సి నా రే భళారే

“పాలుగా మారిన రక్తం
రక్తాన్ని రూపొందించిన స్తన్యం
అడగకుండానే చెబుతాయి
అమ్మ చిరునామా …”
అంటూ అమ్మ గొప్పదనాన్ని
మహోన్నతంగా మనముందుంచిన
సాహితీక్షేత్రుడు సి నా రే సృష్టిలో
భావాలు పదాలు కవలపిల్లలు
ఈ కవలపిల్లలు
కలంలో నింపుకున్న సిరా
అలాంటి ఇలాంటి సిరా కాదు
చదువుల తల్లి సాక్షిగా అమృతాక్షరాల రసాన్ని
పోయించుకుని
సాహితీ వనంలో పూయించని పువ్వులు లేవు

కవితలు
మినీకవితలు
కథాకావ్యాలు
సంగీతరూపకాలకు పాటలు
సినీజగత్తులో అడుగుపెట్టిన మొదటి చిత్రం
గులేబకావళి చిత్రంలో అన్ని పాటలు
గజళ్ళు
ఇలా ఒకటేమిటి
అదీ ఇదీ కాదు అనంతకోటి పదబంధాలతో
సాహితీ ప్రేమికులను అలరిస్తున్న సినారె వేళ్ళు
కాగితంపై నర్తిస్తేనే కాలం కదిలేది
కదిలేకొద్దీ ఎదిగి ఎదిగి
విశ్వంభరతో జ్ఞానపీఠమెక్కి
అలుపెరుగని సైనికుడిలా
సదా భావాలతో సాహితీ కోటను
కళకళలాడిస్తున్న
సినారెకు
అక్షరాలంటే వల్లమాలిన ప్రేమ
అక్షరాలంటే
సినారెకు ఎల్లల్లేని ప్రేమ
ఈ జంట ప్రేమలు సంగమించిన వేళ
పుట్టుకొచ్చే మాటలు
చదివి చదివి
ఆనందసాగరంలో
మునిగి తేలి
తేలి మునిగి
మైమరచిపోయే కవిప్రేమికుడిలో
నేనొకడిని…