మళ్ళీ ఆ సమయం ఆసన్నమైంది

మళ్ళీ ఆ సమయం ఆసన్నమైంది

మళ్ళీ ఆ సమయం ఆసన్నమైంది.
ఐదేళ్ళ క్రితం ఆస్ట్రేలియాలో తెలుగువారి ఉనికి ప్రశ్నార్ధకమై మనకి ఒక సవాలు విసిరింది. దానికి జవాబుగా అందరికీ ‘తెలుగు’ మాతృభాషగా (2016 గణాంకాలలో – Census) వ్రాయాలని వివిధ మాధ్యమాల ద్వారా తెలియజేసి మన స్థానాన్ని నిలబెట్టుకున్నాము. 2011 అధికార గణాంకాల ప్రకారం ఆస్ట్రేలియాలో తెలుగు మాతృ భాషగా గలవారు సుమారు 7,400 ఉండగా 2016 గణాంకాలలో అది గణనీయంగా 34,435కి (సుమారు 5 రెట్లు) పెరిగింది. దెబ్బతిన్న బెబ్బులి నిదానంగా అలోచించి సమస్యను ఎలా అధిగమించాలని పరిష్కారం వైపు ఆచి తూచి అడుగులు వేసి విజయాన్ని సాధించినట్లే FTAA (Federation of Telugu Associations in Australia) చాలా జాగ్రత్తగా మన తెలుగు వారందరినీ సమాయత్తపరచి విజయ పథం వైపు నడిపించింది. అయితే అప్పుడు సమయాభావం వలన మనవారందరికీ సందేశాన్ని అందించడం జరగలేదు.

NAATI గుర్తింపు
తెలుగు మాతృ భాషగా ఉన్నవారి సంఖ్య గణనీయంగా పెరగడం వలన ముఖ్యంగా NAATI (National Accreditation Authority for Translators and Interpreters) తెలుగు భాషను సామాజిక భాషగా గుర్తించింది. ఇందుమూలంగా ఆస్ట్రేలియా పెర్మనెంట్ రెసిడెన్సీ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకున్న వారు NAATI నిర్వహించే CCL (Credentialed Community Language) పరీక్షలో ఉత్తీర్ణత పొందితే ఉచితంగా 5 పాయింట్లు లభిస్తాయి. గత ఆరు నెలలుగా నిర్వహించిన CCL పరీక్షలకు అభ్యర్ధులు వేల సంఖ్యలో హాజరయ్యారు. ఇప్పటి వరకూ మన తెలుగు విద్యార్ధులు “తెలుగు” CCL పట్టికలో లేకపోవడం వలన హిందీ మరియు ఇతర భాషల్లో పరీక్షలు వ్రాసేవారు. ఇప్పుడు ఆ కొరత తీరింది.

ఇప్పుడు అనువాదకారులు మరియు బాష్యకారులు (Translators and Interpreters) కోసం ఎక్కువ గిరాకీ కూడా పెరిగింది. ఇలా భాషాపరంగా ఎన్నో లాభాలు కలిగాయి. మన తెలుగు భాష ఆస్ట్రేలియా బడులలో ఇతర సామాజిక భాషలలాగానే బోధిస్తే మన పిల్లలు అక్కడే తెలుగు నేర్చుకోవచ్చన్న ఆలోచనతో ముందు అడుగులు వేయడం కూడా జరుగుతుంది.

ప్రపంచంలో మొదటి దేశం ఆస్ట్రేలియా

ప్రపంచ దేశాలలో ఈ విధమైన గుర్తింపు ఎక్కడా ఉన్న దాఖలాలు లేవు. ఆస్ట్రేలియాలోనే ఈ విధమైన తెలుగు భాషకు గుర్తింపు ఇవ్వడం ద్వారా తన బహుళ సంస్కృతీ సంప్రదాయాన్ని చాటుకుంది.

మరో అవకాశం
ఇప్పుడు మళ్ళీ మరో సువర్ణావకాశం మన ముంగిట తొంగి చూస్తోంది. ఈ సంవత్సరం 2021 ఆగష్టు 10వ తేదీన మళ్ళీ ఆస్ట్రేలియా సార్వత్రిక గణాంకాలు జరగనున్నాయి. తెలుగు భాష మాట్లాడేవారు సుమారు 80,000 – 100,000 మంది ఉంటారని అనధికార అంచనా. అయితే ఈ విషయం ఋజువు చేసుకోవడానికి ఈ అవకాశాన్ని అందరమూ సద్వినియోగం చేసుకుని census పత్రంలో తెలుగు మాతృభాషగా అందరూ వ్రాయాలని మనవి.

Send a Comment

Your email address will not be published.