ఎంతోమంది త్యాగధనుల అసామాన్య మేధోమధనం. మన ఆచార వ్యవహారాలతో సంఘీభావం. ‘మనం’ అంటే ఒక భాష, సంస్కృతీ, సాంప్రదాయం అని చాటి చెప్పిన వైనం. భారతీయతకే ప్రాముఖ్యం. తెలుగుదనానికి నిలువుటద్దం. స్థానిక సంస్థలతో మమేకం. 20 ఏళ్ల సంరంభం. మరో మైలు రాయిని అధిగమించిన సంబరం.
న్యూ జిలాండ్ వైశాల్యంలో చిన్నదైనా ప్రపంచానికే తలమానికమై విలువలతో కూడిన విజయాలు సాధిస్తున్నారు అక్కడ నివసిస్తున్న మన తెలుగువారు.
ఇక్కడి తెలుగు సంఘం స్థాపించి 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా గత స్మృతులను తలచుకుంటూ భావితరాలకు బాట వేస్తూ సింహావలోకనం చేసుకున్నారు. కనీ వినీ ఎరుగని రీతిలో సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించి గత 20 ఏళ్లుగా ఈ సంస్థ కోసం కష్టపడి చెమటోడ్చిన త్యాగాధనులందరినీ సగౌరవంగా సన్మానించి వారి సేవలకు గుర్తింపుగా జ్ఞాపికలను అందజేసారు. అలాగే చాలామంది సానుభూతిపరులు, స్వచ్చంద సేవకులు, వ్యాపారవేత్తలు, ఆర్ధిక సంస్థలు మూలస్తంభాల్లా నిలిచి సహకారాన్ని అందించినందుకు వారందరికీ సాదరపూర్వకంగా సత్కరించారు.
వివిధ రంగాల్లో నిష్ణాతులైన సంఘ సభ్యుల సలహా సంప్రదింపుల సమ్మేళనం ఈ సంస్థ పురోగాభివృద్ధికి మరియు ఈనాడు చేరుకున్న ఉన్నతి స్థితికి తోడ్పడ్డాయని సంఘ అధ్యక్షురాలు శ్రీమతి అరుణ భూంపల్లి గారు చెప్పారు.
మన బడి విద్యార్ధుల ప్రార్ధనా గీతంతో మొదలైన కార్యక్రమం ఎన్నో పాటలు, శాస్త్రీయ సంగీత నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించింది.
ఈ కార్యక్రమానికి భారతదేశం నుండి “పాడుతా తీయగా” 2013 ప్రధమ బహుమతి గెలుచుకున్న ప్రవీణ్ రావడం ముఖ్య విశేషం. ప్రవీణ్ ఆద్యంతము మంచి పాటలు పాడి అందరినీ అలరించాడు.
ఈ కార్యక్రమానికి వచ్చిన పలువురు ముఖ్యులు:
1. భావ్ ధిల్లాన్, ఇండియన్ కాన్సులేట్
2. కన్వల్జీథ్ సింగ్ బక్షి, పార్లమెంట్ సభ్యులు
3. పరంజీత్ కౌర్ పరమార్
4. శ్రీ వేణుగోపాల్ రెడ్డి బీరం – నేషనల్ పార్టీ
5. జ్యోతి ముద్దం – తెలంగాణా జాగృతి
6. వై రవీంద్రన్ మరియు మురళి – తమిళ సంఘం
7. నరేంద్ర మరియు హర్షద్ – ఇండియన్ అసోసియేషన్
8. హేమంత్ ప్రషార్ – భారతీయ మందిర్