“ఇంటి మీద దుప్పటి” ఎంత చక్కగా వెచ్చగా వుంది! మొదట చదివినప్పుడు “వంటి మీద దుప్పటి” అయ్యుంటుందిలే ఇదేదో అచ్చు తప్పు పడిందేమో అనుకున్నాను. చదివిన తరువాత గానీ శ్రీ శంకు గణపతి రావు గారు ఈ పేరెందుకు పెట్టారో అర్ధం అయ్యింది. పేరులాగానే ఒకసారి చదివితే శ్రీ గణపతి రావు గారు వ్రాసిన కధల్లోని గూఢర్ధాన్ని అన్వయించుకోలేము. ఇంతకు ముందు వ్రాసిన రెండు పుస్తకాలూ దేనికవే సాటి. ప్రతీ కధ సమాజంలోని ఏదో ఒక సమస్యను విభిన్నమైన కోణంలో విశ్లేషించి సజీవ పాత్రలను సృష్టించారనడంలో ఎంత మాత్రమూ సందేహం లేదు.
ప్రస్తుత కాల పరిస్థితుల్లో మనిషి ఒక గంట కూడా తనకు తాను విచారించుకోవడానికి సమయం వెచ్చించలేక పోతున్నారు. సంఘంలో ఏమి జరుగుతోందో అని తెలుసుకొనే సమయం ఎవరికీ లేదు. అయితే ఈ విషయం మనకంత అవసరమా? అని అనుకోవచ్చు. వెనక్కి తిరిగి చూసే కాలం వచ్చే సరికి మన చేతుల్లోనుండి దాటిపోతుంది. ఇటువంటి కధలు చదివితే మన జీవన నావ ఎటు వెళ్తుందో అవగాహన పెరుగుతుంది. సమాజంలో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని ఈ కధల్లోని పాత్రలు వున్నారని అర్ధం అవుతుంది.
తెలుగుమల్లి యొక్క ముఖ్యోద్దేశ్యం తెలుగు భాషని అభివృద్ధి పరచాలని తెలుగుదనాన్ని ప్రోత్సహించాలని. ఈ రెండు విభాగాల్లో శ్రీ గణపతి రావు గారు నూటికి నూరు మార్కులూ కొట్టేశారు. వారి రచనా శైలి, కధని నడిపించే అద్భుత పటిమ, మన భాషలో వున్న మాధుర్యానికి మరింత వన్నె తెచ్చే చక్కటి పదజాలం మరియు సందర్భోచితమైన ఉపమానాలతో ప్రతీ కధని విశ్వనాధుని ఎంకిలా తీర్చి దిద్దారు. కవర్ డిజైన్ వేసిన శ్రీ లంకా భాస్కర్ గారు మరియు ప్రతీ కధకి సరైన చిత్రాలను వేసిన శ్రీ బాలి గారు కూడా అభినందనీయులు.