స్పూర్తి - మానవ మూర్తి

జాత్యహంకారముతో తెల్లవాళ్ళు
నల్లవార్ని అలుసుగా
నలుసులవలే నలిపేస్తూ
నరబలి కొనసాగిస్తూ
వారి దేశాన వారినే
బానిసలుగా మార్చేసి
పాలకులై పాలిస్తుంటే

తన జాతివారి కంటతడి
ఆ యువకుడి గుండె తట్టి
నడిపింది నాయకునిగచేసి
నిప్పై,నెగడై ఉప్పెనలా
దురహంకారుల దోపిడీని
నిలదీసి, నిగ్గుదీసి ప్రపంచాన
తెలిపి, వారి గుండెల్లో గుబులై,
వెలిగిన నల్లజాతి ఆశా జ్యోతి

యవ్వనాన చెరసాలకేగి
జీవితాన 27 సం॥రాలు
జైలుగోడల అంకితంచేసి
చెదరని విశ్వాసముతో
శాంతి కాంతులు వెదజల్లి
జాతిని జాగృతంచేసి
బానిస సంకెళ్లను తెంచి
ఆఫ్రికాకు ఆనందంతెచ్చిన
వీరుడు, ధీరుడు నల్లవారి
జాతిపిత, నోబెల్ గ్రహీత
నెల్సన్ మండేలా.. జోహార్ !!