తెలుగు ప్రశస్తి

ఏ దేశమేగినా ఎందు కాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవరెదురయిన
పొగడరా నీతల్లి భూమిభారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము(రాయప్రోలు సుబ్బారావు)

”చేయెత్తి జైకొట్టు తెలుగోడా! గతమెంతో ఘన కీర్తి కలవాడా!” (వేములపల్లి శ్రీకృష్ణ) అని కవులు తెలుగువారి గతప్రశస్తిని గానం చేశారు. విలక్షణసమ్మేళనం, జీవన వైవిధ్యం గల భారతదేశంలో తెలుగువారి ప్రత్యేకత తెలుగువారిదే. మూడువేల సంవత్సరాల ప్రౌఢ సంస్కృతీ పరిపాకం మనది. ఐతరేయ బ్రాహ్మణం మొదలు రామాయణ భారత భాగవతాలు, గాథాసప్తశతి వంటి ప్రాచీన గ్రంథాల్లోను తెలుగువారి చరిత్ర అక్షరమై అలరారుతున్నది.

క్రీ.శ.6వ శతాబ్దినుండి గద్యశాసనాలు, 9వ శతాబ్దం నుండి పద్యశాసనాలు (పండరంగని అద్దంకి శాసనం, క్రీ.శ. 848), ఆదికవి నన్నయ్యతో మొదలైన కావ్య రచనలు తెలుగుభాష తేటదనానికి మచ్చుతునకలు.

వ్యపసాయ సంస్కృతితో ముడిపడిన వినాయకచవితి, సంక్రాంతి మొదలైన పండుగలు, ద్రావిడ గ్రామీణ నాగరికతను తెలిపే కొలుపులు, జాతరలు ఇక్కడి ప్రజల సామూహిక జీవనోత్సవాన్ని ప్రతిబింబిస్తున్నాయి. కట్టు, బొట్టు, మాట యాస – అన్నిటిలో తెలుగువారిది వెలుగు దారి.

తోలుబొమ్మలాట, కోలాటం, యక్షగానం, బుర్రకథ మొదలైన జానపద కళలెన్నో ఈ నేలపై వర్ధిల్లాయి. అమరావతి, లేపాక్షి, రామప్పగుడి, శ్రీకాళహస్తి, మొదలైన క్షేత్రాల్లో మన శిల్పకళా విన్యాసం కన్పిస్తుంది. అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య వంటి వాగ్గేయ కారులు సంగీత సాహిత్య సమర్చన చేశారు.

ఇంత సంపద్వంతమైన తెలుగు సంస్కృతి ప్రస్తుత పరిస్థితి ఏమిటని ఆలోచిస్తే విచారం కలుగుతుంది. పాశ్చాత్యనాగరికత ఈ నేలమీదకి ఊడలు దిగుతున్నది. ప్రపంచీకరణ ప్రభావం తెలుగుదనాన్ని రాహువులా కబళిస్తున్నది.
ముక్కుపచ్చలారని బాలబాలికలు పరాయి స్వరాలకు నాట్యమాడుతున్నారు. తెలుగులో మాట్లాడటమే చిన్నతనమైంది. ఇదే పరిస్థితి కొనసాగితే అనతికాలంలోనే తెలుగుసంస్కృతి అనేమాట పుస్తకాల్లోనే మిగిలిపోయే ప్రమాదం పొంచి ఉంది.

తెలుగుబాసను జుంటితేనె యని తెగ పొగడి, పొరుగింటి పులుపుపై మరులు పెంచినవాడు
దేశభాషలలోన తెలుగు లెస్సని చాటి, మల్లెలకు బదులు లిల్లీలు వలచినవాడు
ఎవడయ్య ఎవడు వాడు, ఇంకెవడయ్య తెలుగువాడు (డా. సి.నారాయణ రెడ్డి)

Send a Comment

Your email address will not be published.