హైప‌ర్ టెన్ష‌న్‌ తో ప్రాణానికి ముప్పు

చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా ఆందోళనకు గురవుతుండడం.. తీవ్రంగా అరవడం.. చేతికందిన వస్తువులను విసిరికొడుతుండడం.. మానసికంగా తట్టుకోలేనంత ఉద్వేగానికి గురవుతుండడం.. వంటి లక్షణాలనే హైపర్‌ టెన్షన్‌ అంటారు. సహజంగా ఇది అధిక రక్తపోటు కారణంగా వస్తుంది. ఇలా ఆందోళన పడని కొంతమందిలోనూ ఈ విధమైన ప్రభావం ఉంటుంది. అయితే వారిలో శరీర అవయవాలు లాగడం.. ఒత్తిడికి గురికావడం, బాగా తలనొప్పిగా ఉండటం.. వంటి లక్షణాలు కనిపిస్తాయి. మొత్తం మీద హైపర్‌ టెన్షన్‌ వల్ల కొన్నిసార్లు ప్రాణానికే ప్రమాదం తప్పదు.

హైపర్‌ టెన్షన్‌ (హైబీపీ) కు అధిక రక్తపోటు ముఖ్యకారణం. దీనివల్ల ఎంతోమంది అనారోగ్యానికి గురవుతున్నారు. వీరిలో పెద్దలే కాదు పిల్లలూ ఉండడం అందోళన కలిగించే అంశం. అసలు అధిక రక్తపోటు అంటే ఏమిటి? ఎందువల్ల వస్తుంది? ఎటువంటి నివారణోపాయాలు తీసుకోవాలి? అనే అంశం మీద అవగాహన పెంచుకుంటే ఈ రుగ్మత నుంచి గట్టెక్కవచ్చు. రక్తపోటును సమన్వయం చేసుకోవాలి. అధిక రక్తపోటు రావడానికి అనేక కారణాలున్నాయి. లక్షణాలను బట్టీ కారణాలు తెలుసుకోవచ్చు. నిర్ధారణ పరీక్షలు, చికిత్స, నివారణ చర్యలు తీసుకుంటే అధిక రక్తపోటు నుంచి బయటపడడం పెద్ద కష్టమైన పనికాదు. ఆయితే దీనిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా పరిణమిస్తుంది.

హైపర్‌టెన్షన్‌ వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యేది గుండె. అధిక రక్తపోటు వల్ల రక్తనాళాల్లో తీవ్ర ఒత్తిడి ఉంటుంది. రక్తనాళ గోడల మీద ఈ ఒత్తిడి ఉంటుంది. టైరులో గాలి నింపినట్టుగా, రబ్బరు ట్యూబ్‌లో నీరు నింపినట్టుగానే, రక్తనాళాల్లో రక్తం నింపి ఉన్నట్టుగా ఉంటుంది. టైరులో గాలిని మోతాదుకు మించి నింపితే టైరు పగిలిపోతుంది. అదేవిధంగా రబ్బరు ట్యూబులో నీటిని నింపితే అది పగిలిపోతుంది. ఈ తరహాలోనే రక్తనాళాల్లో రక్తపోటు పెరిగితే రక్తనాళాలు దెబ్బతిని, ప్రాణాంతకమౌతుంది. దీనినే హార్ట్‌ డిసీజ్‌ లేదా స్ట్రోక్‌ అంటారు.

కొన్ని కారణాలు
అధిక రక్తపోటుకు ఎన్నో రకాల కారణాలున్నాయి. వాటిలో కొన్ని….
– శరీరంలో నీటి శాతం తగ్గినా లేదా బలహీనంగా ఉన్నవారు తొందరగా ఆందోళనకు గురవుతారు. ఈ సమస్యల వల్ల అల్ప లేదా అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంటుంది.
– అల్ప రక్తపోటు కారణంగా గుండె పనివిధానంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఇదీ చాలా ప్రమాదకరం. కొన్ని సందర్భాల్లో గుండె పోటు వచ్చే అవకాశమూ ఉంది. కాబట్టి వెంటనే వైద్యులను సంప్రదించాలి.
– గర్భిణీలూ కొన్నిసార్లు అల్ప లేదా అధిక రక్తపోటుకు గురవుతారు. హార్మోన్ల పని విధానం మారడమే దీనికి కారణం. కాబట్టి గర్భిణులు నెలకోసారి వైద్యుల సలహా తీసుకోవాలి.
– అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే ఇంటర్నల్‌ బ్లీడింగ్‌ (అంతర్గత రక్తస్రావం) అయ్యే అవకాశం ఉంది. అలాంటి సమయంలో అల్ప రక్తపోటు (లోబీపీ) కు గురవుతారు.
– థైరాయిడ్‌, రక్తంలో చక్కెర స్థాయిలు అసమతుల్యంగా ఉన్నా అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు అతిప్రమాద కరమైన ఇన్‌ఫెక్షన్లు, సెప్టిక్‌ వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు హార్మోన్ల పని విధానంలో తేడా వస్తుంది.
– శరీరంలో విటమిన్‌ బి12, ఫోలెట్‌ తగ్గినప్పుడూ అల్ప రక్తపోటు వస్తుంది. ఇలాంటి సమయంలో శ్వాస సంబంధిత సమస్యలు, దురద, దగ్గు, గొంతువాపు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

నిర్లక్ష్యం తగదు
చాలామందికి తమకు అధిక రక్తపోటు వచ్చిన విషయాన్నీ గమనించ లేకపోతున్నారు. ఇది నిశ్శబ్ద హంతకి. ఎటువంటి లక్షణాలూ కనిపించకుండానే అధిక రక్తపోటు ప్రాణాలను తీసుకుంటుంది. అధిక రక్తపోటును ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా హైపర్‌టెన్షన్‌ తీవ్రపరిణామాలకు దారితీస్తుంది. వీరిలో కంటిచూపు మందగించడం, గుండెపోటు, స్ట్రోక్‌, కిడ్నీ ఫెయిల్యూర్‌, గుండె వైఫల్యం వంటివి చోటుచేసుకుంటాయి.

రక్తపోటు అంటే ?
సాధారణంగా శరీరంలోని రక్తం ధమనుల్లో ప్రవహిస్తూ ఉంటుంది. ధమనులలో ప్రవహించే ఈ రక్తం, high bpధమనుల లోపలి గోడల మీద కలిగించే ఒత్తిడినే బ్లడ్‌ప్రెజర్‌ లేదా రక్తపోటు అంటారు. సాధారణంగా గుండె వ్యక్తులను బట్టి, వ్యక్తి యొక్క పరిస్థితులను బట్టి నిమిషానికి 60 నుండి 90 సార్లు కొట్టుకొంటుంది. ఈ విధంగా గుండె కొట్టుకొన్నప్పుడు ఒక్క హృదయ స్పందనకు దాదాపు 70 సి.సి. రక్తం ప్రవహిస్తుంది. ఈ విధంగా రక్తం గుండె నుంచి శరీరంలోని మిగతా అవయవాలకు రక్తనాళాల ద్వారా ప్రవహిస్తుంది. ఈ విధంగా గుండె నుండి రక్తం శరీరంలోని ఇతర భాగాలకు సరఫరా చేయడానికి కొంత ఒత్తిడి కావలసి ఉంటుంది. దీనినే బ్లడ్‌ ప్రెజర్‌ అంటారు. అయితే ఈ బ్లడ్‌ప్రెజర్‌ అనేది ఒకే విధంగా ఎప్పుడూ ఉండదు. గుండె సంకోచించినపుడు గుండె నుండి రక్తం ధమనుల్లోకి ప్రవహించినపుడు రక్తపోటు కొంచెం ఎక్కువగా ఉంటుంది. దీనినే సిస్టోలిక్‌ ప్రెషర్‌ అంటారు. అయితే గుండె వ్యాకోచించినప్పుడు ఈ రక్తపోటు తక్కువగా ఉంటుంది. దీనిని డయాస్టాలిక్‌ ప్రెజర్‌ అంటారు. సాధారణంగా డాక్టర్లు బి.పి.(బ్లడ్‌ ప్రెజర్‌)ను స్పిగ్మోమేనోమీటర్‌తో కొలుస్తారు. రక్తపోటును పరీక్షించడానికి ఇది అత్యుత్తమ సాధనం.

ఎవరికి వస్తుంది?
హైపర్‌టెన్షన్‌ ఎవరికి వస్తుంది అనే విషయాల మీద జరుగుతున్న పరిశోధనల్లో చాలా అంశాలు వెలుగు చూశాయి. కుటుంబంలో అధిక రక్తపోటు ఉన్నవారు ఎవరైనా ఉన్నప్పుడు జన్యుపరంగా వస్తుంది. గుండె వ్యాధులు, మధుమేహం తదితర జబ్బులు అనువంశికత వల్ల వస్తున్నట్లయితే హైపర్‌ టెన్షన్‌ వస్తుంది. 55 ఏళ్లు దాటినవారికి, అధిక బరువు ఉన్నవారికి, క్రియాశీలంగా లేనివారికి, మితిమీరి ధూమపానం, మద్యం సేవించేవారికి అధిక రక్తపోటు వచ్చే అవకాశాలున్నాయి. అంతే కాదు మీరు తీసుకుంటున్న ఆహారంలో రెండు గ్రాములకు మించి ఉప్పు ఉన్నట్లయితే అధిక రక్తపోటుకు కారణం అదే అని చెప్పొచ్చు. బ్రూఫిన్‌, యాస్ప్రిన్‌, మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లయితే వాటి వల్లా అధిక రక్తపోటుకు గురయ్యే ప్రమాదముంది. అనారోగ్యకర ఆహారం, జీవనశైలి వల్లా ఎక్కువ మంది హైపర్‌టెన్షన్‌కి గురవుతున్నారు. స్థూలకాయం, మధుమేహం, ఒత్తిడి, పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం నిల్వలు బాగా తగ్గిపోవడం, శారీరక శ్రమ చేయకపోవడం, ఆల్కాహాల్‌ను ఎక్కువగా సేవించేవారికి అధిక రక్తపోటు సమస్య వస్తోంది. కిడ్నీ వ్యాధుల వల్లా అధిక రక్తపోటు వస్తుంది. గర్భిణీలూ అధిక రక్తపోటుకి గురవుతారు. ఎందుకంటే వారిలో ఈస్ట్రోజన్‌ హార్మోన్లు ఉంటాయి. ఈ హార్మోన్లు గర్భిణీగా ఉన్న సమయంలో ఎక్కువగా విడుదల అవుతుంటాయి. ఇలా హార్మోన్లు ఎక్కువగా విడుదల కావడం వల్ల అధిక రక్తపోటు సమస్యకు గురవుతుంటారు. గర్భనిరోధక మాత్రలు వేసుకోవడం వల్లా అధిక రక్తపోటు ముప్పు వస్తుంది.

ఎలా తెలుసుకోవచ్చు ?
అధిక రక్తపోటుకి కొలమానం ఉంది. స్పిగ్మోమేనోమీటర్‌లో రెండు అంకెలుంటాయి. ఒకటి సిస్టోలిక్‌ ప్రెషర్‌, రెండోది డయాస్టోలిక్‌ ప్రెషర్‌. సిస్టోలిక్‌ ప్రెషర్‌ గుండె కొట్టుకునే వేగాన్ని కొలుస్తుంది. డయాస్టోలిక్‌ ప్రెషర్‌ మాత్రం రక్తనాళాల్లో ఉన్న ఒత్తిడిని కొలుస్తుంది. ఈ రెండూ కొట్టుకోవడానికి మధ్యలోనే గుండె విశ్రాంతి పొందుతుంది. ఎవరికైనా పుట్టినప్పుడు 64/40 ఉన్న రక్తపోటు అంకె పెరిగి, పెద్దయిన తర్వాత 120/80కి చేరుకుంటుంది. ఇది సాధారణ రక్తపోటు. దీనిని డాక్టర్లు 120/80 మెర్క్యురీ మిల్లీ మీటర్లు అని రాస్తారు. ఈ 120 /80లో పై అంకె 120 సిస్టోలిక్‌ ప్రెషర్‌ను కింది అంకె 80 డయాస్టాలిక్‌ ప్రెషర్‌ను సూచిస్తుంది. ఇంతకంటే ఎక్కువగా ఉంటే మాత్రం అధిక రక్తపోటు వచ్చిందని తెలుసుకోవాలి. బ్లడ్‌ ప్రెషర్‌ రీడింగ్‌ 140/90 ఉంటే అధిక రక్తపోటు వచ్చినట్లుగా పరిగణించాలి. కనీసం రెండుసార్లయినా చూడాలి. ఒకవేళ 180/110 కంటే ఎక్కువగా ఉంటే మాత్రం వైద్య చికిత్స అనివార్యమౌతుంది. బీపీ 120/80ని దాటినట్లయితే మీకు ప్రమాదం పొంచి ఉన్నట్టే అని గమనించాలి. వృద్ధులలో 160/90 దాటితే అది అధిక రక్తపోటుగా భావించవచ్చు. అయితే, ఈ రక్తపోటు చిన్న పిల్లలలో తక్కువగా ఉంటుంది. పెద్దలలో సైతం పరిస్థితులను బట్టి మారుతుంది. నిద్రించే సమయంలో తక్కువగా ఆవేశం, భయాందోళనలలో ఉన్నపుడు శ్రమ అధికంగా పడుతున్నపుడు ఎక్కువగా ఉంటుంది. కానీ సాధారణ పరిస్థితుల్లోనూ రక్తపోటు ఎక్కువగా ఉంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా సంబంధిత డాక్టరును సంప్రదించాలి. హైపర్‌టెన్షన్‌ వల్ల మీ గుండె తన సామర్ధ్యాన్ని మించి పనిచేస్తుంది. తీవ్రంగా అలసిపోతుంది. రక్తనాళాలు దెబ్బతింటాయి. ఇది శరీరంలోని ఒక్కో అవయవాన్ని దెబ్బతీస్తుంది. మెదడు, కళ్లు, మూత్రపిండాలు దెబ్బతింటాయి.

చికిత్స
– అధిక రక్తపోటు మొదటి దశలో ఉంటే మందులు వాడడం ద్వారా తగ్గించుకోవచ్చు.
– అధిక రక్తపోటు ఉన్న వారు మందులను నిరంతరం క్రమంగా వేసుకోవాలి.
– కొంతమంది ఒక రకం మందులను, మరికొంతమంది రెండు రకాలు, ఇంకొంతమంది మూడు రకాల మందులను వేసుకోవాల్సి ఉంటుంది.
– చాలా తక్కువ మంది మూడు అంతకంటే ఎక్కువ రకాల మందులను ఉపయోగించాల్సి వస్తుంది.
– ఎక్కువ మందులను ఉపయోగించే వారిలో ఉన్న రక్తపోటును రిఫ్రక్టర్‌ హైపర్‌టెన్షన్‌ అని అంటారు.
– ఒక రకం మందులు ఉపయోగించే రోగుల్లో 50 శాతం మందికి అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.
– రెండు రకాల మందులు వాడే రోగుల్లో 80 శాతం మందికి ఈ వ్యాధి నియంత్రణలోకి వస్తుంది.
– అధిక రక్తపోటు ఉన్న వారికి రాసే మందులను కొన్నిసార్లు మామూలు బీపీ, గుండె జబ్బులు ఉన్నవారికి ఇవ్వాల్సి ఉంటుంది.
– అధిక రక్తపోటు రెండో దశలో ఉంటే ఒక్కోసారి శస్త్రచికిత్స అవసరమవుతుంది.
– శరీరంలో హార్మోన్లు గడ్డలుగా మారితే వాటిని శస్త్రచికిత్స ద్వారా తొలగిస్తారు.
– గర్భిణుల్లో అధిక రక్తపోటు ఉంటే తల్లికి, బిడ్డకు ప్రమాదం కలిగే అవకాశాలు ఉంటాయి. ప్రసవ సమయంలో సమస్యలు ఏర్పడతాయి. వీరికి అన్ని మందులను ఇవ్వలేం. బిడ్డపై ప్రభావం చూపలేని వాటిని మాత్రమే ఇవ్వాలి.

అదుపులో ఉంచాలంటే…?
హైపర్‌ టెన్షన్‌కు కారణమయ్యే అధిక రక్తపోటును అదుపులో ఉంచాలంటే…
– శరీర బరువు పెరగకుండా జాగ్రత్తపడాలి.
– కూరల్లో ఉప్పు తగ్గించాలి.
– నిత్యం ఉదయం గానీ, సాయంత్రం గానీ వ్యాయామం చేయాలి.
– పద్దెనిమిదేళ్ల వయస్సు రాగానే బీపీ పరీక్ష చేయించుకోవాలి.
– ఏ అవసరం కోసం డాక్టర్‌ని సంప్రదించినా తప్పనిసరిగా బీపీని చూపించుకోవాలి.
– నిల్వ చేసిన ఆహారాలకు, ఫాస్ట్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి.
– ప్యాక్‌ చేసిన ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు.
– ఆహారంలో పచ్చళ్ల వాడకాన్ని మానుకోవాలి.
– నిరంతరం శారీరక శ్రమ ఉన్న వాళ్లే పచ్చళ్లను ఆహారంలోకి తీసుకోవచ్చు.
– ఉప్పు లేకుండా మజ్జిగ, పెరుగు తీసుకోవాలి.
– చిరుతిళ్లను పూర్తిగా తగ్గించుకోవాలి.
– ఎప్పటికప్పుడు బీపీని పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి.