గత ఆరేళ్ళుగా ఎంతోమంది నిర్విరామ కృషికి ఫలితం. భావితరాల భవితకు సుగమమైన మార్గం. బహుళ సంస్కృతీ సాంప్రదాయాలకు పట్టం గట్టే ఆస్ట్రేలియా దేశంలో నివసించాలన్న తెలుగువారి ఆశావాదానికి పర్వదినం. ఎంతోమంది విద్యార్ధుల కలల సాకారానికి అవకాశం. ఆస్ట్రేలియాలో తెలుగుతల్లికి నీరాజనం.
2014 – నాందీ వాచకం
అప్పట్లో సామాజిక (Community) భాష అంటే ఏమిటో అంత పెద్దగా అవగాహన లేదు. కానీ అక్కడక్కడా ఈ పదం వినిపిస్తూ ఉండింది. ఇది ఎందుకు? దీని అవసరం ఏమిటి? అని కొంత పరిశోధన చేసి కాన్బెర్రా (ఆస్ట్రేలియా రాజధాని) వాస్తవ్యులు, శ్రీ కృష్ణ నడింపల్లి గారు (ఆ సమయానికి కాన్బెర్రా తెలుగు సంఘం అధ్యక్షులు కూడాను) కొంత అరా తీసి సేకరించిన వివరాల ప్రకారం కమ్యూనిటీ భాషగా గుర్తింపు రావడం వలన ఈ క్రింద నుదహరించిన కొన్ని ముఖ్యమైన లాభాలు ఉన్నాయని గ్రహించడం జరిగింది.
- శాశ్వత నివాసం కోసం పాయింట్ల పద్ధతి ద్వారా దరఖాస్తు చేసుకునే వారికి ఉచితంగా 5 పాయింట్లు ఇవ్వడం
- ఆస్ట్రేలియాలోని బడులలో తెలుగు భాషను బోధనా భాషగా చేర్చే అవకాశం ఉంటుందన్న ఆశాభావం
- ఇక్కడ తెలుగు పిల్లలకు మన భాష ప్రభుత్వ బడులలోనే నేర్చుకునే అవకాశం
- తద్వారా తెలుగువారికి ఉద్యోగావకాశాలు పెరగడం
- తెలుగు అనువాదకులు మరియు భాష్యకారులకు ఉద్యోగావకాశాలు కలుగుతాయన్న ఆశాభావం
- అవసరమైన చోట్ల (ఎయిర్పోర్ట్, వైద్యశాలలు, న్యాయ స్థానాలు) అనువాదకులు మరియు భాష్యకారుల సేవలు కల్పించడం
అప్పటికి హిందీ, పంజాబీ మరియు తమిళ భారతీయ భాషలు మాత్రమే సామాజిక భాషలుగా ఉన్నాయి. భారతీయుల్లో హిందీ, పంజాబీ తరువాత తెలుగు మాట్లాడే వారు మూడవ స్థానంలో ఉన్నా మన భాష సామజిక భాషగా గుర్తింపు పొందలేదన్న ఒకింత బాధ చాలా మందిలో ఉండేది.
అయితే ముందుగా మన భాష ఔన్నత్యాన్ని, చరిత్రను మరియు దీనిని సామాజిక భాషగా గుర్తించాలన్న ఆవశ్యకతను ఆధారంగా ఒక దరఖాస్తును కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది.
ప్రభుత్వ పరంగా అప్పటి కేంద్ర ఇమ్మిగ్రేషన్ శాఖామాత్యులు సానుకూలంగా స్పందించి NAATI (National Accreditation Authority for Translators and Interpreters) వారికి సిఫార్సు చేసారు. అయితే 2011 ప్రభుత్వ గణాంకాల లెక్కల ప్రకారం తెలుగు వారు 7,400 జనాభా కంటె తక్కువగా ఉండడం వలన ఆ విజ్ఞాపనను తిరస్కరించడం జరిగింది.
ఆస్ట్రేలియా తెలుగు సమాఖ్య (FTAA – Federation of Telugu Associations in Australia)ఆవిర్భావం:
NAATI వారి నిర్ణయాన్ని పునఃసమీక్షింఛి ఒక సవాలుగా తీసుకొని ఆస్ట్రేలియాలోని తెలుగు సంఘాలన్నీ కలిసి సమాఖ్యగా ఏర్పడి ఒక ఉద్యమ రూపంలో ఈ విషయాన్ని ముందుకు నడిపించాలని అన్ని ముఖ్య నగరాలలోని ముఖ్య పట్టణాల్లోని ప్రధాన తెలుగు సంఘాల ప్రతినిధులతో సంప్రదించి “ఆస్ట్రేలియా తెలుగు సమాఖ్య” స్థాపించడం జరిగింది. అన్ని తెలుగు సంఘాల ప్రతినిధులు కార్యాచరణ పథకాలతో తమ పరిధిలోని స్థానిక పార్లమెంటు సభ్యులను సంప్రదించి తెలుగు భాషను సామాజిక భాషగా గుర్తించాల్సిన ఆవశ్యకతను వివరించారు.
2016లో నిర్వహించిన Census లో తెలుగు మాట్లడేవారందరూ తమ మాతృ భాషగా తెలుగును నమోదు చేయాలని సామాజిక మాధ్యమాల ద్వారా ఉధృతమైన ప్రచారం చేయడం జరిగింది. దీని పర్యవసానంగా 2011లో ఉన్న 7,400 సంఖ్య గణనీయంగా సుమారు 36,000 కు పెరిగింది. ఆ సందేశం అందరికీ తగిన సమయంలో చేరలేకపోవడం మూలంగా ఈ సంఖ్య వాస్తవానికి దగ్గరగా లేదు. అనధికార లెక్కల ప్రకారం తెలుగు మాట్లాడే వారు ఆస్ట్రేలియాలో 80,000కి పైగా ఉంటారని అంచనా. నిజానికి రెండు ముఖ్య రాష్ట్రాలు న్యూ సౌత్ వేల్స్ మరియు విక్టోరియా రాష్ట్రాలలోనే 80,000 ఉండవచ్చని ఒక అంచనా.
వచ్చే సంవత్సరం జరగనున్న సార్వత్రిక గణాంకాల (Census)లో అందరూ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని “తెలుగు” మాతృ భాషగా నమోదు చేసుకోవాలని మరోసారి తెలుగు వారందరికీ FTAA మనవి చేసుకుంటుంది.
ప్రపంచంలో మొదటి దేశం ఆస్ట్రేలియా
ప్రపంచ దేశాలలో ఈ విధమైన గుర్తింపు ఎక్కడా ఉన్న దాఖలాలు లేవు. ఆస్ట్రేలియా ఈ విధమైన తెలుగు భాషకు గుర్తింపు ఇవ్వడం ద్వారా తన బహుళ సంస్కృతీ సంప్రదాయాన్ని చాటుకుంది.
గత రెండేళ్లుగా NAATI (National Accreditation Authority for Translators and Interpreters) తో FTAA సభ్యులు సంప్రదింపులు జరిపి ఈ ప్రక్రియలో భాగస్తులై విజయం సాధించారు. ఇందులో కృషి చేసిన వారిలో డా. కృష్ణ నడింపల్లి (కాన్బెర్రా), శ్రీ ఆదిరెడ్డి యారా(అడిలైడ్), శ్రీ శ్యాం అంబటి (పెర్త్), శ్రీ గోపాల్ తంగిరాల (మెల్బోర్న్), శ్రీ శివ శంకర్ పెద్దిభొట్ల (సిడ్నీ), శ్రీమతి వాణి మోటమర్రి (సిడ్నీ) గారున్నారు.
ఇప్పటి వరకూ మన తెలుగు విద్యార్ధులు “తెలుగు” CCL పట్టికలో లేకపోవడం వలన హిందీ మరియు ఇతర భాషల్లో పరీక్షలు వ్రాస్తున్నారు. ఇప్పుడు ఆ కొరత తీరింది. అందరూ ఈ అందివచ్చిన అవకాశం ఉపయోగించుకోవాలని తెలుగుమల్లి కోరుతుంది. ఆస్ట్రేలియలోనున్న తెలుగువారందరికీ ఈరోజు ఒక పర్వ దినం.
భారత దేశం బయట “తెలుగు” భాషను జాతీయ స్థాయిలో గుర్తించిన మొదటి దేశం ఆస్ట్రేలియా. ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్న ఈ సమున్నతమైన ఘట్టానికి తెలుగు సంఘాలు, ప్రతినిధులు మరియు తెలుగువారందరూ హర్షాతిరేకాలు వ్యక్త పరుస్తున్నారు.