నాలుగు వసంతాల నవ యవ్వన ప్రాయంలో ప్రపంచంలోని నలుదిశలా వెలుగులీనుతున్న తెలంగాణం మెల్బోర్న్ నగరంలోని తెలంగాణా ఫోరం అధ్వర్యంలో రాష్ట్రావతరణ దినోత్సవం కనులపండువుగా జరుపుకొని అమరవీరులకు నివాళులర్పించింది. రైతే రాజుగా పరిగణించి వేల సంవత్సరాల మన ఊరి సంగతులు ముచ్చటించుకోవడానికి మంచి అవకాశం కల్పించి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేసే పలు పధకాలను అమలుపరచడంతో భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు తెలంగాణాని ఆదర్శప్రాయంగా తీసుకొని వాటిని అమలుచేయడం ఎంతో ముదావహం. ఉద్యమమే స్పూర్తిగా తీసుకొని అహర్నిశలు తన జీవితాన్ని తెలంగాణా ప్రజల అభివృద్ధికి అంకితం చేసిన ఆచార్య జయశంకర్ గారికి ఘన నివాళితో ప్రారంభమైన కార్యక్రమం పలు సాంస్కృతిక కార్యక్రమాలతో కొనసాగి విందు భోజనంతో ముగిసింది.
మెల్బోర్న్ తెలంగాణా ప్రస్థానం…
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమునకు ముందే ఉద్యమ సమయములో స్థాపించిన మెల్బోర్న్ తెలంగాణ ఫోరమ్ ఈ ఏడాది ఆరవ వసంతములోకి అడుగు పెడుతుంది. తెలంగాణ సంస్కృతిని, భాష, యాసని, దాయత్వాన్ని, సాహిత్యాన్ని, మరియు తెలంగాణ విలువలను మెల్బోర్న్ లో ప్రోత్సహించవలనన్న ముఖ్య ఉద్దేశంతో 2013 లో స్థాపించడం జరిగింది.
సమాజ సేవలో…
ఇప్పటివరకు ఎనిమిది రక్త దాన కార్యక్రమములద్వారా సుమారు 225 ప్రాణాలను కాపాడటంలో సహాయం అందించింది. ఈ సంవత్సరముతో కలుపుకొని నాలుగు అంతర్జాతీయ మహిళా దినోత్సవాలను MTF మహిళా విభాగం నిర్వహించడమే కాకుండా విరాళాలను సేకరించి McGrath ఫౌండేషన్ మరియు Serve Needy NGO లకు సహాయం అందించడం జరిగింది
అభివివక్త కవలల శస్త్రచికిత్సకు రాయల్ చిల్డ్రన్ హాస్పిటల్, ఆస్ట్రేలియన్ మెడికల్ అస్సోసియన్ మరియు తెలంగాణ ప్రభుత్వముతో సంయుక్త ప్రయత్నాలు చేయడం జరిగింది.
2016 లో రాయల్ చిల్డ్రన్ హాస్పిటల్ కి గుడ్ ఫ్రైడే అప్పీల్ ద్వారా సుమారు 2800 డాలర్స్ ను విరాళాల ద్వారా సహాయం చీయడం జరిగింది. ఈ ఏడాది మెల్బోర్న్ లో ప్రమాదవశాత్తు గాయపడిన ఇద్దరు తెలంగాణ విద్యార్థులకు వైద్య సహకారాలు అందించడములో ఎంతగానో తోడ్పడింది.
ముఖ్యంగా ఈ ఏడాది తెలంగాణ నుండి వచ్చిన అమ్మాయికి ప్రాణాపాయమునుండి రక్షించడానికి Monash హాస్పిటల్ తో పనిచేయడంతో పాటు సుమారు ౩౩,౦౦౦ డాలర్స్ ను గో ఫండ్ ద్వారా నిధులు సేకరించి అమ్మాయి సర్జరీ కి సహాయం చేయడం, ఈ విషయములో తెలంగాణ ప్రభుత్వ ఐటీ మినిస్టర్ శ్రీ కేటీర్ గారు మరియు ఇండియన్ కాన్సులెట్ జనరల్ శ్రీ రాకేష్ మల్హోత్రా గారు MTF ని ప్రత్యేకముగా అభినందించడం ఎంతో గర్వించ దగ్గ విషయం
‘బతుకమ్మ’ కు గుర్తింపు…
ఇవే కాకుండా తెలంగాణ రాష్ట్ర పండుగ ‘బతుకమ్మ’ ను గత ఐదు ఏండ్లుగా మెల్బోర్న్ లో అంగరంగ వైభవముగా నిర్వహించి స్థానికంగా ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో ఎంతో కృషి చేయడం జరిగింది.
ఈ సందర్భంగా వచ్చే బతుకమ్మ పండగ పోస్టర్ ని విడుదల చేసారు. ఈ సారి మెల్బోర్న్ లో మూడు వారాలు (సెప్టెంబర్ 23 నుండి అక్టోబర్ 13 వరకు) బతుకమ్మ పండగ నిర్వహించాలని ఉవ్విళ్ళూరుతున్నారు.