సాహితీ వాజ్మయికి నీరాజనం

2020 లో వంగూరి ఫౌండేషన్ వారు నిర్వహించిన ఏడవ ప్రపంచ సాహితీ సదస్సు సందర్భంగా ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ ప్రతినిధిగా నన్ను నియమించడం జరిగింది. అప్పట్లో ఒక సాహితీ ప్రతినిధిగా ఇదివరకు నిర్వహించిన బాధ్యతే గదా అని ఒక సదవకాసాన్ని అందిపుచ్చుకొని నా ప్రయాణం మొదలుపెట్టాను. యాదృచ్చికంగా ఈ గ్రంధకర్త శ్రీ చింతలపాటి మురళీమోహన్ గారు ఆస్ట్రేలియాలో ఉండటం మూలాన సదస్సులో పాల్గొనడానికి నన్ను సంప్రదించడం జరిగింది. ఆ శుభ ఘడియలు మా ప్రయాణానికి మహోజ్వలమైన బాట వేస్తాయని ఊహించనే లేదు. సుమారు ఏడాదిన్నర కాలంలో శ్రీ చింతలపాటి వారి సహచర్యంలో తెలుగుమల్లి అధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలు నా సాహితీ జీవితంలో మరపురాని మైలురాళ్లు. అలాగే వారి ద్వారా పద్య రచనలో నేర్చుకున్న మెళుకువలు కోకొల్లలు.

ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ దేశాలలోని తెలుగువారు గత తొమ్మిదేళ్ళుగా తెలుగుమల్లిని ఆదరిస్తూ, అభిమానిస్తూ సాహితీ విలువలను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకొని సాహిత్యంలో ముందడుగు వేస్తూ ముందుకు నడుస్తున్నారు. ఈ ప్రక్రియలో గత రెండేళ్లుగా సాగుతున్న పద్య రచన ఒక సుమధుర ఘట్టం. అయితే పద్య రచన మరింత పటిష్టంగా రసవత్తరంగా జరగడానికి మంచి పదజాలం మరింత తోడ్పడుతుందని కావ్య ప్రవచనాలు నిర్వహించడం ద్వారా ఈ కోరికను తీర్చుకోవచ్చన్న ఆకాంక్ష అందరిలోనూ కలిగింది. ఈ నేపథ్యంలో శ్రీ చింతలపాటి వారు ముందుకొచ్చి తెలుగు పంచకావ్యాల ప్రవచనం నాలుగు నెలలు ఏకధాటిగా నిర్వహించి ఇక్కడి తెలుగువారందరినీ ఉత్సాహ పరిచారు. కావ్య రసోద్భావాన్ని అందించి కృతకృత్యులయ్యారు.

ఈ పరంపరలో శ్రీ చింతలపాటి వారు వ్రాసిన “సిరిదివ్వెలు” కావ్యం ప్రస్థావన రావడం జరిగింది. సాధారణంగా పూర్వ కవులు వ్రాసిన కావ్యాలు ఆధునిక కవులు వివిధ మాధ్యమాల ద్వారా వివరించడం జరుగుతుంది. స్వీయ రచనలో 2,000 సంవత్సరాల చరిత్ర కలిగి పార్వతీ పరమేశ్వరులు ఒకే పీఠంపై ఉన్న శ్రీ బాలా సమేత జలధీశ్వర స్వామి వారిపై అనన్య సామాన్యమైన భక్తి ప్రపత్తులతో 650 పద్యాల కావ్యాన్ని వ్రాసిన ‘సిరిదివ్వెలు’, వారు చెప్పగా వినాలని శ్రోతలందరూ అడుగగా రెండు నెలలు ఈ కావ్య ప్రవచనం జరిగింది.
ఈ కావ్యంలోని పద్య శిల్పం, కథాగమనం, పదబంధం, చందస్సు తీరు, వర్ణానాంశాలు – ఇలా ఎన్నో విధాలుగా శ్రోతల ప్రశంసలు అందుకొని ఆ వాజ్మయే చేయిపట్టి వ్రాసినట్లుంది. ఈ కావ్యంలోని సుమారు 48 చందస్సులు (కొన్ని సామాన్యంగా వాడుకలో లేవు) వాటి నడక విని శ్రోతలందరూ పులకించిపోయి పునీతులయ్యామని పరవశించిపోయారు. ఇంతటి మహోత్కృష్టమైన భాషకు వారసులమని ఎంతో ఆనందించారు. కళ్ళనీళ్ళ పర్యంతమై పెదవి దాటని మధురానుభూతులను వ్యక్తం చేసారు. ఈ కావ్యం సాహితీ విలువలను సంతరించుకొని భక్తి తత్వానికి పరాకాష్టగా నిలిచింది.

ఆధునిక కవి యని అపోహలో ఉన్నవారందరూ ఈ కావ్యంలోని పద్యాలు విన్న తరువాత శ్రీ చింతలపాటి వారు తప్పకుండా మన పూర్వ కవుల కోవకు చెందినవారేనని ఈ కావ్యం తప్పకుండా ముద్రితమై ప్రతీ ఒక్కరూ చదవవలసినదేనని పదే పదే అన్నారు.

తెలుగుమల్లి ఈకావ్య ముద్రణ బాధ్యతను తీసుకొని శుభకృత్ ఉగాదికి ఆవిష్కరించాలని సంకల్పించింది. ఈ సదవకాసం తెలుగుమల్లికి ఇచ్చిన గ్రంధకర్త ‘కావ్య కళా ప్రపూర్ణ’ శ్రీ చింతలపాటి మురళీ మోహన్ గారికి కృతజ్ఞతాభినందనలు. ఈ కావ్య ముద్రణకు చేయూతనందించిన మా పద్య వికాస సభ్యులందరికీ కృతజ్ఞతలు.

మల్లికేశ్వర రావు కొంచాడ
తెలుగుమల్లి సంపాదకులు, ఆస్ట్రేలియా