ఓసారి గాంధీజీ ఆమ్కీ అనే ప్రాంతంలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది.
గాంధీజీ రోజు ఎనిమిది ఔన్సుల మేక పాలు తాగటం అలవాటు. అయితే ఆమ్కీలో ఉన్నప్పుడు మేకపాలు దొరకలేదు. దానికి బదులు ఆయన కొబ్బరి పాలు తాగాల్సి వచ్చింది.
కానీ తాగడమైతే తాగారు కానీ అది ఆయన వంటికి సరిపడలేదు. అది తాగినప్పటినుంచి ఆయన పొట్టలో ఒకటే గడబిడ. చాలా అవస్థ పడ్డారు.
పైగా పాదయాత్ర చేపట్టిన గాంధీజీ నీరసంగా కనిపించారు. పొట్ట నొప్పి భరించలేక ఆయన పడిపోయారు.
వెంటనే ఆయన అనుయాయులు గాంధీజీ ముఖం మీద నీళ్ళు చల్లి ఆయనను తరలించి పరుపుమీద పడుకోబెట్టారు. గాంధీజీ స్థితి చూసి మను బెన్ ఆ ఊళ్ళో ఉన్న డాక్టర్ సుశీలను తీసుకురావలసిందిగా కొందరిని పంపారు.
ఈలోగా మేల్కొన్న గాంధీజీ డాక్టర్ సుశీలను డాక్టర్ ని తీసుకురానక్కరలేదని కచ్చితంగా చెప్పారు.
మనూ బెన్ తో “డాక్టర్ సుశీలను పిలవద్దు. రాముడిని మించిన గొప్ప డాక్టర్ మరొకరు లేరు. నేను చెయ్యవలసిన పనులు చాలా ఉన్నాయి. నా బాధ్యతలు పూర్తి చేసే వరకు రాముడు నన్ను చావనివ్వరు ….” అని చెప్పారు.
“లేదు….బాపూజీ….మీ ఆరోగ్యం బాగులేదు….అందుకే డాక్టర్ సుశీలను తీసుకురావలసిందిగా కొందరిని పంపింది నేనే” అన్నారు మనూ బెన్.
అప్పుడు గాంధీజీ “సరే డాక్టర్ సుశీల నా ఒక్కడికోసం ఇక్కడికి తీసుకురావడం సబబు కాదు…. ఆమెను నమ్ముకుని మరెందరో రోగుల పరిస్థితి ఆలోచించు…నా వల్ల మిగిలిన పేద రోగులు ఇబ్బందిపడతారు….వారిని ఇబ్బంది పెట్టి నాకు వైద్యం చేసుకోవడం స్వార్ధం కాదా…అందుకే డాక్టర్ సుశీలను తీసుకురావద్దు ” అంటూ హరే రామ్ హరే రామ్ అని చెప్పారు.
ఈ సంఘటన 1947వ సవత్సరం జనవరి 30వ తేదీన జరిగింది. ఇక్కడ బాధ పడవలసిన విషయం ఏమిటంటే, సరిగ్గా ఏడాది తర్వాత అదే జనవరి 30వ తేదీన (1948) గాంధీజీ పై కాల్పులు జరిగినప్పుడు ఆయన పెదవులు పలికిన చివరి మాటలు “హరే రామ్…హరే రామ్ …” అనే.
– నీరజ, కైకలూరు