టి వ్యక్తిగత విషయాలనే కాకుండా ఆత్మీయ విషయాలతోపాటు తాత్విక విషయాలనూ పొందుపరిచారు.
జీవితమనే విశ్వవిద్యాలయంలో ఎన్నో నేర్చుకున్న ఆయన ఒక చోట “కష్టాల స్వర్గం నాకు తెలుసు….సుఖాల నరకం కూడా తెలుసు” అన్నారు. ఆయన నిజాయితీ ఆయన మాటల్లో చూడొచ్చు. “గతంలో నేను రకరకాల దారిద్ర్యాలను స్థిర చిత్తంతో ఎదుర్కొన్నాను. వాటినన్నింటినీ నేను భరించగలిగాను. కానీ ఈ దారిద్ర్యాన్ని నేను భరించలేకపోతున్నాను….నీవు లేని ఈ దారిద్ర్యాన్ని…” అని ఆయన రాసుకున్నారు.
“నీ రూపంలో వస్తే తప్ప నేనిప్పుడు భగవంతుణ్ణి కూడా గుర్తించలేను కాంతమా” అన్నారు భరద్వాజ.

భార్య మరణ బాధను వర్ణించడానికి ఆయన ఓ చీమల కథ చెప్పారు. ఆ కథలో తల్లిని పోగొట్టుకున్న పిల్ల చీమలు, భార్యను పోగొట్టుకున్న భర్త చేమ గిలగిలలాడటం, విలవిలలాడటం చూస్తే మన సంసారమేగుర్తుకొచ్చిందని ఆయన భార్యతో అన్నారు.

అలాగే బల్లి – సీతాకోక చిలుకల కథలో మొదటి సీతాకోకచిలుకను మింగిన బల్లి మీద ఆ రెండోది దాడి చేసి ఉండకపోతే అది బతికి ఉండేదని, కానీ తమ మధ్య గల అనురాగం కారణంగా బల్లి మీద తిరుగుబాటు చెయ్యకుండా ఉండలేకపోయిందని అంటూ ఆ కథలో మొదటి సీతాకోకచిలుకే కాంతమ్మ గారనీ, ఆ బల్లి కాంతమ్మను మింగిన మృత్యువు అని చెప్పారు భరద్వాజ గారు. రెండో సీతాకోకచిలుకలా తానూ తిరగబడి తానూ మరణించి ఉండేవాడినని, తనలా తిరగబడకుండా ఉండటానికి, ఆ పురుగుల కన్నా తెలివైన మనిషిని కావడమే కారణమని బాధపడ్డారు భరద్వాజ.

ప్రతి వాక్యం లో నుంచి కనీసం ఒక్క బొమ్మయినా తొంగి చూడకపోతే ఆ వాక్యం రాయడం శుద్ధ దండగ అని చెప్పే భరద్వాజ ఒక అనుభూతిని మన హృదయానికి పట్టించడానికి లేదా ఒక భావాన్ని మన కళ్ళకు కట్టించడానికి సమర్థులైన గొప్ప రచయితగా అనిపిస్తారు.

————————-
మహిమ