కావ్యేషు నాటకం రమ్యం

నాటక రంగానికి పెద్ద పీట.

ఒకప్పుడు పద్య నాటకాలు తరువాత సాంఘిక నాటకాలకి ఆంద్ర దేశం పుట్టినిల్లు.  దసరా, సంక్రాంతి, ఉగాది ఇత్యాది పండగలొస్తే నాటకాల సందడి.  ఏ నాటకాలు వేయాలి, ఎవరిని పిలవాలి, వారు అందుబాటులో ఉన్నారో లేదో అని కనీసం మూడు నెలల ముందు నుండే అందరినీ సంప్రదించి ఏవీ అందుబాటులో లేకపోతే బుర్ర కథ, హరి కథ, సంగీత కచేరీలు ఇలా ఎంతో ప్రాచుర్యం పొందిన నాటక కళకిప్పుడు కల తప్పింది.  ఒకప్పుడు ఎంతో ఉత్కృష్టమైన స్థితిలోకి ఉండి  మహోన్నతమైన వ్యక్తులు పోషించిన ఈ నాటక రంగం ఇప్పుడు దీనస్థితికి చేరుకుంది.  పట్టించుకునే నాథుడు లేడు.  ఆ కళని నమ్ముకున్న వారు బ్రతుకు తెరువు లేక ప్రక్క దారులు పడుతున్నారు.

తెలుగు భాషాభివృద్ధికి సేవ చేయాలనుకునే వారు నాటక రంగం కూడా ఒక ప్రక్రియని గుర్తించాలి.  నాటకం అనేది ఒక శ్రవణ సహిత దృశ్య రూపకం.  ఈ కాలంలో రంగస్థల నాటకాలు ఎవరు చూస్తారులేనని చాలా మంది అంటూ ఉంటారు.  ఇది సబబు కాదు, ఎందుకంటే సరైన ఇతివృత్తం తీసుకొని మంచి కథాంశం ఉంటే చూసేవారు కోకొల్లలు.  దీనికి మంచి ఉదాహరణ – తెలుగుమల్లి మరియు భువన విజయం నిర్వహించిన నాటకాలు “శ్రీకృష్ణ రాయబారము” మరియు “శ్రీ పార్వతీ కల్యాణము” (తెలుగుమల్లి యూ ట్యూబ్ ఛానల్ ).  ఈ నాటకాలు చూడడానికి ఆస్ట్రేలియాలో అంతర్రాష్ట్రాల నుండి కూడా వచ్చారు.  మెల్బోర్న్ నగరంలో ఇప్పటికీ చాలా మంది తదుపరి నాటకం ఎప్పడని అడుగుతూ ఉంటారు.

భారతదేశంలో తరతరాలుగా ప్రత్యేకంగా నాటక రంగానికే అంకితమై సుమారు 135 ఏళ్ల చరిత్ర కలిగిన సురభి నాటక సంస్థలు ఈ మధ్య కాలంలో కోవిడ్ పుణ్యమాని పూట భోజనాలకు కూడా అల్లాడే పరిస్థితి ఏర్పడింది.  అయితే చాలామంది ప్రవాసులు వీరిని ఆదుకోవాలన్న సంకల్పంతో కొన్ని ప్రత్యక్షంగానూ, కొన్ని ముందుగానే రికార్డు చేయబడిన నాటకాలు వేయించి సహాయసహకారాలందిస్తున్నారు.  ఇదెంతో ముదావహం.  అయితే వారి నుండి స్పూర్తి పొంది మనం కూడా ఇక్కడ రంగస్థల నాటకాలు వేస్తే బాగుంటుంది.  భావితరాలవారికి దీని అవసరం గురించి వివరించి వారికి మంచి అవగాహన కల్పించాలి.  భాష, సంస్కృతీ మన ఆచార సాంప్రదాయాలతో ముడిపడి ఉంటాయన్నది వారికి తెలియపరచే బాధ్యత ముమ్మాటికీ మనదే.

ఈ ప్రక్రియ ముందు తరాల వారికి అందజేయాలంటే పిల్లల్లో సృజనాత్మకత పెంపొందించాలి.  వారికి నాటకాలు మన సంస్కృతిలో ఒక భాగమని చెప్పాలి.  వారిని కూడా ఈ ప్రక్రియలో భాగం చేయగలగాలి.  ఇక్కడి ఇతర స్థానిక సంస్థలను కూడా పిలిచి మన సంస్క్రుతిలోనున్న ఈ ప్రక్రియలను వారికి తెలియపరచాలి.

ఈ పంథాలో భాగంగా ఈ సంవత్సరం ఉత్తర అమెరికా సంస్థ iBAM వారు నిర్వహించిన భాగవత పద్యాల పోటీలను పిల్లలకు నిర్వహించడం జరిగింది.    ఈ పోటీలో ఆస్ట్రేలియా నుండి 45 మంది మరియు న్యూ జిలాండ్ నుండి 23 మంది పిల్లలు పాల్గొన్నారు.  వచ్చే సంవత్సరం ఈ పోటీలకు మరెంతో మంది స్పూర్తి పొందిన పిల్లలు ఇప్పుడే శిక్షణ పొందుతున్నారు.    పిల్లల్లో సృజనాత్మకత పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలి.  వారికి తగినన్ని అవకాశాలు కల్పించాలి.  మన ఉనికిని కాపాడుకోవడం కోసం పిల్లలను తదుపరి సారధ్య బాధ్యతలు చేపట్టడానికి ప్రోత్సహించాలి.

Scroll to Top