–సమీర్ మల్లా
మనలో వున్న కళకి భాష, ప్రాంతం, దేశం అనేవి ఎప్పుడూ ఎల్లలు కావు. నిగూఢమైయున్న కళకి కాలం కనిపెడుతూవుంటుంది. అవకాశం కోసం ఎదురు చూస్తుంది. సమయం వచ్చినపుడు రెక్కలు కడుతుంది. ఆ రెక్కలతోనే ఆకాశంలోని చుక్కలవరకు ఎదగనిస్తుంది. కళామతల్లి ముద్దు బిడ్డగా తీర్చిదిద్దుతుంది. రాయిలోని శిల్పాన్ని ఉలితో వెలికితీస్తుంది.
పువ్వు పుట్టగనే పరిమళిస్తుంది. ఆ పరిమళాన్ని ఎల్లవేళలా వెదజల్లుతుంది. మొదటి పుట్టినరోజే సినీ గీతానికి అనుగుణంగా అడుగులు వేసి అందరినీ ఆశ్చర్యపరచినా అప్పుడు ఎవ్వరూ ఊహించని ఎత్తుకి ఎదిగాడు. వయసుతో పాటు కళను అక్కున చేర్చుకున్నాడు. అదే నా ధ్యేయమన్నాడు. తన దిశను నిర్ధారించుకున్నాడు. దశను తిరగ వ్రాసుకున్నాడు. సమీకరణాలు సమీక్షించుకున్నాడు. చిత్రసీమలో అడుగుపెట్టాడు. సమీర్ మల్లాగా నిలబడ్డాడు.
సమీర్ మల్లా … సిడ్నీ వాస్తవ్యులు శ్రీ రాజేష్ మల్ల మరియు శ్రీమతి విజయ లకు జ్యేష్ఠ పుత్రుడు. నాలుగేళ్ళ వయసులో సిడ్నీ వచ్చాడు. చిన్నప్పటినుండి ‘చిరు’ అంటే అభిమానం. తన నాల్గవ ఏట “అన్నయ్య” చిత్రంలోని చిరంజీవి పాటకి అద్భుతంగా నృత్యం చేసాడు. సిడ్నీలో షుమారు అన్ని భారతీయ సంఘాల సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని సిడ్నీ “హృతిక్ రోషన్” అనిపించుకున్నాడు. పరభాషా సంస్కృతితో సహజీవనం చేసినా మాతృ భూమన్నా మాతృ భాషన్నా అభిమానం. కాలేజీలో ATAR స్కోర్ 90 శాతం దాటి మంచి విశ్వవిద్యాలయంలో ప్రవేశం దొరికే అవకాశం వున్నా నటన మీద మక్కువతో Stella Adler Studio of Acting – Los Angeles లో చేరి అదే బాటను ఎంచుకున్నాడు సమీర్. నమ్ముకున్న వృత్తి తననెప్పుడూ వమ్ము చేయదని నిరూపించాడు.
కన్నడ భాషలో బహు ప్రచారం పొందిన “కిరాక్” తెలుగు భాషలో తిరిగి రూపొందిస్తున్న చిత్రంలో మొదటిసారి నటించే అవకాశం దొరికింది. చిత్రం పూర్తయి ఈ నెల విడుదల అయ్యే అవకాశం వుంది. ఈ చిత్రం కధ కాలేజీ జీవితం, యుక్త వయసులోవున్న పిల్లలగురించి కాబట్టి యువతను ఎక్కువగా ఆకర్షించే అవకాశం వుంటుంది. ఆస్ట్రేలియాలో కూడా ఈ చిత్రం విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మన తెలుగు అబ్బాయి సినిమా నటుడుగా ఎదిగి ఆస్ట్రేలియా తెలుగువారు గర్వపడేలా చేసినందుకు అందరూ ఈ సినిమా చూసి సమీర్ ని అశీర్వదించవలసిందిగా తెలుగుమల్లి కోరుకుంటుంది. మరెన్నో చిత్రాల్లో నటించి సమీర్ కధానాయకుడుగా ముందు ముందు ఎదగాలని ఆశిద్దాం.