ఐదు దశాబ్దాల ఐకమత్యం

 
ఆంధ్రులు అనండి! రాయలసీమ వాసులు అనండి ! తెలంగాణ ప్రజలు అనండి ! వీరంతా తెలుగు జాతికి చెందిన
వారే. వీరందరూ మాట్లాడే భాష కూడా తెలుగే. అందువల్ల తెలుగు వాళ్ళు ఎక్కడున్నావాళ్ళందరూ తెలుగు వారే.
మన దేశానికి స్వాతంత్ర్యం రాకముందు తెలుగువాళ్ళకంటూ ఒక ప్రాంతం వుండేది కాదు. కాని 1956 లో ఈ మూడు ప్రాంతాలని కలుపుతూ సమైక్య ‘ఆంధ్ర ప్రదేశ్’ తెలుగు రాష్ట్రం ఏర్పడింది.

స్వాతంత్ర్యం వచ్చాక కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొన్ని జిల్లాలు నాటి మద్రాసు రాష్ట్రంలోనూ, ఒరిస్సాలోనూ
వుండగా రాయల సీమ ప్రాంతాలు కొన్ని మైసూరు రాష్ట్రంలో వుండేవి. కాని అప్పటికే నిజం నవాబు లొంగుబాటు
ద్వారా ఆవిర్భవించిన హైదరాబాద్ వుండేది. అదే నేటి తెలంగాణగా పిలువబడుతోంది. నాటి హైదరాబాద్ రాష్ట్రం
కూడా ప్రత్యేక తెలంగాణ కాదు. అందులో అప్పటి తెలంగాణా జిల్లాలతో బాటుగా నేటి మహారాష్ట్రకి చెందిన కొన్ని
జిల్లాలు వుండేవి. ఆ తర్వాత 1953’లో తమిళనాడు నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది . ఆ రాష్ట్రానికి
కర్నూలు రాజధానిగా వుండేది. 1956’లో ఆ రాష్ట్రం నేటి ఆంధ్ర ప్రదేశ్’లో విలీనం చేయబడింది.

1969’లో తెలంగాణా ఉద్యమం తలెత్తింది. చెన్నారెడ్డి దానిని ఉవ్వెత్తున లేవనెత్తినా ఆ ఉప్పెన ఆయన కాలంలోనే అడుగంటి పోయింది. ఆ తర్వాత కేసిఆర్’తో మళ్లీ మొదలైంది. అప్పటి నుంచి ఆ యుద్ధం కొనసాగుతూనే వుంది.
ఆ గొడవ అలా సాగుతూనే వుండగా ఈ మధ్య కాలంలో మళ్ళీ సమైక్యాంధ్ర నినాదం వినిపిస్తోంది. చివరికి ఏం
జరుగుతుందో ఎవరూ ఊహించలేని స్థితిలోవుంది మన రాష్ట్రం.

చరిత్ర పరంగా కానీ, సంస్కృతీ పరంగా కానీ ఆంధ్రులు – తెలంగాణా వారు కలిసిమెలసి వున్న దాఖలాలు లేవు.
ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడకముందు మాత్రం అన్య రాష్ట్రాల అజమాయిషీలో వున్న తెలుగు వారికి సొంత తెలుగు రాష్ట్రం కావాలన్న కలల జీవనం కొనసాగింది. కాని యిప్పుడు కలిసి ఒకే రాష్ట్రంలో వున్నా కూడా విడిపోవాలన్న కలతల జీవనం కొనసాగుతోంది.

గతంలో కేవలం శ్రీ కృష్ణదేవరాయల ఏకచత్రాధిపథ్య నేపధ్యంలో మాత్రమే తెలుగుజాతి ఓ రెండుదశాబ్దాల కాలం పాటు ఏకదేశీయతని అనుభవించింది. తర్వాత ఆంగ్లేయులు వచ్చి ఆంధ్రులని, తెలంగాణీయులని విడదీసి అణగదొక్కేసారు. తెలుగు రాజ్యం అప్పుడే రెండు ముక్కలయింది. ఆ చెడుకాలాన్నిచవి చూసి కూడా తెలుగు జనం యిప్పుడన్నా కలిసి జీవిద్దామన్న ఆదర్శాన్ని, ఆకాంక్షని నిలుపుకో లేక పోతున్నారు. ఆరకంగా అసలు జాతి పరంగానే సమైక్యత సంప్రాప్తించ్చేట్టుగా లేదు.. అందుకు దాని పైన వివరించిన చారిత్రిక ఆధారాలున్నాయి. పైగా ఆంధ్రులు ఆర్య సంతతికి చెందినవారిగా , తెలంగాణీయులు ద్రవిడజాతికి చెందినవారిగా చరిత్ర వక్కాణిస్తోంది… అలాంటప్పుడు సంఘీ భావం ఎలా సమకూరుతుంది ?

ఇక సాహితీ సంస్కృతుల పరంగాచూస్తే కొన్నిబేధాలు మాత్రమే కనిపిస్తాయి. ఆర్యుల సంస్కృతికి చెందిన సంస్కృత భాషా ప్రభావం కేవలం ఉభయ గోదావరి జిల్లాలలో మాత్రమే కనిపిస్తుంది . అది సాహితీ పరంగా కూడా రుజువు చేయబడింది. మిగతా జిల్లాలలో జనం మాట్లాడే తెలుగు భాషలో సంస్కృత పద ప్రయోగాలు కనిపించవు…వినిపించవు.

‘కుమారసంభవం’ కావ్యంలో ‘మను మార్గ కవిత లోకంబున ఆంధ్ర విషయంబున దేశి కవిత బుట్టించి తెనుగున జన చాళుక్య రాజులు మొదలుగా బలువుర్ ‘ అను నన్నెచోడుని పద్యమే అందుకు నిదర్శనం. అక్కడే ఆంధ్ర భాషకు తెలుగు భాషకు తేడా కనిపిస్తుంది . ఆంద్ర ప్రాంతానికి చెందిన కవులు సంస్కృత భూయిష్ట మైన కవితా మార్గాన్ని ఎన్నకున్నారు. తెలంగాణాకి చెందినా కవులు కవులు తేనెలొలుకు అచ్చతెలుగు పదప్రయోగాలని పాటించారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ‘నన్నయ’ విరచిత మహాభారతంలోనూ, తెలంగాణాకి చెందిన ‘ పోతన ‘ భాగవతంలోనూ ఈ తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి.
అంతే కాకుండా ‘పాల్కురికి సోమన ‘ ‘ద్విపద’ పద్యసంప్రదాయాన్ని సృష్టించి తెలుగును మరింతమనోరంజకం గావించాడు. నేటి ‘గేయం’ కానీ ‘పాట ‘ కానీ ఆ ‘ద్విపద’ నుంచి పుట్టిందేనని యిక ప్రత్యేకంగా చెప్పనవసరం లెదు. ఆయన కృతి ‘బసవ పురాణం ‘ కావ్యం అతి సామాన్యులకు కూడా సులువుగా అర్థం అవుతుంది.

అయితే సాహిత్య పరమైన ఆంధ్ర శబ్దమే కాకుండా ప్రాకృతవాంజ్గ్మయంనూ, బౌద్ధ సాహిత్యంలోనూ ,నాట్య శాస్త్ర్యం లోనూ , అయితరీయ బ్రాహ్మణీయంలోనూ కేవలం ఆంధ్ర శబ్దమే వినిపిస్తుంది. తెలుగు అనే పదం ఎక్కడా కనిపించదు. వ్యాస భారతంలో సహదేవుడు ఆంధ్రులను చిత్తుగా ఓడిస్తాడు . చివరికి వాల్మీకి రామాయణం లో కూడా కిష్కింధాకాండ నలభయ్ ఒకటవ శ్లోకంలో ఆంధ్రశబ్దం కనిపిస్తుంది. ఆ శ్లోకంలో సుగ్రీవుడు ఆంద్రదేశ ప్రసక్తిని తీసుకొస్తాడు. మరి అప్పుడు ఆ రెండు యుగాల్లో తెలుగెక్కడ ? నేడు యింత గొడవల్ని పలికిస్తోన్న తెలుగేమయింది ?

నన్నయ తర్వాత మహాభారత విరాటపర్వ ఆంధ్రీకరణ ఆరంభంలో ‘ఆంధ్ర కవితా విశారదుండు విద్యదాయితుండి నలరించె నన్నయభట్టు దక్షతన్’ అంటూ నన్నయని కీర్తించాడు తిక్కన. ‘శేషోన్నయం ఆంధ్ర భాష సుజనోత్సవ మొప్పగ నిర్వచించి …’ అంటూ ‘నృసింహ పురాణం ‘ పదిహేడవ పద్యంలో కూడా ఆంద్ర శబ్ద ప్రయోగం జరిగింది. ఆ తర్వాత కూడా పలు కవులు కేవలం ఆంధ్ర శబ్దాన్నే వినియోగించారు. యిలా ఎన్నో ఆధారాలు ఆంద్ర- తెలుగు భాషా ప్రయోగాలనీ, వివరాలనీ మనకందిస్తాయి

ఆ రకంగా భాషలో కొద్ది తేడాలున్నా నేటివరకూ యావత్ తెలుగు జాతి మాత్రం ఓ జోడెద్దుల యానంలా నాటినునుంచి నేటి వరకూ తన ప్రయాణాన్నికొనసాగిస్తూనే వుంది . అలాంటి యుగయుగాల జాతీయమైత్రీ బంధాన్ని తెగతెంపులు చేయడానికి ప్రయత్నిస్తోన్న నేటి ఈ రాజకీయ అనైక్య వ్యవస్థలు పోషిస్తున్న అరాచకశక్తుల్ని ఎవరు ఎలా అరికట్టాలో ‘ఆంధ్ర ప్రదేశ్’ ర్రాష్ట్ర ప్రజలే నిర్ణయించాలి.
…………………………………………………………. సర్వేజనా సుఖినోభవంతు ………………………………………

Send a Comment

Your email address will not be published.