స్పీడుబ్రేకర్లు అవసరమే

స్పీడుబ్రేకర్లు అవసరమే

అతనికి పదిహేను సంవత్సరాలు. అతను తన ఇంటికి దగ్గరలో ఉన్న ఓ సూపర్ మార్కెట్ కి వెళ్ళాడు.
రద్దీ లేని మధ్యాన్న వేళ. అతను ఆ దుకాణ యజమానితో మాట్లాడి పొందిన అనుమతితో ఒకరికి ఫోన్ చేసాడు.
“మేడం…మీ ఇంట్లో తోటను శుభ్రం చేయడానికి మనిషి కావాలా?” అని అడిగాడు ఆ కుర్రాడు.
“అవసరం లేదు. ఇప్పటికే ఓ కుర్రాడిని పనిలోకి తీసుకున్నాం” అవతలివైపు నుంచి జవాబు.
“పరవాలేదు….మేడం…అతనికి ఇచ్చే జీతంలో సగం ఇస్తే చాలు….నేను మీకు కావలసిన అన్ని పనులూ చేస్తాను”
“అయినా అక్కరలేదు…..అతను బాగానే పని చేస్తున్నాడు…”
అయినా ఆ అబ్బాయి మాట్లాడుతూ ..”ఎలాగైనా ఒక్క అవకాశం ఇచ్చి చూడండి నాకు….నేను ఆ కుర్రాడి కంటే బాగా పని చేసానో లేదో మీకు తెలుస్తుంది…..దయ చేసి ఒక్క అవకాశం ఇవ్వండి”
“అర్ధం చేసుకోండి….లేదు…లేదు….నీకు ఉద్యోగం ఇచ్చే ఉద్దేశమే లేదు”
ఆ మాటలతో అతను ఫోన్ పెట్టేసాడు.
అవతలి వైపునుంచి వచ్చిన జవాబుకి ఈ కుర్రాడు బాధపడ లేదు. నవ్వుతూ ఫోన్ కి అయిన డబ్బులు ఇచ్చాడు.
ఈ సంభాషణను విన్న సూపర్ మార్కెట్ యజమానికి అతని వాలకం ఆశ్చర్యం కలిగించింది. ఎవరినైతే ఉద్యోగం అడిగాడో వాళ్ళు పని లేదన్నారు. అయినా ఈ కుర్రాడిలో విచారం లేదేమిటీ అనుకున్నాడు.
అదే విషయాన్ని కుర్రాడిని అడిగాడు. “వాళ్ళు పని ఇవ్వమన్నా నీలో కించిత్ బాధా లేదు. పైపెచ్చు నవ్వుతున్నావు” అని అడిగాడు సూపర్ మార్కెట్ యజమాని.
అప్పుడు ఆ కుర్రాడు “మీ ప్రశ్న అర్ధమైంది. అడిగినందుకు సంతోషం. అయినా నాకు పని అవసరం లేదండీ…” అన్నాడు.
“అదేమిటీ ఇప్పుడేగా ఫోన్ లో ఉద్యోగం ఇవ్వండి…సగం జీతం ఇచ్చినా చాలు అన్నావు….” అని సూపర్ మార్కెట్ యజమాని మళ్ళీ అడిగాడు.
“అవునండీ…నేను చెప్పిందీ…మీరు విన్నదీ నిజమే…నాకు ఉద్యోగం అక్కరలేదు….నేను ఇంతసేపూ మాట్లాడిందీ నేను పనిచేస్తున్నమా యజమానితోనే….నేను సరిగ్గా పని చేస్తున్నానా లేదా తెలుసుకోవడానికే మా యజమానితో అలా మాట్లాడాను” అన్నాడు కుర్రాడు.
సూపర్ మార్కెట్ యజమాని నోటంట మాట లేదు. కుర్రాడి వంక ఆశ్చర్యంగా చూసాడు.
కుర్రాడి ఈ చర్యను “స్వీయ పరిశోధన ” అంటారు.
విజయం సాధించే వాళ్ళు అదే పనిగా ముందుకు సాగిపోతున్నా అప్పుడప్పుడూ ఆగి తమను తాము పరీక్షించుకోవాలి…తమ వాస్తవ స్థితి తెలుసుకుంటారు కొందరు.

రోడ్లో ప్రయాణించడంలాటిదే జీవితం అని వాళ్లకు బాగా తెలుసు. స్పీడు బ్రేకర్లు , సిగ్నల్ లో వెలిగే ఎర్ర లైట్లను వాళ్ళు అవాంతరాలుగా భావించారు. తమ విజయపధంలో అవీ ఒక భాగం అనుకుంటారు. అవి తమని సరైన మార్గంలో తీసుకుపోయేవే అని అనుకుంటారు.
కొన్ని సార్లు అవసరమైతే జీవితంలో వాళ్ళు రివర్స్ గీర్ వేయడానికి కూడా బాధపడరు.
మరికొన్నిసార్లు అయ్యో తప్పు చేసేసాం అని తెలుసుకున్న మరుక్షణం “యూ టర్న్ ” తీసుకుని తమ తప్పుని దిద్దుకుంటారు.
కనుక అర్ధం చేసుకోవలసింది ఏమిటంటే విజయసారదులు మంకు పట్టు పట్టారు. లేని పోని డాంబికాలకు పోరు. మార్పుని సులభంగా తీసుకుంటారు. వాటికి సర్దుకుపోతారు.
“అదేమిటీ తరచూ అలా మారుతుంటే ఈ ప్రపంచం మనల్ని నిలకడ లేని వారని అనుకోడా అని మీ ప్రశ్న కదూ…మార్పులో ముఖ్యమైంది లక్ష్య సాధనలో అనుసరించే పద్ధతిలో మార్పు ముఖ్యం. ఇందులో స్పష్టత చాలా ముఖ్యం. అయోమయం ఉండకూడదు. అప్పుడు విజయం తప్పక వరిస్తుంది.

– చౌటపల్లి నీరజ

Send a Comment

Your email address will not be published.