సమైక్యతకు పునాదిరాళ్ళు

సమైక్యతకు పునాదిరాళ్ళు

ఆస్ట్రేలియాలోని తెలుగువారందరూ కలిసి ఒకేత్రాటిపై నిలవడానికి అనుకూలమైన పరిణామాలు దుర్ముఖి నామ ఉగాది సందర్భంగా వివిధ పట్టణాల్లో జరిగిన సంబరాల్లో వెల్లువెత్తాయి. అన్ని ముఖ్య పట్టణాలలోనున్న తెలుగు సంఘాలు కలసి ఆస్ట్రేలియా తెలుగు సమాఖ్య స్థాపించాయి. సిడ్నీ, మెల్బోర్న్, కాన్బెర్రా, బ్రిస్బేన్, అడిలైడ్ మరియు పెర్త్ లోనున్న తెలుగు సంఘాలన్నీ సభ్యులుగా ఈ సమాఖ్య స్థాపించడం జరిగింది.

ఆస్ట్రేలియా బహుళ సంస్క్రుతులకు నిలయమన్నది నిర్వివాదాంశం. ఇక్కడున్న ఆస్ట్రేలియేతర సమాజాల్లో భారతీయులు రెండవ స్థానంలో వున్నారు. భారతీయుల్లో తెలుగువారు రెండవ స్థానంలో వుండడం విశేషం. అంకెల్లో చూస్తే తెలుగువారు షుమారు 70-80 వేల మంది ఉంటారని అనధికార అంచనా. ఐదు పదుల దాటిన తెలుగువారి ప్రస్థానం మొదట్లో వైద్య, విద్యా, పరిశోధనా రంగాల్లోని నిష్ణాతులకు పరిమితమైనా 1990 దశకంలో మొదలైన కంప్యూటర్ రంగ నిపుణలతో వలస ఎన్నో రెట్లు పెరిగిందనే చెప్పాలి. ఇప్పుడిప్పుడే వ్యాపార, రాజకీయ రంగాల్లో కొంతమంది అడుగిడడం మరో మెట్టు ఎదిగినట్టే.

ఈ సమాఖ్య ముఖ్య ఉదేశ్యం ఆస్ట్రేలియాలో నున్న తెలుగు వారినందరినీ ఒకే వేదిక మీదికి తీసుకురావడం మరియు మన తెలుగు సమాజాన్ని ఆస్ట్రేలియా జన జీవన స్రవంతిలో మమేకం చేయడం. ఆస్ట్రేలియా యొక్క విశిష్టత బహు సంస్కృతుల వారు కలసి మెలసి జీవించడం. రాజకీయ, భౌగోళిక పరిస్థితులకు అతీతంగా భాషా సంస్కృతుల పరంగా ఒకటైన మన తెలుగు వారినందరినీ విభిన్న సంప్రదాయాలను గౌరవిస్తూ సామరస్య వాతావరణంలో ముందుకు వెళ్ళడమే ఈ సమాఖ్య ఉదేశ్యం.

ఆస్ట్రేలియా తెలుగు సమాఖ్య ప్రధమ కర్తవ్యం తెలుగు భాషను ఆస్ట్రేలియా కమ్యూనిటీ భాషగా గుర్తింపు తీసుకురావటం . ప్రస్తుతం భారతీయ భాషలలో హిందీ, తమిళ్, పంజాబీ మాత్రమే ఈ గుర్తింపు పొందాయి. ఇది జరిగితే తెలుగు అనువాదకులు ప్రతి ప్రభుత్వ సేవకి ఉపయోగించడం జరుగుతుంది. ఆంగ్ల భాష రాని మన తల్లి తండ్రులకు ఆస్ట్రేలియాలోని పలుచోట్ల విమానాశ్రయం నుండి వైద్య సేవల వరకు భాషా పరంగా వున్న ఇబ్బందులు తొలగిపోతాయి. మరియు తెలుగు అనువాదకుల పరీక్ష పాసయితే వారికి పెర్మనెంట్ రెసిడెంట్ దరఖాస్తులో 5 పాయింట్లు ఉచితంగా ఇవ్వబడతాయి. ప్రస్తుతం తెలుగు లో నున్న ప్రతులు ఆస్ట్రేలియాలో న్యాయపరంగా గుర్తించబడక పోవడానికి కారణం సాధికార అనువాదకులు లేకపోవడమే. తెలుగు భాష కమ్యూనిటీ భాషగా గుర్తించబడితే ఈ పరిస్థితి తొలగిపోతుంది.

ప్రస్తుతం భారత ఆస్ట్రేలియా సంభందాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. చాలా వ్యాపార అవకాశాలు ఇంటి ముంగిట తొంగి చూస్తున్నాయి. ఆస్ట్రేలియాలోని తెలుగు సమాజం ఈ అవకాశాలను బాగా ఉపయోగించుకోవాలి అంటే దానికొక బలమైన వేదిక అవసరము. ఈ సమాఖ్య తెలుగు వ్యాపారస్తులనందరినీ కలిపే అవకాశాలను కల్పించేందుకు పని చేస్తుంది.

ఆస్ట్రేలియాలో స్థిరపడిన తెలుగు వారు వృద్దాప్యంలో కలిసి మెలసి జీవించేందుకు వారికి సరియైన తెలుగు గ్రామాలు నిర్మించాలి. వృద్దాప్యంలో మతిమరుపు వస్తే మాతృ భాష మాత్రమే గుర్తుంటుంది. మిగిలిన భాషలు మర్చిపోతారు. అటువంటప్పుడు ఈ గ్రామాలు మన పెద్దలందరూ ఒకేచోట సంతోషంగా సహజీవనం చేయడానికి ఉపయోగపడతాయి. తెలుగు సమాఖ్య యొక్క ముఖ్యమైన లక్ష్యం ఆస్ట్రేలియాలోని అన్ని నగరాల్లో ఈ గ్రామాలు నిర్మించడానికి కృషి చేయడం.

సమాఖ్య మరొక ఉదేశ్యం కమ్యూనిటీలో అత్యవసర పరిస్థితిలో ఉన్నవారిని, కొత్తగా వచ్చే విద్యార్థులను మరియు క్రొత్తగా వచ్చిన కుటుంబాలు నిలద్రోక్కుకునే వరకు ఆదుకోవటం.

ఆస్ట్రేలియాలో నున్న తెలుగు వారందరు నిష్ణాతులైన కళాకారులను తీసుకువచ్చి వారితో మన సంస్కృతీ సాంప్రదాయ కార్యక్రమాలను నిర్వహించి భావితరాల వారికి తరతరాల మన పరంపరను అందివ్వడానికి ఎన్నో విధాలుగా తెలుగు సమాఖ్య కృషి చేస్తుంది.
తెలుగు పిల్లలకు మన విలువలు మరియు భాష నేర్పేందుకు ప్రతి నగరంలోనూ తెలుగు బడి ఉన్నది. ఈ సమాఖ్య ద్వారా అన్ని సంస్థలు కలసి పాఠ్యంశాలు తాయారు చేసుకోవడానికి తోడ్పడుతుంది.

ఆస్ట్రేలియా తెలుగు సమాఖ్య ప్రారంభోత్సవాలు అన్ని ఆస్ట్రేలియా నగరాలలో పెద్ద ఎత్తున జరిగాయి. ఆస్ట్రేలియాలో తెలుగు వారి ప్రస్థానానికి మరుపు రాని రోజు కావాలని ఇది మనకొక చరిత్రగా నిలవాలని ఆకాంక్షిస్తూ ఆస్ట్రేలియా తెలుగు సమాఖ్య ఆస్ట్రేలియాలోనున్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటుంది. మరిన్ని వివరాలకు www.ftaa.org.au చూడగలరు.

Signature200px

 

Send a Comment

Your email address will not be published.