సిగ్గుల సింగారి

ప్రియమైన…..

మనమిద్దరం చూపులతో కలవడం మొదలుపెట్టిన తొలి రోజుల్లో నన్ను నేనే చూస్తుండటాన్ని నేనే చూస్తే నేనేమీ నిన్ను చూడలేదే అనే చిరుకోపంతో లైట్ హౌస్ లా ముఖాన్ని తిప్పుకున్న నీ తీరు గుర్తుకొచ్చి నవ్వొస్తోంది,….

కానీ నిన్నే నేను చూస్తున్నప్పుడు నువ్వు చూస్తే అయ్యో చూసానుగా అనే తత్తరపాటుతో నేను తడబడి తిరిగినప్పుడు ప్రేమనంతా కుమ్మరిస్తోంది చూపుల కలయిక….

నీ దగ్గర ఏ దురలవాటూ లేకపోవడం నాకు ఆనందమే. అయినా బాధగానే ఉంది.
నేను చెప్తే నువ్వు విడిచి పెట్టడానికి ఒక్క దురలవాటూ లేదే నీ దగ్గర అని.
అలా ఎందుకు అంటావేమో… నేనలా చెప్పగా నువ్వు కష్టపడి ఓ దురలవాటు విడిచిపెట్టానని చెప్పినప్పుడు కలిగే ఆనందానికి అంతు ఉండదు తెలుసా….

చిన్నప్పుడు కొన్ని సందర్భాలలో నేను సిగ్గు పడకపోలేదు. కానీ అప్పుడు సిగ్గు పడటంలో సిగ్గు మినహా మరేదీ లేదు. అసలు మరేవైనా ఉంటుంది అనేది కూడా అప్పట్లో తెలీదు.

నిన్న సాయంత్రం మాట్లాడుతున్నప్పుడు ఉన్నట్టుండి నువ్వు నా చెయ్యి పట్టుకున్నప్పుడు నీ చేతుల్లో ఉన్న నా చేతిని వెనక్కు లాక్కోవాలని అనుకున్న క్షణంలో నాలో ఉన్న స్త్రీత్వం వద్దు ఉండనివ్వు ఆ చెయ్యి అలాగే అన్న మనసు మాటను కాదనలేకపోయాను

సిగ్గు పడటంలో కలిగే అనుభూతులు ఎప్పుడూ నీ స్పర్శ వల్ల తెలుస్తూనే ఉంది.

దాని గురించి నిన్న రాత్రి ఏకాంతంలో ఆలోచిస్తున్నప్పుడు నాకు తెలియకుండానే నేను ఎదుగుతున్నాను అని తెలుసుకున్నాను….నా శారీరక ఎదుగుదలతో పాటే బిడియం కూడా పెరుగుతోంది.

మనమిద్దరం విడివిడిగా ఉన్నప్పుడు నేనున్న గదిలోని అద్దానికి ఎన్ని కనులో తెలుసా….
ఆ చూపులన్నీ నన్ను సిగ్గులో ముంచెత్తుతున్నాయి ….

నువ్వు కౌగిలించుకున్నప్పుడు నలిగిన చీరను నలిగిన తీరులోనే ఉండనివ్వడం కుదరడం లేదు.

నీ ప్రేమ గురించి ఏదీ తెలియనట్లు ఈ చీరకట్టు నాతో ఊసులాడుతోంది…

అదేం స్థితో….నా పెదవులు రెండింటినీ కలిపి నీకు ఒక్క ముద్దు మాత్రమే ఇస్తున్నాను బిడియాన్ని పక్కన పెట్టి ప్రస్తుతానికి….

ఉంటాను మరి…
మళ్ళీ కలుసుకున్నప్పుడు మరిన్ని గుసగుసలు…..సరేనా
నీ సిగ్గుల సింగారిని

– యామీ