హరిదాసు గానాలు, డూ డూ బసవన్నలు. దారి పొడవునా రంగవల్లులు. గొబ్బెమ్మ పాటలు, గుమ్మడి పూలు, ఆనందానికి నెలవైన ఆడపడుచులు. ఎన్నెన్ని జ్ఞాపకాలు. ఎన్నెన్ని స్మృతులు.
ప్రవాసం వచ్చి ఇవన్నీ జ్ఞాపకలుగానే మిగిలిపోయయా? అంటే కానే కాదు అంటున్నారు Telugu Language and Culture Foundation of Australia సభ్యులు. గత ఐదేళ్ళుగా ప్రతీ సంవత్సరం తు.చ. తప్పకుండా సంక్రాంతి సంబురాలు నిర్వహిస్తూ భావితరాల వారికి స్పూర్తిదాయకంగా నిలుస్తున్నారు. చిన్న పిల్లల చేత సాంప్రదాయ దుస్తులు ధరింపజేసి సంక్రాంతి పర్వదినాన పల్లెల్లో నిర్వహించే ఉత్సాహపూరితమైన పలు కార్యక్రమాలు అభినయింపజేసి వారికి మన మూలాలు వివరిస్తున్నారు.
అన్నింటికంటే ముఖ్యంగా ప్రతీ ఆదివారం మధ్యాహ్నం పిల్లలకు తెలుగు తరగతులు నిర్వహించి మన భాషను నేర్పిస్తున్నారు. అందరూ తమ పిల్లలకు మన సంస్కృతీ, భాష, సంప్రదాయాలు నేర్పించాలన్న ఉత్సహాన్ని వ్యక్తపరుస్తారు కానీ ఆచరణలో మాత్రం అంతంత మాత్రమే. TLCFA మాత్రం భాష పట్ల మమకారం, సంస్కృతీ పట్ల అభిమానంతో గత ఐదేళ్ళుగా సంక్రాంతి నిర్వహించడం ఎంతో ముదావహమైన విషయం. ఈ విషయంలో వారిని పేరుపేరునా అభినందించాల్సిందే.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒక్లీ పార్లమెంట్ సభ్యుడు Steve Dimopoulos మరియు Sam Almaliki – Victorian Multicultural Commissioner విచ్చేసారు. స్టీవ్ TLCFA సభ్యులను అభినందిస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో బహుభాషా ప్రవీణుల అవసరం ఎంతో ఉందని విక్టోరియా ప్రభుత్వం భారతదేశంతో వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవాలని భావిస్తున్న తరుణంలో ఈ మధ్యే విక్టోరియా ప్రీమియర్ శ్రీ డేనియల్ ఆండ్రూస్ అక్కడికి వెళ్ళివచ్చారనీ తెలిపారు. ఇరు తెలుగు రాష్ట్రాలతో విద్య, వాణిజ్యం, పర్యటన తదితర రంగాల్లో సంబంధాలను అధికం చేయాలనీ ప్రభుత్వం భావిస్తున్నట్లు చెప్పారు.
పిల్లలు సాంస్కృతిక కార్యక్రంల్లోనూ పతంగులు ఎగురవేయడం ప్రక్రియలో పాల్గొన్నారు. దివ్య కూచిపూడి నృత్యం అందరినీ అలరించింది. TLCFA సంచాలకులు శ్రీమతి హైమా వుల్పల మాట్లాడుతూ గత ఐదేళ్ళుగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు వివరించారు.