పేదరిక సమస్య

దేశంలో 2015 నాటికి పేదరికం 22 శాతానికి తగ్గిపోతుందని ప్రణాళికా సంఘం తెలియజేసింది . 1990లో 51 శాతం ఉన్న పేదరికం 25 ఏళ్లలో సగానికి తగ్గిపోవడం అంటే విశేషమే. మరో మూడు నాలుగేళ్లలో చైనా భారత దేశాల్లో షుమారు 32 కోట్ల మంది పేదలు తమ పేదరికం నుంచి బయట పడతారని ఐక్య రాజ్య సమితి సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల నివేదికలో తెలిపింది. నిజానికి ప్రపంచం లోని మొత్తం పేదలలో మూడవ వంతు మంది భారత దేశంలోనే ఉన్నారని ఒకప్పుడు ప్రపంచ బ్యాంకే తెలియజేసింది. అంతే కాక దేశంలో 41.6 శాతం మంది ప్రజలు సగటు దినసరి ఆదాయం పట్టణాల్లో అయితే రూ. 21.6 అనీ, గ్రామాల్లో అయితే రూ. 14.3 అని కూడా అంచనా వేసింది.

భారతదేశంలో పేదరికం అత్యధికంగా వుంది. అయితే దీన్ని మదింపు చేయడానికి సరిఅయిన విధానమేమీ లేదు. దేశంలో 37 శాతం మంది ప్రజలు దారిద్రియ రేఖ దిగువున వున్నారని టెండూల్కర్ కమిటీ పేర్కొంది. ఆ నివేదికను ప్రణాళికా సంఘం ఆమోదించింది. అర్జున్ సేన్ గుప్తా నివేదిక ప్రకారం దేశంలో 77 శాతం మంది రోజుకు 20 రూపాయల కంటే తక్కువ ఆదాయంతో జీవితం గడుపుతున్నారు. షుమారు 50 శాతం మంది భారతీయులు దారిద్రియ రేఖ దిగువున వున్నారని ఎస్. సి. సక్సేనా నివేదిక కూడా చెబుతుంది. ‘అక్సఫోర్డ్ పోవేర్టి అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ’ భారత దేశంలోని పేదరికం పై బహుళ కోణ పేదరిక సూచీ (ఎమ్. పి. ఐ) సహాయంతో అధ్యయనం చేసి 64.5 కోట్ల మంది భారతీయులు పెదలేనని, ఇందులో 42 కోట్ల మంది 8 ఉత్తర, తూర్పు భారతీయ రాష్ట్రాల్లో నివసిస్తున్నారని వెల్లడించింది. నిజంగా ఇది పెద్ద సంఖ్యే. షుమారు 26 నిరుపేద ఆఫ్రికా దేశాల్లో కూడా పేదల సంఖ్య 41 కోట్లు దాటలేదు.

విచిత్రమేమిటంటే దేశ జి డి పి వృద్ధి రేటు 9 శాతానికి పెరిగినప్పటికీ, దేశంలో పేదరికం మాత్రం సర్వ వ్యాప్తమై పోయింది. గ్రామీణ ప్రాంతాల్లో 70 శాతం మంది పేదరికంలోనే మగ్గుతున్నారు. ప్రపంచంలో భారత్ అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థే కానీ దాని సంపద మాత్రం జనాభా కంతటికీ సరిగ్గా పంపిణీ జరగటం లేదన్నది ఆర్ధిక వేత్తల అభిప్రాయం. దేశంలో భౌతికంగా అభివృద్ధి చెందుతోంది కానీ కనీస వేతనాలు, విద్య, ఉపాధి, ఆరోగ్య సంరక్షణ వంటి సామాజిక సూచికల పరిస్థితి మాత్రం అధ్వాన్నంగా వుందని ఆర్ధిక వేత్తలు వాదిస్తున్నారు. ప్రజారోగ్య సంరక్షణ మీద భారత్ ఖర్చు చేస్తున్నది జి డి పి లో కేవలం ఒక్క శాతం మాత్రమే. చైనా, బ్రెజిల్, రష్యా దేశాలు 3 శాతానికి పైగా ఖర్చు చేస్తున్నాయి.

ప్రపంచంలో ఏ దేశమూ పేదరిక నిర్మూలనకు ఎక్కువ కాలం పోరాటం జరుపలేదు. అనేక అభివృద్ధి చెందిన దేశాలు పదేళ్ళ కాలంలో అనుకున్న లక్ష్యాలు సాధించి తమ ప్రజలను పేదరికం నుండి గట్టేక్కించాయి. కానీ జి డి పి లో వృద్ధి చెందుతున్న భారత్ మాత్రం అరవై ఏళ్లుగా పేదరికం పై పోరాటం సాగిస్తోంది. 1950 లలో చేపట్టిన పేదరిక నిర్మూలన పధకాలు ఇంత వరకూ ఆశించిన ఫలితాలను ఇవ్వక పోవడం దురదృష్టకరం. పూర్తి స్థాయిలో అభివృద్ధి సాధించాలన్నా అగ్ర రాజ్యంగా గుర్తింపు పొందాలన్నా భారత్ ఈ పేదరిక సమస్యను అతి తక్కువ కాలంలో పరిష్కరించాల్సి వుంటుంది. నిజానికి 70 నుంచి 90 వరకు పేదరిక నిర్మూలన పధకాల వల్ల పేదరికం 60 శాతం నుంచి 35 శాతానికి తగ్గిపోయింది కానీ, ప్రపంచీకరణ, సరలీకరణలు ఊపందుకున్న తరువాత పేదరికం పరిస్థితి మళ్ళీ యధా స్థానానికి చేరుకుంది.

అర్దికవేత్తలు దీనికి కారణాలు కనుక్కొని పరిష్కార మార్గాలు అన్వేషించాల్సి వుంది. దేశంలో దారిద్ర్య రేఖ ద్వారా పేదరికాన్ని అంచనా వేయడం మొదటి నుండీ వివాదాస్పదంగానే ఉంది. నివాసం, పౌష్టికాహారం, దుస్తులు, పారిశుధ్యం, ఆరోగ్య సంరక్షణ, ఉపాధి, కనీస వేతనాలు తదితర సౌకర్యాలు మృగ్యమైనవారిని పేదలుగా పరిగణించడం జరుగుతోంది. అయితే, అనేక వర్గాలను ఈ పేదల జాబితాలో చేర్చక పోవడం దారిద్ర్య రేఖ అంచనాలను తలక్రిందుల చేస్తుంది. ఉదాహరణకు, అనేక కులాలు, జాతులు, ముఖ్యంగా దళితులు, మహిళలు, కొన్ని మైనారిటీ వర్గాలను పేదరికం మదింపు లో పరిగణన లోనికి తీసుకోవడం లేదు.

దేశంలో 50 శాతం మంది ప్రజలకు నివాసమే లేదు. షుమారు 70 శాతం మందికి మరుగుదొడ్ల సౌకర్యం లేదు. 35 శాతం మందికి మంచి నీటి సౌకర్యం అందుబాటులో లేదు. 85 శాతం గ్రామాలలో ఉన్నత పాటశాలలు లేవు. ఇందులోనే 40 శాతం గ్రామాలకు రహదారి సౌకర్యం కూడా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రణాళికా సంఘం ఏ అంచనాల ప్రకారం 2015 నాటికి పేదరికం సగానికి తగ్గుతుందని హామీ ఇస్తుందో అంతు బట్టడం లేదు. అనేక వర్గాలను సామజిక వర్గాలు గానే గుర్తించనపుడు, దేశంలో సామాజిక అంశాలన్నీ నిర్లక్ష్యానికి గురౌతున్నపుడు ఇటువంటి ఆశా భావాలను వ్యక్తం చేయడం అర్ధరహితమనే చెప్పాలి. సమాజంలో అటువంటి వర్గాలే లేవని భావిస్తే అది వేరే విషయం. సామజిక సూచికలకు ప్రాధాన్యం ఇస్తూ విధానాలు రూపొందించనంతవరకూ దేశంలో పేదరిక నిర్మూలన ఓ ఎండమావే అవుతుంది. పైగా షుమారు 70 శాతం మంది ప్రజలు ఇప్పటికీ ప్రాంతాల్లోనే నివసిస్తూ వున్నారు. అంటే గ్రామీణాభివృద్ధికి, వ్యవసాయాభి వృద్ధికి ప్రాధాన్యం ఇచ్చే విధానాలు రూపొందనిదే పేదరిక నిర్మూలన అసాధ్యం. మొదటగా ఈ రంగాలలో పెద్ద ఎత్తున సంస్కరణలు చేపట్టాల్సి ఉందని గ్రహించాలి.

1 Comment

  1. Mallikeshwara Rao gaariki
    Kindly accept our congratulations and best wishes.
    The Bhuvana Vijayam program was a significant contribution to Melbourne Telugu Community. Unfortunately, we could not enjoy the complete presentation. My first suggestion would be to make video clips of it on the TeluguMalli web site for many people like us.
    My
    Wiith reference to

Send a Comment

Your email address will not be published.