హరేక్ మాల్ బీస్ రుపే

అతడు నాకు బాల్యం నుండీ చిరపరిచితుడు
విలక్షణమైన స్వర విన్యాసంతో
ఆత్మీయమైన కళ్ళ వెన్నెలతో
నన్ను చిన్నప్పుడే ఆకర్షించినవాడు

అతనప్పుడు పాత డొక్కు సైకిలు నిండా వస్తుహరాలతో
పాతనగర వీధులన్నీ కలియ తిరిగేవాడు
అతని మెడనిండా, భుజాలనిండా రకరకాల వస్తువులు
‘హరేక్ మాల్ చారాణా’
అన్న గొంతు వినగానే
పొలోమని మేమంతా అతని చుట్టూ మూగేవాళ్ళం

దువ్వెనలు, అద్దాలు, పిన్నీసులు, మొలతాళ్ళు, కత్తెరలు, నెయిల్ కట్టర్లు,
స్నోలు, పౌడర్లు, సబ్బులు…. ఒకటేమిటి
ప్రతి వస్తువుకూ ఫిక్స్ద్ రేటు ఇరవై ఐదు పైసలే –
అన్నీ హైదరాబాద్ లోకల్ మేడ్ (మేడిన్ హైదరాబాద్)

సగటు మనిషి అవసరాలు తీర్చే
సంచార కిరాణ కొట్టులాగా ఉండేవాడు
వీధి వీధంతా కలియ తిరిగి
అతను వెళ్ళిపోగానే
వాన కురిసి వెలిసినట్లుండేది
ఎన్నిసార్లు అతని పేరడిగినా
‘హరేక్ మాల్’ అని నవ్వుతూ కదిలిపోయేవాడు

నుదుట బొట్టు కానీ
నెత్తిన టోపీ, పగిడీలు కానీ లేనందున
అతడచ్చు పదార్థవాదిలా కనబదేవాడు
అతడంటే నాకు గ్లామర్
ఒక స్ట్రీట్ వీరుడు

నా కౌమారంలో అతని నినాదం మారింది
‘హరేక్ మాల్ దో రుపే’
అతనప్పుడు పాత మోటార్ బైక్ నిండా వేలాడే
వస్తు ప్రదర్శనశాలగా రూపాంతరం చెందాడు
అప్పుడతని చుట్టూ మేం మూగాకపోయినా
అతని నాదస్వర తరంగాలు మా చెవుల్లో మార్మ్రోగుతూ ఉండేవి
అతనప్పుడు నడుస్తున్న సూపర్ బజార్ లా కనబడేవాడు –

చాన్నాళ్ళకు…
మొన్న ఒక పాత మారుతీ ట్రాలీ నిండా వస్తు సంపదతో
‘హరేక్ మాల్ బీస్ రుపే’ అంటూ ప్రత్యక్షమయ్యాడు
అతని ఒంటినిండా, వాహనం నిండా వస్తువులే వస్తువులు

ఎన్ని సూపర్ బజార్లు, స్పెన్సర్లు,
మల్టీ ప్లేక్స్ లూ, వాల్ మార్ట్ లొచ్చినా అతడుంటాడు

ఈ పవిత్ర భారతదేశంలో
పేదరికం కొనసాగినంత కాలం
అతడొక కామదేనువులా, కల్ప వృక్షంలా
‘హరేక్ మాల్’ నినాదంతో
సగటు మనిషికి ఆసరాగా ప్రతిధ్వనిస్తూనే ఉంటాడు

—డా. ఎస్వీ సత్యనారాయణ, ఉప కులాధిపతి, శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం