20వ శతాబ్దపు హాస్య నటుడు

తిరుగులేని హాస్యానికి కేరాఫ్ రాజబాబు

raja babuతెలుగు చలనచిత్ర రంగంలో రెండు దశాబ్దాలు తిరుగులేని ప్రముఖ హాస్యనటునిగా వెలిగిన రాజబాబు అసలుపేరు పుణ్యమూర్తుల అప్పలరాజు. తెలుగు చలనచిత్రసీమలో ఇరవయ్యో శతాబ్దపు హాస్య నటుడి”గా ప్రసంశలు అందుకొన్న విశిష్ట నటుడు. అక్టోబరు 20, 1935 తేదీన పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం లో పుట్టిన రాజబాబు పూర్తి పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు. తల్లిదండ్రులు పుణ్యమూర్తుల ఉమామహేశ్వర రావు, రవణమ్మ. నిడదవోలు లోని పాఠశాల చదువు చదువుతూనే బుర్రకథ నేర్చుకోవడానికి అచ్యుత రామయ్య గారి దగ్గర చేరాడు. ఇంటర్మీడియట్ పూర్తయిన తరువాత ఉపాధ్యాయ శిక్షణ కోర్సు ముగించి తెలుగు ఉపాధ్యాయుడుగా కొద్దికాలం పనిచేశాడు. ఉపాధ్యాయునిగా పనిచేసేటప్పుడే నాటకాలలో పాలుపంచుకొనే వాడు. రాజబాబుకు డిసెంబరు 5, 1965 తేదీన లక్ష్మీ అమ్ములుతో వివాహం జరిగింది. వారికి నాగేంద్రబాబు, మహేశ్ బాబు అనే ఇద్దరు పిల్లలు పుట్టారు.

సినీ జీవితంలో మొదటి రోజులు
ఒక సారి నాటకంలో రాజబాబును చూసిన గరికపాటి రాజారావు (పుట్టిల్లు సినిమా దర్శకుడు) సినిమాలలో చేరమని ఉత్సాహపరిచాడు. దాంతో చెప్పాపెట్టకుండా ఫిబ్రవరి 7, 1960 రోజున రాజబాబు మద్రాసు చేరుకొన్నాడు. పూట గడవడానికి హాస్యనటుడు అడ్డాల నారాయణరావు పిల్లలకు ప్రైవేటు చెప్పేవాడు. కొన్నాళ్ళ తరువాత అడ్డాల నారాయణరావు రాజబాబుకి సమాజం సినిమాలో అవకాశం కల్పించాడు. మొదటి సినిమా తరువాత “తండ్రులు-కొడుకులు”,”కులగోత్రాలు”,”స్వర్ణగౌరి”,”మంచి మనిషి” తదితర చిత్రాలలో అవకాశాలు వచ్చాయి. స్వర్ణగౌరి చిత్రానికి గాను 350 రూపాయలు మొట్టమొదటి పారితోషికంగా స్వీకరించాడు. మొదటి చిత్రం విడుదల తరువాత వచ్చిన చిన్న చిన్న పాత్రలలో నటిస్తూనే “కుక్కపిల్ల దొరికిందా”, “నాలుగిళ్ళ చావిడి”, “అల్లూరి సీతారామరాజు” మొదలగు నాటకాలు కూడా వేశాడు.

జగపతి ఫిలింస్ వి.బి.రాజేంద్రప్రసాద్ చిత్రం”అంతస్తులు” చ్రిత్రంలో నటించినందుకుగాను మొట్టమొదటి సారిగా Raja Babuactorపెద్దమొత్తం 1300 రూపాయల్ని పారితోషికంగా పొందాడు. తరువాత వెనక్కు తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా వరుసగా ప్రముఖ నిర్మాణ సంస్థలు నిర్మించిన ఎన్నో ప్రముఖ చిత్రాలలో నటించాడు. ఆ సమయంలో ఆకాశరామన్న, సతీ శబరి, ప్రచండ భైరవి, సత్యహరిశ్చంద్ర, సంగీత లక్ష్మి, పరమానందయ్య శిష్యుల కథ, ఉమ్మడి కుటుంబం, విచిత్ర కుటుంబం లాంటి చిత్రాలలో నటించాడు. రాజబాబుకు జంటగా లీలా రాణి, మీనా కుమారి, ప్రసన్న రాణి, గీతాంజలి లాంటి వారు నటించినా, ప్రేక్షకాదరణ పొందిన జోడీ మాత్రం రమాప్రభ అని చెప్పాలి. ఇద్దరు అమ్మాయిలు, ప్రేమనగర్, ఇల్లు ఇల్లాలు, పల్లెటూరి బావ, సెక్రెటరి, జీవన జ్యోతి, కార్తీక దీపం, అడవి రాముడు, సోగ్గాడు లాంటి చిత్రాలు రాజబాబు-రమాప్రభ జోడీకి మంచి హాస్య జంటగా పేరు తెచ్చాయి.

హీరోగా కూడా
రాజబాబు హాస్యపాత్రలతోనే ఆగిపోకుండా తాతా మనవడు, పిచ్చోడి పెళ్ళి, తిరుపతి, ఎవరికి వారే యమునా తీరే, మనిషి రోడ్డున పడ్డాడు లాంటి సినిమాలలో హీరోగా నటించారు. ఈ సినిమాలలో ఎవరికి వారే యమునా తీరే, మనిషి రోడ్డున పడ్డాడు సినిమాలను స్వయంగా బాబ్ & బాబ్ ప్రొడక్షన్స్ అన్న నిర్మాణ సంస్థ పేరుతో నిర్మించారు.

తాత్విక ఆలోచనలున్న నటుడు
rajababu-actor

సినిమాలో ప్రేక్షకులను తన అద్భుత నటనతో కడుపుబ్బ నవ్వింవిన రాజబాబు నిజజీవితంలో గొప్ప తాత్విక ఆలోచనలు గలవాడు. ప్రతి ఒక్క సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా పాతతరం నటుల్ని మరియు నటీమణుల్ని సత్కరించే వాడు. ప్రత్యేకంగా హాస్యంలో తనకు స్పూర్థిని ఇచ్చిన బాలకృష్ణను సత్కరించాడు. రాజబాబుచే సత్కారం పొందిన వారిలో ఇంకా డా.శివరామకృష్ణయ్య, సూర్యకాంతం, సావిత్రి, రేలంగి తదితర ప్రముఖులున్నారు. ఎన్నో సంస్థలకు ఎన్నెన్నో విరాళాలిచ్చిన దాత రాజబాబు. రాజమండ్రిలో చెత్తా చెదారం శుభ్రపరిచే వాళ్ళకు అదే ఊరిలో దానవాయిపేటలో భూమి ఇచ్చాడు. అంతే కాక కోరుకొండలో జూనియర్ కాలేజీ కట్టించాడు. దాని పేరుకూడా ఆయన పేరు మీదే “రాజబాబు జూనియర్ కళాశాల”గా ఉంది.
వరుసగా ఏడు సార్లు ఫిలింఫేర్ అవార్డు పొందిన మొట్టమొదటి హాస్యనటుడు కూడా రాజబాబే. ఆయన జీవితంలో మొత్తం తొమ్మిది ఫిలింమ్ ఫేర్ అవార్డులు, మూడు నంది బహుమతులు, ఎన్నెన్నో అవార్డులు రివార్డులూ పొందాడు. “చెన్నై ఆంధ్రా క్లబ్బు” వారు వరుసగా ఐదు సంవత్సరాలు “రోలింగ్ షీల్డు”ని ప్రధానం చేసారు. అంతే కాక శతాబ్దపు హాస్య నటుడిగా అవార్డు పొందాడు.

మహాకవి శ్రీశ్రీ తో రాజబాబుకు తోడల్లుడి బంధం

with Indira Gandhiతెలుగు సినీమాల్లో హాస్య నటుడిగా ఓ వెలుగు వెలిగిన రాజబాబుకు శ్రీశ్రీకి తోడల్లుడు. ఎలా అంటే .. శ్రీశ్రీ రెండో భార్య సరోజ,రాజబాబు భార్య అమ్ములు ఇద్దరూ అక్కాచెల్లెళ్ళు. శ్రీశ్రీ కష్టాల్లో వున్నప్పుడు రాజబాబు అజ్ఞాత సహాయం చేశాడు.అయితే అది ఏరూపంలో చేసింది తెలీదు.మొత్తానికి చెప్పుకోదగ్గ సాయమే చేయడం మాత్రం నిజం.

రాజబాబు కొత్తగా ఇల్లుకట్టుకొని గృహప్రవేశానికి శ్రీ శ్రీ దంపతుల్ని కూడా పిలిచాడు.గృహ ప్రవేశానికి వెళ్ళే వారు ఏదో ఓ బహుమతి పట్టుకెళ్ళడం ఆనవాయితీ.కానీ బహుమతి కొనడానికి శ్రీ శ్రీ గారి దగ్గర డబ్బులేదు.మరేం చేయాలి.కరెన్సీ అయితే లేదుగానీ..కవిత్వం వుందిగా..ఇంకేం ఓ బక్కపలచని గీతం (రాజబాబు కూడా బక్కగా వుండే వాడు) రాసుకొని తీసుకెళ్ళాడు.అదే పదివేలుగా భావించి కానుకగా ఇచ్చాడు.
ఇంతకూ ఆ గీతం పేరు “కానుక” !!

“రాజబాబు మంచి నటుడు కాబట్టి
రాజబాబు మంచి నరుడు కాబట్టి
రాజబాబు నా తోడల్లుడు కాబట్టి
ఊదుతున్నాను ఈ గేయపు బూరా !!”.

“రాజబాబు గృహ ప్రవేశం చేస్తున్నప్పుడు ఈ
రోజున ఏదో కానుకగా ఇయ్యాలంటే
ఏముంది నా దగ్గర? ఈ ఒక్క
బక్క వపలచని గీతం తప్ప !!”,

*“అగ్ని పర్వతం బద్దలైనప్పుడు
లావా లాగ ప్రవహిస్తూ
ఆకాశం వైపు ప్రవహించే
తారా జువ్వ రాజబాబు “

*”రాజబాబూ నీ మనస్సు
సుమనంపు
కలువపూవు పెదనాన్నా
కాబట్టి దీవిస్తున్నాను

ఇదిగో నా ఆశీస్సు
తమ్ముడూ! రాజబాబు
నీ ఒకే ఆల్ అమ్ములమ్మతో
ఇద్దరే సుపుత్రుళ్ళతో
ఇతోధికంగా వర్థిల్లు
ఇదే నా కానుక
నీ వాళ్ళు వెయ్యేళ్ళు బతకాలి
నీ ఇల్లు వెయ్యిళ్ళు కావాలి
మళ్ళీ కలుద్దాం ఆనక “..

అంతేనా?

*”కాలుతున్న ఈలోకం లోంచి
కనకపుష్యరాగం లాగ లేచిన వాడ
తీసుకో ఈ గీతం అంటున్నాను
వేసుకో ఈ పూల మాల అంటున్నాను”

రాజబాబు తనకు తమ్ముడైనందుకు గర్విస్తున్నానని శ్రీశ్రీ అంటారు.రాజబాబు అంటే శ్రీశ్రీకి గౌరవమే కాదు..ప్రేమ కూడా.with ntrఅందుకే “మండుతున్న ఈ ప్రపంచ జ్వాలల్లో మహా పద్మంలా పూచిన వాడా !” అంటూ ఆకాశానికి ఎత్తేశారు శ్రీ శ్రీ. అంతేకాదు…
“ఈ ప్రపంచపు సుప్రీం కోర్టులో ప్రథమ ముద్దాయిగా నిలబడ్డ తనకు ఉరిశిక్ష తప్పించ డానికి ఒకే ఒక్క సాక్షి రాజబాబంటూ కితాబు కూడా ఇచ్చారు.

శ్రీ శ్రీ ఆంతటి మహాకవి ఆశీర్వదిస్తూ రాసిన ఈ కవిత్వాన్ని రాజబాబు ఎంతో అపురూపంగా దాచుకున్నారట.మహాకవుల అక్షరాలకు వరు వెల కట్టగలరు.శ్రీశ్రీ తనపైన కవిత్వం రాసినందుకు రాజబాబు ఎంతగా ఆనందించి వుండేవారో ఊహించడం పెద్ద కష్టం కాదు.

ఆరోజుల్లో కమెడియన్ గా రాజబాబు సంపాదించినంత డబ్బు హీరోలు కూడా సంపాదించలేదంటే అతిశయోక్తి కాదు.డబ్బుతో పాటు రాజబాబు హృదయమూ పెరిగి, లెక్కలేనన్ని అజ్ఞాత దానాలు చేసి,చివరకు “మనిషి రోడ్డున పడ్డాడు .(మనిషి రోడ్డున పడ్డాడు “పేరుతో తానే హీరోగా నటిస్తూ చిత్రాన్ని నిర్మించారు రాజబాబు.ఈ సినిమా ఆడలేదు సరికదా..రాజబాబుకు భారీగా నష్టాల్ని మిగిల్చింది

చివరిరోజుల్లో
రాజబాబుకు ఘంటసాల పాటలంటే ఎంతో ఇష్టం. మహా శివరాత్రి రోజు మరియు ఘంటసాల వర్ధంతి అయిన ఫిబ్రవరి 11 రోజున మొత్తం ఘంటసాల పాటలు వింటూనే ఉన్నారు. అదే రోజు రాత్రి గొంతులో ఏదో ఇబ్బంది వచ్చి హైదరాబాదు లోని థెరెసా ఆసుపత్రిలో చేరారు. ఆ ఆసుపత్రి లోనే ఫిబ్రవరి 14, 1983 రోజున తెలుగు సినీ అభిమానుల్ని శోక సముద్రంలో ముంచి కాలథర్మం చెందారు . అనుకరించడానికి అసాధ్యమైన ప్రత్యేకమైన శైలి రాజబాబుది. ఆయన మరణంతో తెలుగు చిత్రసీమకు కలిగిన లోటు ఏనాటికీ తీరనిది.

Send a Comment

Your email address will not be published.